ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా కథానాయకులుగా రాణించిన వారిలో శ్రీ విష్ణు ఒకరు. కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీ విష్ణు. 'సామజవరగమన' తరువాత ఆయన హీరోగా నటించిన మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'సింగిల్'. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక 'సింగిల్' చిత్రంతో శ్రీ విష్ణు మెప్పించాడా? ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నాయా? ఆడియన్స్‌కు ఈ చిత్రం ఎంత వరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం..
కథ: విజయ్ (శ్రీవిష్ణు) ఒక బ్యాంకులో ఇన్సూరెన్స్ ప్రతినిధిగా పనిచేస్తుంటాడు. తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్) తో కలిసి ఉంటాడు. అయితే ఎప్పటికైనా ఓ అమ్మాయిని ప్రేమించాలని ప్రయత్నిస్తున్న విజయ్‌కి ఓ కారు షోరూమ్‌లో సేల్స్ సూపర్‌వైజర్‌గా వర్క్ చేస్తున్న పూర్వను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను రోజు కలుసుకోవాలని, ఆమెతో పరిచయం పెంచుకోవాలని విజయ్ అనుకుంటాడు. అందుకోసం పూర్వ జాబ్ చేస్తున్న కార్ షోరూమ్ వెళ్లి కారు కొంటానని ఆమెతో చెబుతాడు.
కొన్ని రోజుల తరువాత నేను కారు కొనడం లేదని, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో, తనను విజయ్ మోసం చేశాడని భావించి అతడ్ని ఛీ కొడుతుంది. ఇక మరో వైపు అనుకోకుండా విజయ్‌ని కలిసిన హరిణి (ఇవానా) శ్రీవిష్ణుని ప్రేమిస్తుంది. కానీ విజయ్‌కి పూర్వ అంటేనే ఇష్టం. హరిణికి విజయ్ అంటే ఇష్టం. ఇలా ముక్కోణపు ప్రేమకథ నడుస్తుంది. అయితే చివరికి ఏం జరిగింది? విజయ్, పూర్వల ప్రేమ సక్సెస్ అవుతుందా? విజయ్ హరిణి ప్రేమను అంగీకరిస్తాడా? అసలు విజయ్‌కి మూర్తి (రాజేంద్రప్రసాద్)కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఓ సింపుల్ లైన్ చుట్టూ, సింగిల్ లైన్ కామెడీ డైలాగులు, సోషల్ మీడియాలో పాపులర్ మీమ్స్, కొన్ని సెటైరికల్ సంభాషణలు, వాటితో అల్లుకున్న సన్నివేశాలతో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. సినిమాలో కామెడీ సన్నివేశాలు నవ్వించే వన్‌లైనర్స్ వస్తుంటాయి.. వెళ్లిపోతుంటాయి. కానీ వాటిని గుర్తుపెట్టుకునే స్థాయిలో మాత్రం ఉండవు. సింగిల్ ఉన్న హీరో లైఫ్‌లోకి ఇద్దరమ్మాయిలు వస్తే ఎలా ఉంటుంది? అనే లైన్‌కు ఫన్‌ను యాడ్ చేసి ప్రేక్షకులను నవ్వించాలనే దర్శకుడి ప్రయత్నం పూర్తిస్థాయిలో మాత్రం మెప్పించలేదు.
సినిమా ఫస్ట్‌హాఫ్ స్లోగా ఉన్నా.. ఆ పంచ్ డైలాగులతో ఫర్వాలేదనిపించే స్థాయిలో వెళ్లిపోతుంది. ఇక అసలు భారం సెకండాఫ్‌పై పడటం.. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో దర్శకుడి మళ్లీ కామెడీనే నమ్ముకున్నాడు. అయితే ఆ కామెడీ సన్నివేశాలతో కూడా పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. సెకండాఫ్‌ను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా సింపుల్‌గా, ఎటువంటి భారమైన పాత్రలు లేకుండా, ఎమోషన్స్ లేకుండా తీసుకెళ్లాలనే ఆలోచన బాగానే ఉన్నా..
తను లక్ష్యంగా చేసుకున్న ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి కామెడీ సన్నివేశాల రచనలో మరింత శ్రద్ధ పెడితే బాగుండేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలోని ప్రతి డైలాగ్, సంభాషణ నిత్యం మనం సోషల్ మీడియాలో, మీమ్స్‌లో విన్న సంభాషణల తరహాలోనే అనిపిస్తాయి తప్ప ఫ్రెష్ ఫీల్ కలగదు. ప్రస్తుతం ఓటీటీ, వెబ్‌సీరిస్‌ల్లో ఇంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి సాదాసీదా వన్‌లైనర్స్‌తో వెండితెర ఆడియన్స్ మెప్పించడం కష్టమే.
నిజానికి ఇలాంటి సింపుల్ లైన్‌కు హిలేరియస్ ఫన్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్‌కు ఆదరిస్తారు. ఈ విషయాన్ని గతంలో చాలా సినిమాలు ఫ్రూవ్ కూడా చేశాయి. అయితే అసలు స్ట్రాంగ్ కంటెంట్ లేకుండా, సరైన పర్పస్ లేకుండా హీరో చుట్టూ రాసుకున్న ఈ కథను నడిపించడంలో అక్కడక్కడా సాగతీతగా అనిపించడం, ఫన్‌ను జనరేట్ చేయడంలో డైలాగ్స్ ఫన్ తప్ప సీన్స్‌ను సరైన రీతిలో రాసుకోకపోవడం ఈ చిత్రానికి మైనస్‌గా మారింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించుకున్నా, ఈ చిత్రం సెకండాఫ్‌లో మరింత వినోదాన్ని పండించగలిగితే ఆడియన్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉండేది.
అసలు సినిమాలో రాజేంద్రప్రసాద్ గురించి శ్రీ విష్ణు ఎందుకు అంత ఎమోషనల్‌గా ఉంటాడో సరైన రీతిలో దర్శకుడు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అందుకే సెకండాఫ్‌లో వచ్చే రాజేంద్ర పసాద్, శ్రీవిష్ణుల ఏపిసోడ్ అంతగా రక్తికట్టలేదు. కేవలం దర్శకుడు ఆ వన్‌లైనర్స్ , సోషల్‌మీడియా ఫన్ డైలాగ్స్‌పైనే దృష్టి పెట్టి అసలు కథను సింగిల్‌గా వదిలేశాడు. శ్రీ విష్ణు పాత్రను తీర్చిదిద్దే విషయంలో కూడా ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేదనిపించింది.
నటీనటుల పనితీరు: ఈ చిత్రంలో విజయ్‌గా శ్రీవిష్ణు తనదైన శైలిలో కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. అయితే దర్శకుడు సరైన రీతిలో ఆ పాత్రను డిజైన్ చేయకపోవడంతో క్యారెక్టరైజేషన్ అంతగా ఆకట్టుకోదు. అయితే శ్రీ విష్ణు మాత్రం తనదైన శైలిలో నవ్వులు పండించాడు. వెన్నెల కిషోర్ పాత్ర వినోదాన్ని పంచింది. సినిమాలో సింగిల్ లైనర్స్, తనదైన డైలాగ్ డెలివరితో ఆయన ఆకట్టుకున్నాడు.
హరిణిగా ఇవానా, పూర్వగా కేతిక శర్మ కనిపించారు. ఇద్దరూ స్క్రీన్‌పై అందంగా ఉన్నారు. సంభాషణల పరంగా ఈ సినిమాలో కొత్తగా లేకపోయినా భాను, నందు తమ సింగిల్‌లైనర్స్‌తో ఆకట్టుకునేందుకు ట్రై చేశారు.సంగీతం, సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపించాయి. టోటల్‌గా 'సింగిల్' సింపుల్ లైన్‌తో సింగిల్ కామెడీ లైనర్స్ సంభాషణలతో చేసిన ప్రయత్నం ఫర్వాలేదనిపించుకుంది.
అయితే ఈ ఫన్ డోస్ పెంచి, సెకండాఫ్ విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ వేసవిలో మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకునే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో.. థియేటర్‌కు ఆడియన్స్ రావడం ఈ కంటెంట్‌తో 'సింగిల్' ప్రేక్షకులను ఆకట్టుకోవడం సందేహమే..
'సింగిల్' మూవీ రివ్యూ!
Single Review
- యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా 'సింగిల్'
- సింగిల్‌లైనర్స్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం
- సాగతీతగా సెకండాఫ్
- బలహీనమైన కథ, కథనాలు
Movie Details
Movie Name: Single
Release Date: 2025-05-09
Cast: Sree Vishnu, Ketika Sharma, Ivana, Vennela Kishore
Director: Caarthick Raju
Music: Vishal Chandra Shekar
Banner: Geetha Arts
Review By: Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer