హిందీలో రూపొందిన వెబ్ సిరీస్ 'కంఖజూర'. రోషన్ మాథ్యూ .. మోహిత్ రైనా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైంది. చందన్ అరోరా దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 30వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, హిందీతో పాటు ఇతర భాషలలోను అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: మ్యాక్స్ (మోహిత్ రైనా) శ్రీమంతుల కుటుంబానికి చెందిన 'నిషా'ని పెళ్లి చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వారి ఏకైన సంతానమే 'ఇరా'. 'మ్యాక్స్ డెవలపర్స్' సంస్థకి మ్యాక్స్ మేనేజింగ్ డైరెక్టర్. శార్దూ .. పెడ్రో ఇద్దరూ అతనికి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అలాగే వ్యాపార సలహాదారులు కూడా. మ్యాక్స్ ఎప్పటికప్పుడు ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
అలాంటి పరిస్థితులలో 14 ఏళ్ల తరువాత 'గోవా' సెంట్రల్ జైలు నుంచి అతని తమ్ముడు అషూ ( రోషన్ మాథ్యూ) విడుదలవుతాడు. చిన్నప్పటి నుంచి అతనికి 'నత్తి' ఉంటుంది. కాస్త 'క్రాక్' అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఒక మర్డర్ కేసుపై జైలుకు వెళ్లిన అతను బయటికి రాగానే, అతణ్ణి మ్యాక్స్ ఆప్యాయంగా హత్తుకుంటాడు. తన అన్నయ్యతో పాటు అతని బిజినెస్ వ్యవహారాలను చూసుకోవచ్చని అషూ అనుకుంటాడు. కానీ అందుకు అతను ఒప్పుకోకపోవడంతో చిన్నబుచ్చుకుంటాడు. శాస్త్రి నగర్లో చిన్న రూమ్ తీసుకుని రెంట్ కి ఉంటూ ఉంటాడు.
అదే 'శాస్త్రి నగర్' లో తన కొత్త ప్రాజెక్టును లాంచ్ చేయాలని మ్యాక్స్ భావిస్తాడు. అయితే ఆ ప్రాంతంలో దేశ్ ముఖ్ బాయి రౌడీయిజం నడుస్తూ ఉంటుంది. ఆమె పెద్ద కొడుకు సూర్య .. చిన్న కొడుకు బాబియా అంటే ఆ ఏరియాలోని వాళ్లందరికీ హడల్. తమకు ముట్టవలసిన మొత్తం ముట్టజెబితేనే ఆ ఏరియాలో పనులు మొదలు పెట్టుకోవచ్చని మ్యాక్స్ తో తేల్చి చెబుతారు.ఈ విషయం తెలుసుకున్న అషూ ఏం చేస్తాడు? అతను ఎందుకు జైలుకు వెళ్లవలసి వచ్చింది? అందుకు కారకులు ఎవరు? అనేది కథ.
విశ్లేషణ: శ్రీమంతుడైన అన్నయ్య .. జైలుకు వెళ్లివచ్చిన తమ్ముడు చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అన్నయ్య ఆంతర్యం ఏమిటి? తమ్ముడి ఉద్దేశం ఏమిటి? అనేది ప్రేక్షకులకు చివరివరకూ స్పష్టంగా తెలియకుండా దర్శకుడు ఈ కథను నడిపిస్తూ వెళ్లిన విధానం ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఎవరు ఎప్పుడు ఎలా బయటపడతారు? అనే ఒక సమయం కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు.
అన్నయ్య ధోరణి .. తమ్ముడి ప్రవర్తనపై అనుమానాన్ని కలిగిస్తూ కథను ముందుకు తీసుకువెళ్లే విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ, ఈ మధ్యలో డిజైన్ చేసిన సన్నివేశాలు అంత ఉత్కంఠ భరితంగా అనిపించవు. దేశ్ ముఖ్ బాయి విలనిజం కొంతదూరం కథను నడిపించినా, ఆ తరువాత ఆ ట్రాక్ కూడా పక్కకి తప్పుకుని నిరాశను కలిగిస్తుంది. అన్నదమ్ముల మధ్య నడిచే సీన్స్ కూడా కొత్తగా ఏమీ అనిపించవు. సాదాసీదాగానే కనిపిస్తూ వెళతాయి.
పనితీరు: 'కంఖజూర' అంటూ టైటిల్లో 'జెర్రీ'ని చూపిస్తూ హడావిడి చేయడంతో, కథలో ఏదో గట్టి మేటరే ఉందనుకోవడం సహజం. కానీ అలాంటి కొత్త మేటర్ ను దర్శకుడు అందించలేకపోయాడు. స్క్రీన్ ప్లే కూడా సర్వసాధారణంగానే అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ఊహించుకున్న రేంజ్ లో ఉండదు. మిగతా పాత్రలు తెరపైకి వచ్చి పోతుంటాయి గానీ, ఏ పాత్ర కూడా బలంగా అనిపించదు.
మోహిత్ రైనా.. రోషన్ మాథ్యూ నటన ఆకట్టుకుంటుంది. మిగతా ఆర్టిస్టులు పాత్ర పరిధిలో నటించారు. కథకు తగిన ఖర్చుతో నిర్మాణ విలువలు కనిపిస్తాయి. రాజీవ్ రవి - వినోద్ కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.
ముగింపు: టైటిల్ తో .. ట్రైలర్ తో ఉత్కంఠను రేకెత్తించిన ఈ సిరీస్, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కథాకథనాల పరంగా సాదాసీదాగానే సాగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు.
'కంఖజూర' (సోనీ లివ్) సిరీస్ రివ్యూ!
| Reviews

Kankhajura Review
- హిందీలో రూపొందిన 'కంఖజూర'
- 8 ఎపిసోడ్స్ గా వచ్చిన కంటెంట్
- ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయిన కంటెంట్
- పాత్రల సంఖ్య ఎక్కువ .. వాటి బలం తక్కువ
Movie Name: Kankhajura
Release Date: 2025-05-30
Cast: Mohith Raina, Roshan Mathew, Sarath Jane, Trinetra, Ninad kamat
Director: Chandan Arora
Music: -
Banner: Jar Pictures
Review By: Peddinti
Kankhajura Rating: 2.50 out of 5
Trailer