హిందీలో 'క్రష్డ్' సిరీస్ నాలుగు సీజన్స్ గా 'అమెజాన్ మినీ ప్లేయర్' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2022 జనవరిలో ఫస్టు సీజన్ 6 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్ లో మరో 6 ఎపిసోడ్స్ ను సీజన్ 2 గా వదిలారు. 2023 నవంబర్లో 3వ సీజన్ .. 2024 ఫిబ్రవరిలో 4వ సీజన్ పలకరించాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. 

కథ: లక్నో సెంట్రల్ కాన్వెంట్ స్కూల్ నేపథ్యంలో సాగే కథ ఇది. సంవిధాన్ శర్మ ( రుద్రాక్ష జై స్వాల్)  ఆద్య మాధుర్ ( ఆద్య ఆనంద్) ప్రతీక్ (నమన్ జైన్) జాస్మిన్ (ఉర్వి సింగ్) సాహిల్ (అర్జున్) వీళ్లంతా కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటారు. జాస్మిన్ ను తొలిసారి చూడగానే సంవిధాన్ మనసు పారేసుకుంటాడు. అయితే ఆమె వైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం అతనిని నిరాశకి గురిచేస్తుంది. అప్పుడే జాస్మిన్ ఫ్రెండ్ ఆద్యపైకి అతని దృష్టి వెళుతుంది. 

అప్పటి నుంచి అతను ఆద్యను ఆరాధించడం మొదలుపెడతాడు. ఆద్యకు కవితలు చదవడమన్నా .. రాయడమన్నా చాలా ఇష్టం. ఆ విషయంలో తనకి నైపుణ్యం లేకపోవడం సంవిధాన్ కి అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. కవితలు రాయడంలో మంచి ప్రవేశము ఉన్న సాహిల్ .. ఆద్యను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం మొదలుపెడతాడు.

సంవిధాన్ స్నేహతుడు ప్రతీక్, జోయా (అనుప్రియ కరోలి)న ముగ్గులోకి దింపుతాడు. ఆద్య - సంవిధాన్ లవ్ ట్రాక్ సాఫీగా సాగేలా అతను సహకరిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో సాహిల్ రాసిన కవితలను సంవిధాన్ రాస్తున్నాడనుకుని అతనికి చేరువైన ఆద్య, ఆ తరువాత నిజం తెలుసుకుని షాక్ అవుతుంది. కవితలను ఇష్టపడే ఆద్య, సాహిల్ వైపు ఆకర్షితురాలు అవుతుందేమోనని సంవిధాన్ సందేహిస్తాడు. అందుకు తగినట్టుగానే ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: స్కూల్ ఫైనల్ లో టీనేజ్ పిల్లల మధ్య నడిచే లవ్ స్టోరీస్ నేపథ్యంలో గతంలో చాలానే వెబ్ సిరీస్ లు .. టీవీ సిరీస్ లు వచ్చాయి. అలా ఆ నేపథ్యంలో వచ్చిన మరో సిరీస్ గా  'క్రష్డ్' గురించి చెప్పుకోవచ్చు. టీనేజ్ పిల్లల అభిరుచులు .. అలవాట్లు .. స్నేహాలు .. ప్రేమలు, వారిని ప్రభావితం చేసే కుటుంబ నేపథ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దర్శకుడు ఈ అంశాలపైనే పూర్తి ఫోకస్ చేశాడు.

టీనేజ్ లో పిల్లలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రేమకి సంబంధించి జరిగే సంఘటనలే వారిని సంతోషంగా గానీ .. బాధగా గాని ఉంచుతూ ఉంటాయి. ఇక తమకి నచ్చిన అమ్మాయికి చేరువ కావడానికి కొంతమంది కుర్రాళ్లు పోటీపడటం .. ఆ విషయంలో వాళ్లలోని అభద్రతాభావం .. ఒకరిపై ఒకరు ఈర్ష్యలు .. గొడవల చుట్టూ అల్లుకుంటూ వెళ్లడం ఈ సిరీస్ లో కనిపిస్తుంది.    

దర్శకుడు ఈ కథను చాలా నిదానంగా .. నింపాదిగా మొదలుపెట్టాడు. ఆ తరువాత కూడా ఈ కథ అదే పద్ధతిలో ముందుకు సాగుతుంది. ఇటు స్కూల్ వైవు నుంచి గానీ .. అటు ఫ్యామిలీ వైపు నుంచి ఎమోషన్స్ ను కనెక్ట్ చేయలేకపోయారు. అలాగే ఎంచుకున్న కాన్సెప్ట్ కి తగిన విధంగా కామెడీనీ  గానీ .. లవ్ ను గాని ఆశించిన స్థాయిలో ప్రెజెంట్ చేయలేకపోయారు. 

పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా కూడా చాలా బాగా చేశారు. ఎర్షాద్ షేక్ - అభిజీత్ చౌదరి ఫోటోగ్రఫి బాగుంది. హృషి కేశ్ పాటిల్ - కార్తీక్ రావు నేపథ్య సంగీతం ఫరవాలేదు. గణేశ్ - మాథ్యూ ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: ఒక కాన్వెంట్ స్కూల్ నేపథ్యాన్ని తీసుకున్న దర్శకుడు, 6 ప్రధానమైన పాత్రల చుట్టూ కథను అల్లుకున్నాడు. అయితే ఈ ఆరు పాత్రల వైవు నుంచి సాగే కథలో అంతగా ఆసక్తికరమైన అంశాలేవీ కనిపించవు. నిదానంగా సాగే స్క్రీన్ ప్లే నిరాశపరుస్తుంది. ఈ తరహా కాన్సెప్ట్ తో ఇంతకుముందు వచ్చిన కొన్ని సిరీస్ లను ఇది బీట్ చేయలేకపోయింది.