కొంతకాలంగా హిందీలో 'ఆశ్రమ్' సిరీస్ నడుస్తోంది. తొలి సీజన్ 2020 ఆగస్టులో 9 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అయింది. అదే ఏడాది నవంబర్ లో రెండో సీజన్ గా మరో 9 ఎపిసోడ్స్ ను అందించారు. 2022లో మూడో సీజన్ నుంచి పార్టు 1గా 10 ఎపిసోడ్స్ ను స్ట్రీమింగుకి తెచ్చారు. ఇక ఇప్పుడు సీజన్ 3కి సంబంధించి పార్టు 2ను 5 ఎపిసోడ్స్ గా ఫిబ్రవరి 27 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
కథ: బాబాజీ (బాబీ డియోల్) 'కాశీపూర్' లోని ఆశ్రమాన్ని అడ్డుపెట్టుకుని .. అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు. బాబాజీ చేసే అక్రమాలకు అతని స్నేహితుడు 'బొప్పా' (చందన్ రాయ్) అండగా ఉంటాడు. వందల కోట్ల ఆస్తులు .. జనాదరణ ఉండటం వలన, రాష్ట్ర రాజకీయాలను బాబాజీ శాసిస్తూ ఉంటాడు. అలాంటి బాబాజీ కారణంగా 'పమ్మి' (అదితి పోహంకర్) అన్యాయానికి గురవుతుంది. తన తల్లిదండ్రులను .. సోదరుడిని కోల్పోయి జైలుపాలవుతుంది.
బాబాజీ చేతిలో రాజకీయనాయకులు .. అవినీతి అధికారులు ఉంటారు .. అనుక్షణం ఆయనను కనిపెట్టుకునే 'బొప్పా' ఉంటాడు. అందువలన బాబాజీ నిజస్వరూపాన్ని ఈ సమాజానికి చూపించాలంటే తాను కూడా అతనిలా నటించక తప్పదని 'పమ్మి' భావిస్తుంది. బాబాజీ పట్ల తొందరపాటుతో వ్యవహరించినందుకు క్షమించమని కోరుతుంది. ఆమె మారిపోయిందని భావించిన బాబాజీ, తన ఆశ్రమానికి తీసుకుని వస్తాడు.
ఆశ్రమంలో ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? బాబాజీని దెబ్బతీయాలంటే ముందుగా 'బొప్పా'ను వశపరచుకోవాలని భావించిన ఆమె, అందుకోసం ఏం చేస్తుంది? బొప్పా ఆమె మాయలో పడతాడా? అతని ద్వారా బాబాజీ ఆటకట్టించాలనే ఆమె కోరిక నెరవేరుతుందా? అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన బాబాజీ, పమ్మి చేతిలో దెబ్బతింటాడా? అనేది కథ.
విశ్లేషణ: కొంతమంది స్వామీజీలకు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఏమీ తెలియదు. జనంలో ఉన్న భక్తిని తమ బలంగా మార్చుకుని ఎదగడం మొదలుపెడతారు. వందలకోట్ల ఆస్తులు .. రాజభవనాలు తలపించే ఆశ్రమాలను నిర్మించుకుంటారు. ఆశ్రమం ముసుగులో అనేక అనైతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవేవి బయటికి రాకుండా కొంతమంది అవినీతి అధికారులు రక్షిస్తూ ఉంటారు. అలాంటి ఒక బాబాజీ కథ ఇది.
ఒక బాబాజీ అలవాటు ప్రకారం ఒక యువతికి అన్యాయం చేస్తాడు. నిజాయితీతో పోరాడి అతని నిజస్వరూపాన్ని బయటపెట్టలేమని భావించిన ఆ యువతి ఏం చేస్తుంది? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ప్రధానమైన పాత్రలపై ఫోకస్ చేస్తూ .. ఈ కథను పట్టుగా నడిపించాడు. 5 ఎపిసోడ్స్ ఎక్కడా బోర్ అనిపించకుండా కొనసాగుతాయి. నిర్మాణపరంగా విలువలు బాగున్నాయి. భారీతనం కూడా ప్రత్యేకమైన ఆకర్షణగానే కనిపిస్తుంది.
పనితనం: బాబీ డియోల్ .. చందన్ రాయ్ ..అదితి పోహంకర్ ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రలను పోషించారు. కథ అంతా కూడా ఈ ముగ్గురి పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఎవరి పాత్రలో వారు మెప్పించారు. మిగతా ఆర్టిస్టులంతా కూడా తమ పాత్రలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు.
చందన్ కౌలి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కథకి అవసరమైన భారీతనాన్ని ఆయన తెరపైకి తెచ్చిన తీరు బాగుంది. అద్వైత్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. మొదటి నుంచి చివరివరకూ కథతో పాటు ప్రేక్షకులు ప్రయాణించడంలో బీజీఎమ్ ప్రధానమైన పాత్రను పోషించింది. సంతోష్ మండల్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది.
ముగింపు: భక్తి ముసుగులో అరాచకాలకు పాల్పడిన కొంతమంది స్వామీజీల చరిత్రను గుర్తుకు చేస్తూ సాగే కథ ఇది. జనాలను నమ్మిస్తూ ఎదిగిన ఇలాంటి స్వామీజీలు చివరికి వారి ముందు దోషులుగా నిలబడక తప్పలేదు. ఎవరి కర్మ ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు అనే సందేశం కూడా ఈ కథలో కనిపిస్తుంది. కంటెంట్ ఆ సక్తికరంగా సాగుతుంది. కాకపోతే అక్కడక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటం వలన, ఫ్యామిలీతో కలిసి చూసే సాహసం చేయకూడదు అంతే!
'ఆశ్రమ్' (సీజన్ 3 - పార్టు 2) సిరీస్ రివ్యూ!
| Reviews

Aashram 3 - Part 2 Review
- హిందీలో రూపొందిన భారీ వెబ్ సిరీస్
- అందుబాటులోకి వచ్చిన మరో ఐదు ఎపిసోడ్స్
- ఆకట్టుకునే కథాకథనాలు
- ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం హైలైట్
- అక్కడక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు
Movie Name: Aashram 3 - Part 2
Release Date: 2025-02-27
Cast: Bobby Deol, Chandan Roy, Adithi pohankar, Tridha Choudary
Director: Prakash Jha
Music: Adwaith
Banner: Prakash Jha productions
Review By: Peddinti
Aashram 3 - Part 2 Rating: 3.00 out of 5
Trailer