'ప్రేమ - స్నేహం' .. ఈ రెండూ కూడా జీవితంలో కడవరకూ కరిగిపోని జ్ఞాపకాలుగా వెంటాడుతూ ఉంటాయి. నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు ఆ రోజులకు సంబంధించిన జ్ఞాపకాలు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి .. ఉల్లాసానికి ఊపిరి పోస్తాయి. అలాంటి ప్రేమ - స్నేహం నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ గా 'సమ్మేళనం' రూపొందింది. 6 ఎపిసోడ్స్ గా నిన్నటి నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అర్జున్ .. రాహుల్ .. శ్రేయ ముగ్గురూ కూడా ఒకే కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు. ఇప్పుడు ఒకే ఫ్లాట్ లో ఉంటూ ఎవరి జాబ్ కి వాళ్లు వెళ్లి వస్తుంటారు. అర్జున్ ఫ్రెండ్ రామ్ చాలా జీనియస్. అతనికి మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అతణ్ణి అర్జున్ సిటీకి పిలికిస్తాడు. రామ్ చాలా సింపుల్ గా కనిపించడం .. నిదానంగా ఉండటం శ్రేయకి చిరాకును కలిగిస్తుంది. ఆ తరువాత అతని గురించి తెలుసుకుని ఫ్రెండ్షిప్ చేస్తుంది. 

రామ్ మిగతావారికి చాలా భిన్నంగా ఉంటూ ఉంటాడు. అతను ఒక కథను రాస్తుంటాడు. తన స్వీయ అనుభవాలతో ఆ కథ కొనసాగుతూ ఉంటుంది. ఆ కథను బుక్ గా వేయించాలనేది అతని కోరిక. అతనిని అర్జున్ ఎంకరేజ్ చేస్తూ, ఆర్ధికంగా కూడా సాయం చేస్తూ ఉంటాడు. మేఘన అనే అమ్మాయిని అర్జున్ లవ్ చేస్తూ ఉంటాడు. అయితే తొలి చూపులోనే మేఘనను చూసి రామ్ మనసు పారేసుకుంటాడు. కానీ ఆ విషయాన్ని మనసులోనే దాచుకుంటాడు. 

 రామ్ ప్రవర్తన .. టాలెంట్ చూసిన మేఘన కూడా అతని పట్ల ఆకర్షితురాలవుతుంది. అయితే ఆమె కూడా ఆ విషయాన్ని అతనికి చెప్పడానికి తడబడుతుంది. రామ్ మనసులో ఏముందనేది శ్రేయ గమనిస్తుంది. తాను సిటీలో ఉండటానికి ఆశ్రయం కల్పించిన అర్జున్ ను మోసం చేయకూడదని రామ్ అనుకుంటాడు. ఆ సమయంలోనే ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటనతో ఎవరెవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది కథ. 

విశ్లేషణ: ఒక అమ్మాయిని ఇద్దరి స్నేహితులు ప్రేమిస్తారు. తన జీవితంలో తనని ఎంతో సపోర్ట్ చేసిన ఆ ఇద్దరికీ ఆ యువతి 'నో' చెప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? ఆమె గతం ఏమిటి? చివరికి ఆమె ఎవరికి సొంతమవుతుంది? అనేది కథ. ఇంతకుముందు ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. కాస్త అటూ ఇటుగా అనిపించే ఎండ్ కార్డులతో కొత్తదనాన్ని చాటుకోవడానికి ప్రయత్నించాయి. 

ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మెయిన్ లైన్ పాతదే. అయితే ఈ జనరేషన్ కి తగిన లైఫ్ స్టైల్ పై .. ట్రీట్మెంట్ పై దర్శకుడు దృష్టిపెట్టాడు. హెవీ ఎమోషన్స్ తట్టుకోలేని పరిస్థితి కావడం వలన లైటర్ వేలో కథను ముందుకు లాగించాడు. చాలా వరకూ సున్నితమైన భావోద్వేగాలతోనే కథ నడుస్తుంది. అరుపులు .. గోలలు .. బూతులు లేకపోవడం వలన హాయిగా కూడా అనిపిస్తుంది. ఈ జనరేషన్ ఇంతేనండీ అనుకుంటే, ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది. 

పనితీరు: ఇది కొంతమంది స్నేహితుల కథ. అనూహ్యమైన మలుపులు .. ఆశ్చర్యపరిచే ట్విస్టులు ఇందులో ఉండవు.  సాధ్యమైనంత వరకూ సహజంగానే కథను చెప్పాలనే ఉద్దేశంతో దర్శకుడి పనితీరు కనిపిస్తుంది. అందువలన ప్రధానమైన పాత్రలలో ఆర్టిస్టులంతా బాగా చేశారు. ఎవరి పాత్రలోనూ 'అతి' అనేది కనిపించదు. కథ వాస్తవానికి దూరంగా కూడా వెళ్లదు. శ్రవణ కుమార్ ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్, శరవణ కుమార్ నేపథ్య సంగీతం ఫరవాలేదు.

ప్రేమ - స్నేహం ఈ రెండూ కూడా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక రకంగా ఈ రెండూ కూడా వ్యక్తిత్వానికి రెండు కళ్ల మాదిరిగా అనిపిస్తాయి.  ఒకదాని కోసం ఒకటి పణంగా పెట్టవలసి వచ్చినప్పుడు సున్నితమైన మనసులు పొందే భావోద్వేగాలే ఈ కథ. సింపుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ యూత్ కి కొంతవరకూ కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.