'ది రాయల్స్' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!

| Reviews
The Royals

The Royals Review

  • రొమాంటిక్ కామెడీగా 'ది రాయల్స్' 
  • 8 ఎపిసోడ్స్ గా వచ్చిన సిరీస్
  • కొత్తదనం లేని కథ 
  • ఆసక్తికరంగా లేని కథనం 
  • ఫ్యామిలీతో కలిసి చూడలేని కంటెంట్

'ది రాయల్స్' హిందీలో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్. ప్రియాంక ఘోష్ - నుపుర్ ఆస్థాన దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను 8 ఎపిసోడ్స్ గా నిర్మించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నుంచి 45 నిమిషాల వరకూ ఉంది. ఇషాన్ ఖట్టర్ - భూమి ఫెడ్నేకర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ ఏమిటనేది ఒకసారి చూద్దాం. 

కథ: అది 'మోర్ పూర్'లోని యువనాథ్ సింగ్ రాజావారి ప్యాలెస్. ఆయన భార్య పద్మజాదేవి. వారి సంతానమే అవిరాజ్( ఇషాన్ ఖట్టర్ ) దిగ్విజయ్( విహాన్ సమత్) దివ్యరంజని (కావ్య టెహ్రాన్).  అవిరాజ్ విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటాడు. అతనికి బాధ్యతలు అంతగా పట్టవు. అతని తమ్ముడైన దిగ్విజయ్ కి చెఫ్ కావాలనే ఒక కోరిక బలంగా ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలలో అతను ఉంటాడు. ఇక  దివ్యరంజని స్వభావం చిత్రంగా ఉంటుంది. 

 'మోర్ పూర్' రాజావారు చనిపోయి 6 నెలలు అవుతూ ఉంటుంది. ఆయన పెద్ద కొడుకు అవిరాజ్ తీరికగా ప్యాలెస్ కి చేరుకుంటాడు. ఆయన అలా ప్రవర్తించడానికి కారణం, తండ్రి పట్ల చాలా కాలంగా ఆయనకి ఉంటూ వచ్చిన కోపమే. అవిరాజ్ ప్యాలెస్ కి రావడంతో, తండ్రి రాసిన వీలునామా ప్రస్తావన వస్తుంది. ముగ్గురు పిల్లలూ తనకి సమానమేనంటూ రాజావారు రాసిన ఆస్తుల పంపకాలను గురించి చదువుతారు. నగదు రూపంలో ఉన్న భాగాన్ని 'మోరిస్' అనే వ్యక్తి పేరున రాజావారు రాస్తాడు. 'మోరిస్' ఎవరనేది వాళ్లకి అర్థం కాదు. 

రాజావారు అప్పులు కూడా బాగానే చేశారని తెలిసి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. తాము ఖర్చులు తగ్గిస్తే తప్ప పరువు దక్కటం కష్టమని వాళ్లకి అర్థమవుతుంది. అదే సమయంలో వాళ్లను వెతుక్కుంటూ సోఫియా ( భూమి ఫెడ్నేకర్ ) వస్తుంది. తన వ్యాపార సంస్థ గురించి వాళ్లకి వివరిస్తుంది. తనతో డీల్ కుదుర్చుకుంటే, ఆ ప్యాలెస్ ద్వారా వాళ్లకి కూడా పెద్ద ఎమౌంట్ వస్తుందని చెప్పడంతో అందుకు వాళ్లు అంగీకరిస్తారు. 

ఈ నేపథ్యంలోనే తన తండ్రి గురించిన ఒక నిజం అవిరాజ్ కి తెలుస్తుంది .. అదేమిటి? సోఫియాను ప్రేమిస్తున్న అతని జీవితంలోకి హఠాత్తుగా అడుగుపెట్టే 'ఆయేషా' ఎవరు? రాజావారు వీలునామాలో ప్రస్తావించిన 'మోరిస్' ఎవరు? వ్యాపార పరంగా తన లక్ష్యాలను సోఫియా చేరుకోగలుగుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: రాజావారి ప్యాలెస్ .. విలాసవంతమైన జీవితాలు .. విచిత్రమైన స్వభావాలు .. పైకి కనిపించని సమస్యలు .. అక్రమ సంబంధాలు .. ఆస్తుల పంపకాలు .. ఇలాంటి ఒక నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు .. సీరియల్స్ వచ్చాయి. వెబ్ సిరీస్ లు కూడా వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక కథతోనే ఈ సిరీస్ ను రూపొందించారు. 

రాజావారి ప్యాలెస్ ప్రధాన నేపథ్యం అయినప్పుడు .. ప్యాలెస్ కి తగిన రాయల్ లైఫ్ స్టైల్ ను చూపించవలసి ఉంటుంది. అలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఆ ప్యాలెస్ లో కనిపించే ప్రధామైన పాత్రలను ఆసక్తికరంగా మలచడంలో మాత్రం కొంతవరకే సఫలీకృతుడయ్యాడు. ప్రతి పాత్రలోను బలం తక్కువ .. బలహీనతలు ఎక్కువ అన్నట్టుగా కొనసాగుతూ ఉంటాయి.           

 ఏ పాత్రలోను ఆదర్శం .. నైతిక విలువలు అనేవి కనిపించవు. అప్పటికప్పుడు .. అక్కడికక్కడ అన్నట్టుగా పాత్రలు వ్యవహరిస్తూ ఉంటాయి. బలమైన కారణాలు లేకుండానే మారిపోతూ ఉంటాయి. వాళ్ల ఉద్దేశం .. స్వభావం అర్థం కావాలంటే ఇంకాస్త పరిపక్వత అవసరమేమో అనిపిస్తుంది. 'గే' టచ్ .. 'లెస్బియన్స్' టచ్ .. అక్రమ సంబంధాల టచ్ తో ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలో చనిపోయిన రాజావారిని .. బ్రతికున్న రాణివారిని కూడా వదల్లేదు.

పనితీరు
: ఇది ఒక బలమైన ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే కథలోనే బలం కనిపించదు. పాత్రలు చాలానే ఉన్నాయి .. కానీ వాటిలో విషయం మాత్రం తక్కువ. స్క్రీన్ ప్లేలో ఏ మాత్రం పట్టు కనిపించదు. ఖరీదైన ప్యాలెస్ ను .. ఇన్ని పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. నటీనటులంతా పాత్ర పరిధిలో బాగానే చేశారు. 

కథలో బలం లేకపోవడం వలన .. అనూహ్యమైన మలుపులు లేకపోవడం వలన .. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే కుతూహలం లోపించడం వలన ప్రేక్షకులు ఎలాంటి  భావోద్వేగాలకు లోను కావలసిన అవసరం ఉండదు. నిర్మాణ పరమైన విలువలు బాగానే ఉన్నాయి. ఈ కథ మొత్తానికి ప్యాలెస్ ప్రధానమైన ఆకర్షణ అనే చెప్పాలి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ .. కాస్ట్యూమ్స్ ఫరవాలేదు.

ముగింపు: జోనర్ పరంగా చూసుకుంటే ఇది రొమాంటిక్ కామెడీ సిరీస్. కాకపోతే రొమాన్స్ తప్ప కామెడీ కనిపించదు. కథలో రొమాన్స్ ఒక భాగంగా అనిపించదు. రొమాన్స్ కి ముందు .. రొమాన్స్ కి తరువాత అన్నట్టుగా సన్నివేశాలు సాగుతాయి. ఫ్యామిలీతో కాకుండా సెపరేటుగా చూడవలసిన సిరీస్ ఇది. 

Movie Name: The Royals

Release Date: 2025-05-09
Cast: Bhumi Pednekar, Ishaan Khatter ,Vihaan Samat ,Nora Fatehi
Director: Priyanka Ghose - Nupur Asthana
Music: -
Banner: Pritish Nandy Communications

The Royals Rating: 2.00 out of 5

Trailer

More Reviews