రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన వెబ్ సిరీస్ 'ఓం కాళీ జై కాళీ'. రాము చెల్లప్ప దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 5 ఎపిసోడ్స్ గా నిర్మితమైంది. విమల్ .. క్వీన్సీ .. పావనీ రెడ్డి .. దివ్య దొరైస్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ .. బెంగాలి .. మరాఠీ భాషలలోను అందుబాటులోకి వచ్చింది. అలాంటి ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అది ఒక విలేజ్ .. అక్కడ ప్రతి ఏడాది దసరాకి కాళీమాత 'జాతర' జరుగుతూ ఉంటుంది. తమ కోరికలు నెరవేరాలనుకునేవారు అమ్మవారి వేషం ధరించి ఆడటమనేది అక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారం. ఓ సారి అమ్మవారి జాతర జరుగుతూ ఉండగా, గర్భవతిగా ఉన్న ఒక యువతి ప్రాణభయంతో పరుగెత్తుకుంటూ ఆ గ్రామంలోకి ప్రవేశిస్తుంది. గ్రామస్తులంతా కూడా ఆమెను తమ ఆడపడచుగా భావించి, ఆమె ఆశ్రయం కల్పిస్తారు. తనకి తెలిసిన మూలికా వైద్యం చేస్తూ ఆ యువతి అక్కడే ఉండిపోతుంది .. ఆమె పేరే నీల.

ఆ గ్రామంలో గణేశ్ (విమల్) అనే యువకుడికి మంచి పేరు ఉంటుంది. అదే గ్రామానికి చెందిన యువతి (పావనీ రెడ్డి) అతణ్ణి ఇష్టపడుతూ ఉంటుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇది అలా ఉంటే వేరే గ్రామానికి చెందిన రాజకీయనాయకుడిగా భరణి ఉంటాడు. అతని దగ్గర ప్రధానమైన అనుచరులుగా రాజదొరై .. ఏజీ పనిచేస్తుంటారు. వాళ్లిద్దరూ కూడా  'నీల' కోసం చుట్టుపక్కల గ్రామాలన్నీ గాలిస్తూ ఉంటారు. ఆమెను చంపేయమని అనుచరులను పంపిస్తూ ఉంటారు. 

'నీల' ఓ ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఆ ఆడపిల్లకు ఐదేళ్లు వచ్చినా 'నీల'పై ఏదో ఒక సందర్భంలో దాడులు జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్న దాడులకు కారకులు ఎవరని గణేశ్ బృందానికి సందేహం కలుగుతుంది. తనని చంపడానికి ప్రయత్నించేది తన అన్నయ్యలేనని ఆమె చెప్పడంతో వాళ్లంతా కూడా ఆశ్చర్యపోతారు. సొంత చెల్లెలిని చంపడానికి వాళ్లు ప్రయత్నించడానికి కారణం ఏమిటి? ప్రేమించిన యువతితో గణేశ్ వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సమాజంలో నైతిక విలువలు లోపిస్తే, అందువలన ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి కుటుంబం రక్షణగా నిలుస్తుంది. కుటుంబంలోనే నైతిక విలువలు లేకపోతే ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. గ్రామీణ నేపథ్యం .. జాతర వాతావరణం ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలిపే ప్రయత్నం చేశారు.

ఈ సిరీస్ లో ప్రేమ ఉంది .. ఎమోషన్స్ ఉన్నాయి .. రివేంజ్ ఉంది. అయితే వీటన్నిటినీ కలిపి ఒక ఆసక్తికరమైన కథను రెడీ చేయడంలో టీమ్ విఫలమైందని చెప్పాలి. లవ్ ఫీల్ ను వర్కౌట్ చేయలేదు .. ఎమోషన్స్ కోసం సమయం ఇవ్వలేదు. రివేంజ్ సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని కథలో ప్రధానమైన భాగం చేయలేకపోయారు. 

అసలు ఈ సిరీస్ జాతరతోనే మొదలవుతుంది. కథలో జాతరకే ఇచ్చిన ప్రాధాన్యత వేరు. అందువలన జాతరకు కథతో ఏదో సంబంధం ఉంటుందని ప్రేక్షకులు భావించడం సహజం. అయితే దుర్మార్గులను శిక్షించే విషయం వైపు నుంచి జాతరను హైలైట్ చేసి ఉంటారు. కానీ జాతర ఆంతర్యాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయారు. పాత్రలు చాలానే ఉన్నాయి .. వాటి వలన తెరపై హడావిడి పెరిగింది అంతే.     

పనితీరు: ఆర్టిస్టులంతా ఎవరి పాత్రల పరిధిలో వారు నటించారు. అయితే ఆ పాత్రలను డిజైన్ చేయడంలోనే లోపం ఉండటం వలన అవి పెద్దగా కనెక్ట్ కాలేకపోయాయి. రాజేశ్ శుక్లా ఫొటోగ్రఫీ .. జై కుమార్ నేపథ్య సంగీతం .. ప్రవీణ్ ఎడిటింగ్ ఫరవాలేదు. అయితే సన్నివేశాలను డిజైన్ చేసుకున్న తీరు పట్టుగా లేకపోవడం వలన, అందుకు తగినట్టుగానే మిగతా శాఖల పనితీరు కనిపిస్తుంది. 

ముగింపు: ఈ కథలో జాతరకు ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువ. అయితే ఆ జాతరలో కథను ఆసక్తికరంగా కలపలేకపోయారు. కథలో జాతర హైలైట్ అనిపించలేకపోయారు. పక్కాగా లేని స్క్రిప్ట్ కారణంగా పలచబడిపోయిన కథ ఇది.