ఈ మధ్య కాలంలో ఓటీటీ వేదికలపైకి వస్తున్న కన్నడ కంటెంట్ కి ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ పెరిగిపోతోంది. ఇటీవల వచ్చిన 'అయ్యనా మానే' ఆ నమ్మకాన్ని మరింత పెంచింది. ఖుషీ రవి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, రమేశ్ ఇందిర దర్శకత్వం వహించాడు. 'జీ 5'లో ఏప్రిల్ 25 నుంచి 6 ఎపిసోడ్స్ గా కన్నడలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, ఈ రోజు నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథేమిటనేది చూద్దాం.
కథ: ఈ కథ 'చిక్కమగళూర్' నేపథ్యంలో జరుగుతుంది. జాజి (ఖుషీ రవి) సంప్రదాయం తెలిసిన ఓ మధ్యతరగతి యువతి. ఆ ఊరికి 130 కిలోమీటర్ల దూరంలోని ఓ విలేజ్ కి చెందిన దుష్యంత్ తో ఆమె వివాహం జరుగుతుంది. ఊరికి దూరంగా .. విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన అత్తవారింట్లో ఆమె అడుగుపెడుతుంది. ఆమె అలా అడుగుపెట్టగానే మామగారు మల్లికార్జున హఠాత్తుగా కుప్పకూలిపోయి మరణిస్తాడు. ఎవరికి చెప్పకుండానే ఆ కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు జరిపించడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
తన బావ మహేశ్, చనిపోయిన భార్య పుష్పవతి కనిపిస్తుందంటూ అప్పుడప్పుడూ హడావిడి చేస్తుండటం జాజికి భయాన్ని కలిగిస్తుంది. 'పుష్పవతి' బావిలో దూకేసి ఆత్మహత్య చేసుకుంటే, మరో బావ శివ భార్య 'చారులత' నిప్పు అంటించుకుని చనిపోయిందని తెలిసి ఆందోళన చెందుతుంది. ఇక దుష్యంత్ కి ఇంతకుముందే 'బిందు మాలిని'తో వివాహమైందనీ, ఆమె 'ఆస్తమా'తో చనిపోయిందని తెలిసి బిత్తరపోతుంది.
కులదేవత కోపించిన కారణంగా, ఆ ఇంటికి కోడళ్లుగా వస్తున్న వాళ్లంతా చనిపోతున్నారని తెలిసి జాజి భయపడిపోతుంది. తనకి కూడా మరణం తప్పదని కంగారుపడుతుంది. కోడళ్ల పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించి, ఆ తరువాత వాళ్లను చంపేస్తున్నారనే ప్రచారం ఊళ్లో జరుగుతూ ఉంటుంది. ఆ మాట కూడా జాజి చెవిన పడుతుంది. గతంలో జరిగిన మరణాలను గురించిన ఒక పరిశీలన చేసిన ఆమె, ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయం ఏమిటి? వరుస మరణాల వెనుక దాగిన ఆ రహస్యం ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: 'అయ్యనా మానే' అంటే 'అయ్యగారి ఇల్లు' ని అర్థం. అంటే ఇది ఓ గొప్పింటి చుట్టూ తిరిగే కథ. గొప్పింటి భర్త లభించాడనే సంతోషంతో, ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురుకి తొలి రోజునే ఊహించని సంఘటన ఎదురవుతుంది. అందరూ తేడాగా ప్రవర్తించడం .. తనకంటే ముందుగా ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన వాళ్లంతా చచ్చిపోయారని తెలిసినప్పుడు ఆ యువతి భయపడిపోతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఎలా ప్రవర్తిస్తుంది? అనే కథను తయారు చేసుకున్న తీరు, దానిని తెరపై ఆవిష్కరించిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తాయి.
ఒక ఉమ్మడి కుటుంబాన్ని తీసుకుని .. కొన్ని ఆసక్తికరమైన పాత్రలను డిజైన్ చేసుకుని .. వాటిని నడిపించిన తీరు బాగుంది. జరిగిన సంఘటనలను .. జరుగుతున్న సంఘటనలను చూపిస్తూ, ఆ తరువాత ఏం జరుగనుందా? అనే ఒక కుతూహలాన్ని రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ ఈ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.
పనితీరు: 1980 -90ల మధ్య కాలంలో సాగే కథగా మనం దీనిని భావించవచ్చు. ల్యాండ్ లైన్లు మాత్రమే ఉన్న కాలం అది. ఆ కాలం నాటి కథను తెరపైకి ఆసక్తికరంగా తీసుకొచ్చారు. కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను మలచిన తీరు ఈ సిరీస్ ను ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తుంది. ప్రధానమైన పాత్రను పోషించిన ఖుషీ రవి .. ఆమె అత్తగారి పాత్రను పోషించిన మానసి సుధీర్ నటన ఈ సిరీస్ కి హైలైట్ అని చెప్పాలి.
రాహుల్ రాయ్ ఫొటోగ్రఫీ ఈ సిరీస్ కి ప్రధానమైన బలం అని చెప్పాలి. కాలంతో పాటు, సన్నివేశానికి .. సందర్భానికి తగిన లైటింగును మనం ఈ సిరీస్ లో చూడొచ్చు.. అలా చూపించిన కొత్తదనం మనకు నచ్చుతుంది. కెమెరా వర్క్ మనలను కథ జరుగుతున్న కాలానికీ .. లొకేషన్ కి తీసుకువెళుతుంది. ముత్తు గణేశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. రాజేంద్ర ఎడిటింగ్ కూడా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది.
ముగింపు: ఈ మధ్య కాలంలో చాలా క్రైమ్ థ్రిల్లర్లు ఓటీటీ సెంటర్లకు వచ్చాయి. అయితే ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను ఒక కొత్త కోణంలో చూపించిన సిరీస్ గా చెప్పుకోవచ్చు. ఎంచుకున్న కథ .. అది నడిచే కాలం .. తీసుకునే మలుపులు .. చేసిన లైటింగ్ .. ఇలా అన్నీ కుదిరిన సిరీస్ ఇది. ఇతర భాషలలో మాదిరిగానే, తెలుగులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
'అయ్యనా మానే' (జీ 5) వెబ్ సిరీస్ రివ్యూ!
| Reviews

Ayyana Mane Review
- కన్నడలో రూపొందిన 'అయ్యనా మానే'
- కొత్త కోణాన్ని టచ్ చేసిన క్రైమ్ థ్రిల్లర్
- ఆసక్తికరమైన కథాకథనాలు
- ఫోటోగ్రఫి .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్
- ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్
Movie Name: Ayyana Mane
Release Date: 2025-05-16
Cast: Khushi Ravi, Manasi Sudhir, Hitha Chandrashekar, Archana
Director: Ramesh Indira
Music: Muthu Ganesh
Banner: Shruthi Naidu Chitra
Review By: Peddinti
Ayyana Mane Rating: 3.00 out of 5
Trailer