చిన్న సినిమాలు చాలావరకూ సమయం చూసుకుని ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అలా వచ్చిన సినిమానే 'ది డెవిల్స్ చైర్'. ఈ నెల 22వ తేదీ నుంచి 'ఆహా'లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన అదిరే అభి, ఈ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. గంగ సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: నీలవతి అనే ఒక యక్షకన్య భూమిపైకి వస్తుంది గానీ, తిరిగి తన లోకానికి వెళ్లలేకపోతుంది. ఆమెకి అనేక మాయా శక్తులు ఉంటాయి. కోరిన రూపాలు ధరించడం .. పశువులతో .. పక్షులతో మాట్లాడటం కూడా ఆమెకి తెలుసు. తనకి గల మాయా శక్తుల రహస్యాలను ఆమె ఒక పుస్తకంగా రాస్తుంది. ఆ పుస్తకాన్ని దక్కించుకోవడానికి 'పుండాక్ష' అనే మాంత్రికుడు ప్రయత్నిస్తూ ఉంటాడు.
విక్రమ్ (అదిరే అభి) రుధిర( స్వాతి మండల్) ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉంటారు. విక్రమ్ ఒక సంస్థలో పనిచేసేవాడు. సంస్థకి సంబంధించిన లావాదేవీలలో విక్రమ్ కారణంగా అవకతవకలు జరుగుతాయి. కోటి రూపాయలు విక్రమ్ నొక్కేశాడని తెలిసి జాబ్ లో నుంచి తీసేస్తారు. ఇక రుధిర ఎయిర్ హోస్టెస్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. చేతిలో డబ్బులేక విక్రమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే తన హాబీకి తగినట్టుగా ఒక పాతకాలం నాటి కుర్చీని రుధిర కొనుగోలు చేస్తుంది.
'పుండాక్ష' అనే మాంత్రికుడు ఆ కుర్చీని అదృశ్య రూపంలో ఆవేశించి ఉంటాడు. ఆ మాంత్రికుడు విక్రమ్ కి కనిపిస్తాడు. తాను చెప్పినట్టుగా చేస్తే, అతను అడిగినంత డబ్బును ఇస్తానని చెబుతాడు. తనకి డబ్బు చాలా అవసరమనీ, ఏం చెప్పినా చేస్తానని విక్రమ్ మాట ఇస్తాడు. అప్పుడు పుండాక్ష అతణ్ణి ఏం అడుగుతాడు? అది విన్న విక్రమ్ ఎలా స్పందిస్తాడు? అతని నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఈ కథలో మూడు అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. యక్షిణి నీలావతి .. ఆమె రాసిన పుస్తకం కోసం వెతికే పుండాక్ష .. అతను ఆవేశించి ఉండే కుర్చీ. అయితే ఈ మూడు అంశాలకు సంబంధించిన సన్నివేశాలను సరిగ్గా డిజైన్ చేసుకోకపోవడం నిరాశను కలిగిస్తుంది. వాయిస్ ఓవర్ తో ఉత్సాహంగా మొదలైన ఈ కథ, సన్నివేశాల దగ్గరికి వచ్చేసరికి తేలిపోతుంది.
యక్షిణి పేరు వాయిస్ ఓవర్ లో మాత్రమే కనిపిస్తుంది. పుండాక్ష అనే మాంత్రికుడి పాత్ర ఏ మాత్రం భయపెట్టలేకపోతుంది. ఇక ఈ మధ్యలో హీరో - హీరోయిన్ పాత్రల తీరు కూడా పేలవంగా నడుస్తుంది. కథలోను .. టైటిల్ లోను కనిపించే 'చైర్'ను డిజైన్ చేయించిన తీరు చూస్తేనే, ఏ స్థాయిలో కేర్ తీసుకున్నారనేది అర్థమైపోతుంది. ఎక్కడో మొదలైన కథ, ఆడియన్స్ వైపు కాకుండా ఇంకెక్కడికో వెళ్లిపోయిందనేది స్పష్టమవుతుంది.
పనితీరు: ఈ సినిమా కథాకథనాలు చాలా బలహీనంగా అనిపిస్తాయి. ఒక సినిమా స్థాయికి తగిన నిర్మాణ విలువలు లేవేమో అనిపిస్తుంది. కొంతమంది ఆర్టిస్టుల నుంచి సరైన ఔట్ పుట్ కూడా తీసుకోలేదు. అదిరే అభికి కామెడీపై మంచి పట్టు ఉంది. ఆ వైపు నుంచి కూడా ఆయనను ఉపయోగించుకో లేదు.
కథలో ఎక్కువ భాగం నాలుగు గోడల మధ్య జరుగుతుంది. అందువలన ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సరైన కసరత్తు లేకుండా రంగంలోకి దిగిన భావన కలుగుతుంది. కథ కంటే కూడా లీడ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని చెప్పచ్చు.
ముగింపు: ఎప్పుడైనా కథను బట్టి టైటిల్ ఉండాలి. లేదంటే టైటిల్ కి తగినట్టుగా కథను డిజైన్ చేసుకోవాలి. టైటిల్ లో కనిపించే పవర్ కథలో లేకపోతేనే ఇబ్బంది అవుతుంది. అలా ఈ సినిమా విషయంలోనూ జరిగింది. టైటిల్ ను బట్టి ఆడియన్స్ ఏదో ఊహించుకుంటే, అక్కడ ఇంకేదో జరుగుతుంది. ఇది భయపెట్టే సినిమా కాదు .. కంగారు పట్టే కంటెంట్ అని చెప్పుకోవచ్చు.
'ది డెవిల్స్ చైర్' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews

The Devils Chair Review
- అదిరే అభి హీరోగా 'ది డెవిల్స్ చైర్'
- లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ లేని కంటెంట్
- ఎక్కడా కనిపించని కామెడీ
- వినోదానికి దూరంగా సాగే సినిమా
Movie Name: The Devils Chair
Release Date: 2025-05-22
Cast: Adire Abhi, Swathi Mandal, Chatrapathi Sekhar, Venkat, Chandra
Director: Ganga Saptha Shikhara
Music: Bhishek
Banner: Bobby Films
Review By: Peddinti
The Devils Chair Rating: 1.75 out of 5
Trailer