బొమన్ ఇరానీకి నటుడిగా మంచి క్రేజ్ ఉంది. బలమైన .. బరువైన పాత్రలను పోషించడంలో ఆయనకి మంచి అనుభవం ఉంది. అలాంటి ఆయన దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా 'ది మెహతా బాయ్స్'. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథ ఏమిటనేది ఒక లుక్కేద్దాం. 

కథ: శివ్ మెహతా (బొమన్ ఇరాని) తన భార్యతో కలిసి సొంత ఊళ్లో జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన కూతురు అనూ (పూజ సరూప్) అమెరికాలో ఉంటుంది. ఆయన కొడుకు అమయ్ (అవినాశ్ తివారి) ముంబైలో ఒక సంస్థలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆఫీసులో అతను వృత్తి పరమైన సవాలు ఎదుర్కుంటూ ఉంటాడు. తనతో కలిసి పనిచేస్తున్న 'జారా' ( శ్రియా చౌదరి)తో అతను ప్రేమలో ఉంటాడు. ఆయన ఎమోషన్స్ ను ఆమె షేర్ చేసుకుంటూ ఉంటుంది.
    
ఒక రోజున అమయ్ తల్లి మరణవార్త వినవలసి వస్తుంది. వెంటనే అతను 'ముంబై' నుంచి తన స్వగ్రామానికి వెళతాడు. కార్యక్రమాలు పూర్తయిన తరువాత అమయ్ ముంబైకి బయల్దేరతాడు. తండ్రిని తీసుకుని అమెరికా వెళ్లాలని అనూ భావిస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చకచకా పూర్తిచేస్తుంది. అయితే ఆ ఇంటినీ .. భార్య జ్ఞాపకాలను వదిలి వెళ్లడం అతనికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను పక్కన పెట్టవలసి వస్తుందని ఆయన బెంగ పెట్టుకుంటాడు. 

అమెరికా ప్రయాణానికి సిద్ధమైన తరువాత, అమయ్ తో పాటు ఆయన తండ్రి ముంబైలో రెండు రోజులపాటు గడపవలసి వస్తుంది. జనరేషన్ గ్యాప్ వలన వాళ్ల భావలలో .. అభిప్రాయాలలో తేడా  ఉంటుంది. అలాంటి వాళ్లిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి? అనేది కథ. 

విశ్లేషణ: సాధారణంగా మధ్య వయసు దాటిన తరువాత చాలామందికి ఒక చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. భార్యాభర్తలలో ఎవరో ఒకరు అనారోగ్య కారణాల వలన దూరమవుతూ ఉంటారు. వారి జ్ఞాపకాలతో అదే ఊళ్లో .. అదే ఇంట్లో ఉండాలని మిగతావారు కోరుకుంటారు. కానీ వారిని అలా ఒంటరిగా వదిలేయలేక పిల్లలు వారిని తమతో పాటు తీసుకుని వెళ్లి పోవాలనుకుంటారు. ఆ జ్ఞాపకాలకు దూరంగా వెళ్లడానికి పెద్దవాళ్లు చాలా బాధపడతారు. 

ఇక ఒక వయసు వచ్చిన తరువాత మగపిల్లలకు .. తండ్రికి మధ్య ఒక రకమైన వార్ మొదలవుతుంది. తండ్రి సందేహాలు .. ప్రశ్నలు వారికి చిరాకు పుట్టిస్తూ ఉంటాయి. అందువలన తండ్రికి ఎదురుకావడానికి కూడా కొంతమందికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అలాంటి రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ ఇది. భార్య దూరమైన ఒక భర్త, తన భావాలను ఇష్టపడని కొడుకు దగ్గర ఉండవలసి వస్తే ఎలా ఉంటుందనేది ఈ కథ చెబుతుంది.      

ఈ కథ చాలా చిన్నది .. సున్నితమైంది కూడా. నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. కథలో అనూహ్యమైన సంఘటనలు .. మలుపులు ఉండవు. ఎక్కువగా సంభాషణలు .. భావోద్వేగాలతోనే కొనసాగుతుంది. అయితే ఈ భావోద్వేగాలు మనసును కదిలించేలా .. కళ్లు చెమ్మగిల్లేలా లేకపోవడం వలన ప్రేక్షకులకు పెద్దగా ఏమీ అనిపించదు. అయితే పెద్దల మాటలు కాస్త కటువుగా అనిపించినా, అది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని .. మానసికంగా వారిని సిద్ధం చేసే ప్రయత్నమేననే సందేశం కనిపిస్తుంది.   

పనితీరు: ఒక చిన్న పాయింటును పట్టుకుని అల్లుకున్న సింపుల్ కంటెంట్ ఇది. కథాకథనాల పరంగా పెద్దగా ప్రభావితం చేయడమనేది ఏమీ ఉండదు. చాలా తక్కువ పాత్రలతో అలా సాగిపోతూ ఉంటుందంతే.

ప్రధానమైన పాత్రలు నాలుగే .. ఆ పాత్రల చుట్టూనే కథ నడుస్తుంది. ఎవరి పాత్రలో వారు బాగానే నటించారు. కాకపోతే ఆ పాత్రలు అంత బలమైనవిగా  అనిపించవు. ఫొటోగ్రఫీ ..  నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి .. ఎడిటింగ్ ఓకే. కథ ఏదైనా, తరువాత ఏం జరుగుతుంది? అనే ఒక క్యూరియాసిటీ ఉండాలి. అలాంటి అంశం .. అవకాశం లేనప్పుడు ప్రేక్షకులు డీలాపడిపోతారు. ఈ సినిమా విషయంలోను అదే జరిగింది.