రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో జియో హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'ఊప్స్ అబ్ క్యా' వెబ్ సిరీస్ వచ్చింది. శ్వేతాబసు ప్రసాద్ - ఆషిమ్ గులాటి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 8 ఎపిసోడ్స్ గా రూపొందించారు. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, తెలుగులోను అందుబాటులో ఉంది. ఈ సిరీస్ కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: రూహి (శ్వేతా బసు ప్రసాద్) ఒక స్టార్ హోటల్లో ఫ్లోర్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఆమెకి, అమ్మ 'పాఖీ' .. అమ్మమ్మ సుభద్రనే లోకం. తన తండ్రి గురించి ఆమెకి తెలియదు .. చెప్పడానికి తల్లి ఇష్టపడదు. ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటులో పనిచేస్తున్న ఓంకార్ ను రూహి లవ్ చేస్తూ ఉంటుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రూహి పనిచేస్తున్న స్టార్ హోటల్ చైర్మన్ కొడుకే సమర్ (ఆషిమ్ గులాటి). అనారోగ్యం నుంచి కోలుకున్న అతను, తన వైవాహిక జీవితంలో అసంతృప్తిగా ఉంటాడు.
సమర్ భార్య అలీషా. ఆమెకి సమర్ పై కంటే కూడా అతని ఆస్తిపాస్తులపై కన్ను ఉంటుంది. ఆమెకి సమర్ ఫ్రెండ్ రాజ్ మల్హోత్రాతో అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది. సమర్ 'స్పెర్మ్' ద్వారా ఆమె గర్భవతి కావాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా జరిగిన పొరపాటు వలన ఆ 'స్పెర్మ్' ను రూహి గర్భంలోకి ప్రవేశపెడుతుంది డాక్టర్ రోషిణి. ఈ విషయం తెలిసి రూహి లవర్ ఓంకార్ షాక్ అవుతాడు. బేబీని తమకి ఇచ్చేయమని సమర్ - అలీషా వేరువేరుగా రూహిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు.
ఇక ఇదే సమయంలో సమర్ హోటల్లో రాజ్ మల్హోత్రా మర్డర్ జరుగుతుంది. ఆమెను సమర్ గానీ .. అతని భార్య అలీషా గాని హత్య చేసి ఉండొచ్చని ఓంకార్ భావిస్తాడు. అలాగే సమర్ హోటల్ కేంద్రంగా సిటీలో డ్రగ్స్ మాఫియా జరుగుతుందనే అనుమానం కూడా ఓంకార్ కి వస్తుంది. ఈ మాఫియా వెనుక 'మాయాసుర్' ఉండొచ్చని అనుమానిస్తాడు. మాయాసుర్ ఎవరు? రాజ్ మల్హోత్రాను ఎవరు హత్య చేశారు? రూహి తండ్రి ఎవరు? అలీషా నేపథ్యం ఏమిటి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ కథ మలుపులు తీసుకుంటుంది.
విశ్లేషణ: రూహి - ఓంకార్, సమర్ - అలీషా అనే రెండు జంటల చుట్టూ ప్రధానమైన కథ తిరుగుతూ ఉంటుంది. రూహి తండ్రి ఎవరు? కథలో హత్యలకు .. డ్రగ్స్ సప్లయ్ కి కారకుడిగా వినిపిస్తున్న మాయాసుర్ ఎవరు? అనే ఈ రెండు ట్రాకులు కూడా ప్రధానమైన కథను కలుపుకుంటూ నడుస్తూ ఉంటాయి. మొత్తం 8 ఎపిసోడ్స్ లో మొదటి 3 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి. ప్రధానమైన అంశాలు ఆడియన్స్ కి పట్టుబడిపోతాయి. ఈ మూడు ఎపిసోడ్స్ పై ఆధారపడే మిగతా ఎపిసోడ్స్ నడుస్తాయి.
4వ ఎపిసోడ్ నుంచి కథలో ఉత్సాహం తగ్గుతుంది. ఫ్యామిలీ నేపథ్యంలోని సీన్స్ తో సాగదీసినట్టుగా అనిపిస్తుంది. 'రూహి' క్యారెక్టరైజేషన్ కూడా తేడా కొట్టేస్తుంది. హీరోతో కూడా కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటే బాగుంటుందనుకుని ఆమె పాత్రను అలా మార్చారని అనిపిస్తుంది. ఇక ఆమె పాత్ర తీరుతెన్నులను ప్రత్యక్షంగా చూస్తూ కూడా, నిన్నే పెళ్లి చేసుకుంటాను .. ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అనే ఓంకార్ పాత్రపై కూడా ప్రేక్షకులకు జాలి కలుగుతుంది.
అలీషా నెగెటివ్ షేడ్స్ ను .. ఓంకార్ ఇన్వెస్టిగేషన్ ను ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించడంలో విఫలమయ్యారు. స్క్రీన్ ప్లే లోపం కూడా కనిపిస్తూ ఉంటుంది. మొదటి నుంచి చివరివరకూ 'వాయిస్ ఓవర్'ను వాడుకుంటూ, కామెడీ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించారు .. కానీ వర్కౌట్ అయింది తక్కువే. 'హుండీ పగలగొట్టడం' అనే మాటను ఎక్కువగా వాడటం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిని కలిగిస్తుంది.
పనితీరు: నిర్మాణ పరమైన విలువలు బాగున్నాయి. కథకి తగిన ఖర్చును చూపించారు. తెరపైకి చాలానే పాత్రలు వస్తాయిగానీ, ప్రధానమైన పాత్రలు పరిమితంగానే కనిపిస్తాయి. ఒకటి రెండు పాత్రలను దర్శకుడు ఎందుకు ప్రవేశపెట్టాడో .. ఎందుకు వదిలేశాడో అనేది మాత్రం అర్థం కాదు. కథను మరీ డీటేల్డ్ గా చెప్పడానికి ప్రయత్నించాడేమో అనిపిస్తుంది. కామెడీ కోసం దర్శకుడు కాస్త హడావుడి చేశాడు గానీ, హడావిడి మాత్రమే ఆడియన్స్ కి కనిపిస్తుంది.
ప్రధానమైన పాత్రలలోని ఆర్టిస్టులంతా మెప్పించారు. జార్జ్ జాన్ పనిక్కర్ కెమెరా పనితనం బాగుంది. కథకి తగిన రిచ్ నెస్ ను తీసుకురావడంలో తనవంతు పాత్రను పోషించాడు. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. కథతో కలిసి ప్రయాణించేలా చేస్తుంది. ఆకాశ్ బంధూ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తుంది.
ముగింపు: ఈ కథకి కావాల్సినంత కామెడీ టచ్ పడలేదు. అలాగే ఓంకార్ .. అలీషా ట్రాకులు వీక్ గా అనిపిస్తాయి. రూహి ఫ్లాష్ బ్యాకు సీన్స్ .. వాయిస్ ఓవర్ కథ ఫ్లోకి అడ్డుపడతాయి. రూహి ఫ్యామిలీ సీన్స్ అవసరానికి మించి ఉన్నాయనే భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే వేగంగా .. గ్రిప్పింగ్ గా ఉండి కామెడీ టచ్ కుదిరి ఉంటే, ఈ సిరీస్ మరిన్ని మార్కులు తెచ్చుకునేదేమో.
'ఊప్స్ అబ్ క్యా' (జియో హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!
| Reviews

Oops Ab Kya Review
- హిందీలో రూపొందిన 'ఊప్స్ అబ్ క్యా'
- తెలుగులోనూ అందుబాటులోకి
- 8 ఎపిసోడ్స్ గా పలకరించే సిరీస్
- 4వ ఎపిసోడ్ నుంచి కాస్త వీక్ గా అనిపించే కంటెంట్
- ఫ్లాష్ బ్యాకులు .. ఫ్యామిలీ సీన్స్ తో నిదానంగా సాగే స్క్రీన్ ప్లే
Movie Name: Oops Ab Kya
Release Date: 2025-02-20
Cast: Sweta Basu Prasad, Aashim Gulati, Jaaved Jaffery, Sonali Kulakarni, Abhay Mahajan
Director: Prem Mistry
Music: -
Banner: A Dice Creation
Review By: Peddinti
Oops Ab Kya Rating: 2.75 out of 5
Trailer