'డబ్బా కార్టెల్' (నెట్ ఫిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!

| Reviews
Dabba Cartel

Dabba Cartel Review

  • హిందీలో రూపొందిన 'డబ్బా కార్టెల్'
  • 7 ఎపిసోడ్స్ తో నిర్మితమైన సిరీస్ 
  • ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు .. బలహీనమైన పాత్రలు
  • నిదానంగా .. సాదాసీదాగా సాగే కథ

హిందీలో స్త్రీ ప్రధానమైన పాత్రలతో .. కామెడీ టచ్ తో కూడిన పాత్రలతో వెబ్ సిరీస్ లు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. ఆ తరహాలో రూపొందిన మరో వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్'. షబానా ఆజ్మీ .. జ్యోతిక .. షాలినీ పాండే .. నిమిషా సజియన్ .. అంజలి ఆనంద్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ ముంబై నేపథ్యంలో జరుగుతుంది. షీలా (షబానా ఆజ్మీ) కొడుకు హరి .. కోడలు రాజీ (షాలిని పాండే)తో కలిసి నివసిస్తూ ఉంటుంది. శంకర్ (జిషు సేన్ గుప్తా) ఓ ఫార్మా కంపెనీని రన్ చేస్తూ ఉంటాడు. ఆయన భార్య వరుణ (జ్యోతిక) ఒక బొటిక్ ను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఆర్ధికంగా అది అంత సంతృప్తికరంగా లేకపోవడం ఆమెను నిరాశ పరుస్తూ అంటుంది. శంకర్ సంస్థలోనే హరి పనిచేస్తూ ఉంటాడు. 

 మాల (నిమిషా సజయన్) కొన్ని ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. ఆమెకి సంతోష్ అనే కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. రాజీ ఎంప్లాయిస్ కి 'లంచ్ బాక్స్'ను రెడీ చేసి అందించే బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఈ బిజినెస్ లో మాలతో పాటు, షాహిదా (అంజలి ఆనంద్) కూడా భాగమవుతుంది. సంతోష్ ఇచ్చిన గంజాయిని కూడా ఆ డబ్బాల ద్వారా మాల సేల్ చేస్తూ ఉంటుంది.

ఈ విషయం బయటికి రావడంతో గంజాయికి బదులుగా డ్రగ్స్ ను సప్లయ్ చేయడానికి షాహిదా ..  రాజీ కూడా రంగంలోకి దిగుతారు. సంతోష్ ఇచ్చిన సరుకును డబ్బాల ద్వారా కస్టమర్స్ కి అందజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే శంకర్ ఫార్మా కంపెనీ నుంచి బయటికి వస్తున్న ఇక డ్రగ్ ప్రమాదకరమైనదని భావించిన పాఠక్ అనే వ్యక్తి, ఆ విషయాన్ని బయటపెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఫార్మా డ్రగ్ ద్వారా శంకర్ ఫ్యామిలీ .. డ్రగ్స్ ద్వారా రాజీ ఫ్యామిలీ ఎలాంటి చిక్కులను ఎదుర్కోవలసి వచ్చిందనేది కథ.    

విశ్లేషణ: చాలామంది తమకి ఎలాంటి ఉపాధి లేని సమయంలో, ఏదో ఒక ఒక ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకుంటారు. కొన్ని పనులు భవిష్యత్తులో ఎలాంటి చిక్కుల్లో పడేస్తాయనేది వారికి ఆ సమయంలో అర్థం కాదు. ఒకసారి ఒక తప్పు చేసినవాళ్లు, ఇక ఏ తప్పు చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ లోకం చూస్తుంది. అలాంటి ఒక అనుభవం ఎదురైన ఐదుగురు ఆడవాళ్ల కథ ఇది. 

జీవితంలో ఆలుమగలు ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ, భర్త ఏం చేస్తున్నాడనేది భార్యకి తెలియాలి. భార్య చేసే వ్యాపారాలను గురించి భర్తకి తెలియాలి. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రమాదకరమైన పనులు చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆవిష్కరించిన సిరీస్ ఇది. డబ్బు అవసరానికి సరిపడా ఉన్నంతవరకే అది ఆనందాన్ని ఇస్తుంది. అంతకు మించిన డబ్బు ఆందోళనకు కారణమవుతుందనే దిశగా ఆలోచింపజేస్తుంది. 

అయిదు స్త్రీ ప్రధానమైన పాత్రలతో దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే దర్శకుడు ఇచ్చిన కామెడీ టచ్ సరిపోలేదు. అయిదు ప్రధాన పాత్రలను ఆసక్తికరంగా మలచడంలో .. వినోదభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్ ట్విస్టులు లేకుండా సాదాగా కథ సాగడం కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. 

అయిదు ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులకు నటన పరంగా వంక బెట్టవలసిన అవసరం లేదు. కానీ వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. కామెడీకి మంచి అవకాశం ఉన్నప్పటికీ దానిపై పెద్దగా కసరత్తు చేయలేదు. అలాగే ఎవరి విలనిజంపై కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అందువలన బలమైన కథ లేకుండా .. తేలికపాటి కథనంతో .. నిదానంగా సాగిన సిరీస్ గానే ఇది కనిస్తుంది. 

పనితీరు:  ఈ సినిమా కోసం మంచి ఆర్టిస్టులను తీసుకున్నారు. అయితే వాళ్లు గొప్పంగా చేసేంత విషయం ఆ పాత్రలలో లేదు. అందువలన ఆ పాత్రలు పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. మంచి ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు .. భారీతనం ఉన్న నిర్మాణం .. కంటెంట్ గట్టిగానే ఉండి ఉంటుందని అనుకున్న ప్రేక్షకులకు కాస్త నిరాశ తప్పదనే చెప్పాలి.

ఈషిత్ నరేన్ ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకి భారీతనం తీసుకుని వచ్చారు. ఐదుగురు మహిళలు ధైర్యం చేస్తారు .. కానీ వాళ్లు ఒక బలమైన విలన్ ను ఎదుర్కోవడానికి సమాయత్తం కావడం దిశగా కథ కథలక పోవడం వలన నిరాశ కలుగుతుంది. ఏం జరగనుందో అనే ఒక కుతూహలాన్ని రేకెత్తించలేకపోయిన ఈ సిరీస్ ఓ మాదిరిగా సాగుతుంది.

Movie Name: Dabba Cartel

Release Date: 2025-02-28
Cast: Shabana Azmi, Jyothika, Shalini Pandey, Nimisha Sajayan, Anjali Anand, Sai Thamhankar, Jishusen Guptha
Director: Hitesh Bhatia
Music: -
Banner: Exel Media Entertainment       

Dabba Cartel Rating: 2.50 out of 5

Trailer

More Reviews