విజయవంతమైన హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. పార్ట్ 1కు ఉన్న క్రేజ్‌తో 'మ్యాడ్ స్క్వేర్'కు మంచి బజ్ వచ్చింది. దీంతో పాటు విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇదొక ఫన్ ఎంటర్‌టైనర్ అనే అంచనాలు ఆడియన్స్‌లో ఉన్నాయి. ఇక థియేటర్‌లోకి వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందా? ఆడియన్స్ అంచనాలకు రీచ్ అయ్యిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం..
కథ: లడ్డూ (విష్ణు) తన స్నేహితుల ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న దామోదర్ (సంగీత్ శోభన్), అశోక్ కుమార్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్)లు లడ్డూ ఇంటికి చేరుకుంటారు. అయితే అనుకోకుండా పెళ్లికూతురు మరో యువకుడితో పారిపోవడంతో లడ్డూ పెళ్లి ఆగిపోతుంది. దీంతో లడ్డూ ఆ బాధ నుంచి తేరుకోవడానికి స్నేహితులందరూ గోవా ట్రిప్‌కు వెళతారు. ఆ సమయంలోనే గోవాలో ఓ విలువైన లాకెట్ దొంగతనం జరుగుతుంది.
అనుకోకుండా అది ఈ స్నేహితుల చేతికి వస్తుంది. దీంతో అనుకోని సమస్యల్లో ఇరుక్కుంటారు? వీళ్ల కోసం మ్యాక్స్ (సునీల్), శుభలేఖ సుధాకర్‌లు కూడా అన్వేషిస్తుంటారు? ఇక అసలు జరిగిందేమిటి? వీళ్లు ఈ సమస్యను ఎలా బయటపడ్డారు? అనేది చిత్ర కథ..
విశ్లేషణ: ఈ సినిమా మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఈ చిత్ర కథలో ఎటువంటి లాజిక్‌లు లేవు. వినోదమే ప్రధానంగా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. లడ్డూ పెళ్లి ఏపిసోడ్స్‌కు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ అందర్ని అలరించే విధంగా ఉంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా, సాగతీతగా అనిపించినా, తదుపరి సన్నివేశంలో వచ్చే హిలేరియస్ ఫన్ కవర్ చేసింది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్‌గా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
సినిమాలో ఫస్ట్‌హాప్ అంతా లడ్డూ పెళ్లి చుట్టే తిరుగుతుంది. పెళ్లి కోసం డిజైన్ చేసిన కామెడీ బాగా పండింది. ముఖ్యంగా లడ్డూ పెళ్లిలో, పెళ్లి కూతురు పారిపోయే ఏపిసోడ్, అక్కడ హీరోలు, నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు చేసే హడావుడి బాగా వర్కవుట్ అయ్యింది. కమెడియన్స్ సునీల్, సత్యం రాజేష్‌ల పాత్రలను దర్శకుడు ఎంతో ఫన్‌గా, వైవిధ్యంగా డిజైన్ చేశాడు. ఆ పాత్రలు చేసే కన్‌ఫ్యూజన్ కామెడీ కూడా ప్రేక్షకులను కావాల్సినంత వినోదాన్ని అందించింది.
అయితే 'మ్యాడ్'లో ఉన్న కాలేజీ వాతావరణం, అక్కడ హడావుడి ఈ పార్ట్‌లో లేకపోవడం, కాలేజ్ ఫన్‌లో ఉన్న కిక్, 'మ్యాడ్ స్క్వేర్‌లో లేకపోవడం కాస్త మైనస్‌గానే అనిపించింది. అంతేకాదు ముఖ్య పాత్రలకు జంటగా హీరోయిన్స్ లేకపోవడం కూడా వెలితిగానే అనిపించింది. ఫస్ట్‌హాఫ్ సరదా సరదాగా హిలేరియస్ ఫన్‌తో కొనసాగితే, సెకండాఫ్‌లో ఫస్ట్‌హాఫ్‌కు మించిన వినోదం ఉంది. భీమ్స్ పాటలు థియేటర్‌లో ప్రేక్షకుల్లో హుషారు తెప్పించాయి. లడ్డూ గాని పెళ్లి పాటతో పాటు స్వాతి రెడ్డి పాటలు మంచి జోష్‌ను నింపాయి. ఈ సినిమా నిడివి కూడా కేవలం 2 గంటల 7 నిమిషాలతో ఉండటంతో సన్నివేశాలు అన్ని కూడా పరుగెత్తాయి. దాంతో ఆడియన్స్ కూడా ఎక్కడా కూడా నిరాశ చెందే అవకాశం ఉండదు.
నటీనటుల పనితీరు: నార్నే నితిన్, రామ్‌నితిన్, సంగీత్ శోభన్, విష్ణులు మరోసారి ఆడియన్స్ ఎంటర్‌టైన్ చేసే పాత్రల్లో ఎంతో హుషారుగా, ఎనర్జీతో కనిపించారు. వాళ్ల ఎనర్జీయే సినిమాకు ప్లస్ పాయింట్. దర్శకుడు రాసిన సన్నివేశాలకు వీళ్ల నటన తోడవ్వడంతో ఆ సీన్స్ మరింత హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అందరి నటనలోనూ మరింత ఎనర్జీ, మెచ్యూరీటి, డైలాగ్ డెలివరీ, డిక్షన్‌లో బెటర్‌మెంట్ కనిపించింది. భాయ్ పాత్రలో సునీల్ మెప్పించాడు. 'పుష్ప' తరువాత సునీల్‌కు లభించిన మరో వైవిధ్యమైన పాత్ర ఇది.
లైలా పాత్రలో ప్రియాంక జువాల్కర్, పోలీస్ ఆఫీసర్‌గా సత్యం రాజేష్ తమ పరిధుల మేరకు నటించారు. ముఖ్యంగా లడ్డూ తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ నవ్వులు పూయించాడు. భీమ్స్ సంగీతం సినిమాలో హుషారును నింపింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ చిన్న పాయింట్ చుట్టూ హిలేరియస్ ఫన్‌తో, వైవిధ్యమైన పాత్రలతో మంచి వినోదాన్ని పండించడంలో సఫలీకృతుడయ్యాడు. అంతేకాదు సినిమా నిడివి కూడా పెరగకుండా, అనవసరమైన సన్నివేశాలు జత చేయకుండా అతను తీసుకున్న జాగ్రత్త వల్లే నేడు సినిమా ఎటువంటి విసుగు లేకుండా ఎంటర్‌టైన్ చేసిందని చెప్పొచ్చు.
నిడివి కోసం మరిన్ని సన్నివేశాలు జత చేసి ఉంటే ఖచ్చితంగా అది సినిమాకు మైనస్‌గా మారేది. ముఖ్యంగా 'మ్యాడ్ స్క్వేర్' కథలోకి వెళ్లే ముందు 'మ్యాడ్' చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలతో.. ఫన్ డైలాగులతో ఆ సినిమాను రీక్యాప్ వేయడం అనేది దర్శకుడి మంచి ఐడియాగా చెప్పొచ్చు. దీని వల్ల మ్యాడ్ స్క్వేర్' కథలోకి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ కాగలిగారు.
టోటల్‌గా ఎటువంటి అంచనాలు లేకుండా, లాజిక్‌లు ఆలోచించకుండా, వినోదాన్ని కోరుకునే వారికి 'మ్యాడ్ స్క్వేర్' ఇచ్చే వినోదంతో పూర్తి సంతృప్తి చెందుతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీకెండ్‌లో ఫ్యామిలీతో ఈ సినిమా మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుంది. కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
'మ్యాడ్ స్క్వేర్' సినిమా రివ్యూ
MAD Square Review
- వినోదాత్మకంగా 'మ్యాడ్ స్క్వేర్'
- ఆకట్టుకునే లడ్డూ పెళ్లి ఏపిసోడ్
- టైమ్ పాస్ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుంది
Movie Details
Movie Name: MAD Square
Release Date: 2025-03-28
Cast: Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin, vishnu
Director: Kalyan Shankar
Music: Bheems Ceciroleo
Banner: Sithara Entertainments , Fortune Four Cinemas
Review By: Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer