ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకున్న సిరీస్ గా హార్ట్ బీట్ కనిపిస్తుంది. మొదటి సీజన్ క్రితం ఏడాది మార్చి 8వ తేదీన మొదలైంది. దఫాల వారీగా ఆగస్టు 23 నాటికి 100 ఎపిసోడ్స్ వదిలారు. మెడికల్ డ్రామా అయినప్పటికీ, లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను ప్రాధాన్యతనిస్తూ సాగడం వలన ఎక్కువమంది ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అలాంటి ఈ సిరీస్, సీజన్ 2లో భాగంగా 4 ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ కి తెచ్చింది.
కథ: రీనా (దీపా బాలు) వృత్తిపరంగా ముందుకు దూసుకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆమెకి దగ్గర కావడానికి అర్జున్ (చారుకేశ్) ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అతని పట్ల ఆమె కోపం మాత్రం అంతే ఉంటుంది. ఇక తన భర్త 'దేవ్' ధోరణి 'రతి' (అనుమోల్)కి బాధ కలిగిస్తూ ఉంటుంది. ఆమె జాబ్ మానేసి ఇంటిపట్టూనే ఉంటుంది. రీనాకి సంబంధించిన విషయం, ఆ భార్యాభర్తల మధ్య మరింత అగాధాన్ని సృష్టస్తుంది. తమ తల్లిదండ్రులు ఎప్పటిలా కలిసి ఉండేలా చేయడం కోసం వారి పిల్లలు దివ్య - సిద్ధూ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఆర్కే హాస్పిటల్లో చక్రం తిప్పడానికి ట్రై చేసిన తేజు, ఉన్న ఉద్యోగం కాస్తా పోగొట్టుకుంటుంది. మరో చిన్న క్లినిక్ లో పనిచేస్తూ ఉంటుంది. అయితే తనకి జరిగిన అవమానానికి ఆమె మనసులోనే రగిలిపోతూ ఉంటుంది. ఆమెతో కలిసి అర్జున్ ని దెబ్బతీయాలనుకున్న మదన్, అర్జున్ కారణంగానే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతాడు. రవి సీనియర్ ఫారిన్ వెళ్లడంతో అనిత సీనియర్ కి గుణ దగ్గరవుతాడు. వాళ్లిద్దరూ కలిసి సహజీవనం చేస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే ఇంటర్న్ గా ఆర్కే హాస్పిటల్లో కమలాసన్ .. కిరణ్ .. నీలోఫర్ జాయిన్ అవుతారు. రతి ప్లేస్ కి చీఫ్ డాక్టర్ గా ప్రీతమ్ వస్తాడు. కొత్తగా వచ్చిన కిరణ్ .. రీనాను చూడగానే మనసు పారేసుకుంటాడు. సమయం దొరికితే చాలు, ఆమెకి దగ్గర కావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మిగతా స్టాఫ్ మాదిరిగానే, రతి తిరిగి వస్తే బాగుంటుందని రీనా భావిస్తుంది. ఆమె కోరిక నెరవేరుతుందా? రతి తన భర్తకు చేరువవుతుందా? అర్జున్ - రీనా మధ్య స్పర్థలు తొలగిపోతాయా? తేజు ఏంచేయబోతోంది? అనేది మిగతా ఎపిసోడ్స్ లో తెలియనుంది.
విశ్లేషణ: దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. తల్లీ కూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ ఇది. ఇతర ముఖ్యమైన పాత్రల మధ్య లవ్ ట్రాక్ .. వృత్తి పరమైన స్పర్థలు .. అలకలు .. కోపాలు .. ఆటపట్టించడాలు వంటి అంశాలతోనే ఈ సిరీస్ 100 ఎపిసోడ్స్ తో అలరించింది. కథలోని సమస్యలు అన్ని వైపుల నుంచి బలంగా ఉండటం వల్లనే, సెకండ్ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
గతంలో ఉన్న సమస్యలనే దర్శకుడు హైలైట్ చేస్తూ వెళుతున్నాడు. కథ .. కథనాలు అదే ఫ్లోతో ముందుకు వెళుతున్నాయి. రాకీ పాత్ర ఎప్పటిలానే కామెడీ టచ్ తో అలరిస్తోంది. కాకపోతే రవి సీనియర్ లేని లోటు కనిపిస్తోంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన 'నీలోఫర్' పాత్రను హైలైట్ చేస్తారా? లేదంటే 'తేజు' పాత్ర వైపు నుంచి ఏదైనా కొత్త ట్రాక్ ను సెట్ చేస్తారా? అనేది చూడాలి. మొదటి సీజన్ మాదిరిగానే సెకండ్ సీజన్ కూడా అదే రేంజ్ లో అలరించే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి.
పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. ఆర్టిస్టుల సహజమైన నటన ఈ సిరీస్ కి ప్రధానమైన బలం అని చెప్పాలి. అలాగే ఆయా పాత్రల కోసం ఆర్టిస్టులను ఎంపిక చేసిన విధానం కూడా ఈ సిరీస్ కి కలిసొచ్చింది. ఫస్టు సీజన్ కి ఎన్ని పాత్రలు ఉన్నప్పటికీ, రీనా - తేజు పాత్రలు ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. ఈ సీజన్ లో కూడా ఈ రెండు పాత్రలు ఎలా తలపడతాయా అనే ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.
కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఈ కథకు మంచి సపోర్ట్ ను అందిస్తున్నాయి. సీజన్ 2లో మరికొన్ని ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి వస్తేనే గానీ ఒక స్పష్టమైన అవగాహన రాదు. సీజన్ 1 చూసిన ఆడియన్స్ అంతా కూడా సీజన్ 2 చూడటం ఖాయమని మాత్రం చెప్పచ్చు.
'హార్ట్ బీట్ 2' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
| Reviews

Heart Beat 2 Review
- 100 ఎపిసోడ్స్ గా అలరించిన సిరీస్
- నిన్నటి నుంచి మొదలైన సీజన్ 2
- అందుబాటులోకి వచ్చిన 4 ఎపిసోడ్స్
- అదే ఫ్లోలో వెళుతున్న కథ - కథనం
- ఆసక్తిని పెంచుతున్న ట్రాకులు - పాత్రలు
Movie Name: Heart Beat 2
Release Date: 2025-05-22
Cast: Deepa Balu, Anumol, Charukesh, Amit Bhargav, Yogalakshmi
Director: Deepak Sundarrajan
Music: Saran Raghavan
Banner: A Tele Factory
Review By: Peddinti
Heart Beat 2 Rating: 3.00 out of 5
Trailer