మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో మలయాళంలో రూపొందిన సినిమానే 'పెండ్యులం'. లూసిడ్ డ్రీమింగ్ - టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకి రెజీనా బాబు దర్శకత్వం వహించాడు. విజయ్ బాబు - అనుమోల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జూన్ 16వ తేదీన 2023లో విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఒకసారి పరిశీలన చేద్దాం.
కథ: మహేశ్ నారాయణన్ ( విజయ్ బాబు) ఆయన భార్య శ్వేత .. కూతురు తన్మయి కలిసి ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చేస్తారు. మహేశ్ డాక్టర్ కావడంతో, అతను హాస్పిటల్ కి వెళ్లి వస్తూ ఉంటాడు. ఒక రోజున అతను భార్యా పిల్లలతో కలిసి సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళతాడు. ఒక ప్రదేశానికి వెళ్లిన తరువాత, గతంలో ఆ ప్రదేశంతో తనకి సంబంధం ఉన్నట్టుగా మహేశ్ కి అనిపిస్తుంది. దాంతో అతను గుర్తుచేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
తన్మయి చేసిన పొరపాటు కారణంగా డిక్కీలో కార్ కేస్ ఉండిపోవడంతో, ఆ రాత్రి వాళ్లంతా అక్కడే ఉండిపోవలసి వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మహేశ్ రోడ్డుపక్కన పొదల్లో స్పృహలేకుండా పడిఉంటాడు. రాత్రి తనని ఓ లారీ ఢీ కొట్టిందని శ్వేతతో మహేశ్ చెబుతాడు. ఆ మాటలను ఆమె నమ్మలేకపోతుంది. ఆ లారీ నెంబర్ కూడా తాను చూశానని మహేశ్ చెబుతాడు. ఆ తరువాత అందుకు సంబంధించిన విచారణ చేస్తే, 15 ఏళ్ల క్రితమే ఆ లారీని డిస్పోజ్ చేశారని తెలిసి షాక్ అవుతాడు.
కొన్ని ప్రదేశాలు ఇంతకుముందే చూసినట్టుగా ఎందుకు అనిపిస్తున్నాయి? 15 ఏళ్ల క్రితమే డిస్పోజ్ చేయబడిన లారీ, తనని ఎలా ఢీకొట్టింది? అనే విషయం మహేశ్ కి అర్థం కాదు. ఇలాంటి విషయంలో మంచి అనుభవం ఉన్న జాన్ మాస్టర్ ను కలుస్తాడు. వేరేవారి కలలోకి అతను వెళ్లడం వలన ఈ సమస్య తలెత్తిందని జాన్ మాస్టర్ చెబుతాడు. ఆ కల కన్నది ఎవరనే విషయం తెలిస్తే పరిష్కారం లభిస్తుందని చెబుతాడు. అప్పుడు మహేశ్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేది కథ.
విశ్లేషణ: కలలు కనని వాళ్లంటూ ఉండరు. ఎవరికి వచ్చిన కలలో వారు అనేక ప్రదేశాలను .. దృశ్యాలను చూస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకి తెలియకుండానే మనం అవతలివారి కలలోకి వెళ్లినప్పుడు వాళ్ల కలకు భంగం కలుగుతుంది. ఫలితంగా వారి జీవితాలు ప్రభావితమవుతూ ఉంటాయనే ఒక లైన్ పై ఈ కథ నడుస్తూ ఉంటుంది.
ఇష్టమైన వారిని కలలోకి ఆహ్వానించడం .. ఇష్టపడిన వారి కలలోకి వెళ్లడం సాధ్యమే అనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. అలా వెళ్లడం వలన తలెత్తిన ఒక చిన్న ఇబ్బంది చుట్టూ ఇంట్రెస్టింగ్ గా ఈ కథను నడిపించారు. సమయం - కాలం అనే రెండు అంశాలను అల్లుకుంటూ ఈ కథ కొనసాగుతుంది.
నిజానికి ఈ తరహా లైన్ మనకు కొత్తదే. ఈ కాన్సెప్ట్ కాస్త కష్టతరమైనది కూడా. దేనిని ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడం అంత తేలికైన విషయం. అందువల్లనే ఈ సినిమా మనకి అర్థమవుతున్నాగా అనిపిస్తూనే, అక్కడక్కడా అయోమయంలోకి మనలను నెట్టేస్తూ ఉంటుంది. ఈ కథకి స్క్రీన్ ప్లే బలమని చెప్పాలి. పరిమితమైన పాత్రలతో చేసిన ప్రయోగంగానే ఇది మనకి కనిపిస్తుంది.
ఒక కలను మనం కనడం .. మనకి వచ్చిన కలను గురించి మనం చెప్పడం చాలా తేలిక. కానీ వేరేవారి కలలోకి మనం వెళ్లడం .. వారి కలలో నుంచి మనం బయటకి రాలేకపోవడం అనేది ఇంట్రెస్టింగ్ విషయమే అయినా, అర్థం చేసుకోవడానికి అవస్థలు పడే అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే చాలామందికి ఇది ఒకసారి చూడగానే అర్ధమయ్యే కంటెంట్ కాదు.
ఏ సినిమాలోనైనా ఒకటి రెండుమార్లు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిరావడం తేలికగానే అనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎక్కువైపోతే, ఏది ఫ్లాష్ .. ఏది ప్రస్తుతం అనేది ఆటంకాకుండా పోతుంది. అలా ఈ సినిమాలో కూడా కొంతకథ నడిచిన తరువాత ఏది కల? .. ఏది నిజం? అనేది అర్థం కానీ అయోమయం ఏర్పడుతుంది. అక్కడ క్లారిటీ దొరికిచ్చుకున్న వారికి ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రాణం అనే చెప్పాలి. పరిమితమైన పాత్రలతో దర్శకుడు ఒక ప్రయోగం చేశాడనే అనాలి. అయితే కథలోని కలలు .. ఆ కలలోని మలుపులు ప్రేక్షకులకు ఒక పజిల్ గా మారతాయి. విజయ్ బాబు .. అనుమోల్ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. అరుణ్ దామోదరన్ ఫొటోగ్రఫీ .. జీన్ జాన్సన్ సంగీతం .. సూరజ్ ఎడిటింగ్ కథకి చాలా సపోర్ట్ చేశాయి.
ముగింపు: తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఒక కొత్త కాన్సెప్ట్ ఇది. ఈ కథకు స్క్రీన్ ప్లే ప్రాణం. చాలా వరకూ కథను అర్థమయ్యేలా చెప్పడానికే ట్రై చేశారు గానీ, అక్కడక్కడా ప్రేక్షకులు అయోమయంలోకి జారిపోకుండా ఆపలేకపోయారు.
'పెండ్యులం' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
| Reviews

Pendulum Review
- మలయాళంలో నిర్మితమైన 'పెండ్యులం'
- 2023లో థియేటర్లలో విడుదలైన సినిమా
- ఇంట్రెస్టింగ్ లైన్ తో నడిచే కంటెంట్
- పరిమితమైన పాత్రలతో చేసిన ప్రయోగం ఇది
Movie Name: Pendulum
Release Date: 2025-05-22
Cast: Vijay Babu, Anumol, Devaki Rajendran, Prakash Bare, Amal Dev
Director: Rejin Babu
Music: Jean P Johnson
Banner: Lights On Cinemas
Review By: Peddinti
Pendulum Rating: 2.50 out of 5
Trailer