'హిసాబ్ బరాబర్' (జీ 5)మూవీ రివ్యూ!

  • హిందీలో రూపొందిన 'హిసాబ్ బరాబర్' మూవీ
  • బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరిగే కథ
  • ప్రధానమైన పాత్రను పోషించిన మాధవన్  
  • సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు 
  • ఫరవాలేదనిపించే కంటెంట్  

మాధవన్ కథానాయకుడిగా హిందీలో 'హిసాబ్ బరాబర్' సినిమా రూపొందింది. సెటైరికల్ యాక్షన్ కామెడీ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాకి అశ్విన్ ధీర్ దర్శకత్వం వహించాడు. శరద్ పటేల్ - శ్రేయన్షి పటేల్ నిర్మించిన ఈ సినిమా, క్రితం ఏడాది నవంబర్ 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 24వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు .. తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

కథ: ఢిల్లీలో రాధే మోహన్ (మాధవన్) రైల్వే టీసీగా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వలన రాధే మోహన్ జీవితంలో నుంచి ఆయన భార్య పక్కకి తప్పుకుంటుంది. అప్పటి నుంచి అతనే కొడుకు 'మనూ' బాధ్యత చూసుకుంటూ ఉంటాడు. రాధే మోహన్ CA చేస్తాడు. అందువలన లెక్కలు చేయడంలో చేయి తిరిగినవాడిగా ఆయనకి పేరు ఉంటుంది. రోజూ ట్రైన్ లో తిరుగుతూ ఉండటం వలన అతనికి పోలీస్ ఆఫీసర్ పూనమ్ ( కృతి కుల్హారి)తో పరిచయం ఏర్పడుతుంది.

 రాధే మోహన్ డబ్బుల విషయంలో .. లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలనే అందరితోను చెబుతూ ఉంటాడు. కేవలం 27 రూపాయల 50 పైసల కోసం అతను ఒక బ్యాంక్ వారిని ముప్పతిప్పలు పెడతాడు. అయితే అదే బ్యాంక్ పెద్ద స్కామ్ కి పాల్పడుతుందనే  అనుమానం ఆ సమయంలోనే అతనికి కలుగుతుంది. ఖాతాదారులు దాచుకున్న డబ్బుకి ఒకటి రెండు రోజుల లేటుగా వడ్డీని జోడించడం వలన ఆ బ్యాంక్ వేలకోట్లను దోచుకుంటుందనే విషయం అతనికి అర్థమవుతుంది.    
   
ఈ విషయంపై అతను లోతుగా పరిశీలన చేయడం మొదలుపెడతాడు. ఆ బ్యాంకు చైర్మన్ మెహతాకి ఈ సంగతి తెలుస్తుంది. ఒక రైల్వే టీసీ తన బ్యాంకు మూలాలనే కదిలించాలని చూస్తున్నాడని తెలియగానే ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఆయన అంతు చూస్తానంటూ రంగంలోకి దిగుతాడు. ఫలితంగా రాధే మోహన్ కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అలాంటి పరిస్థితులలో అతను ఏం చేస్తాడు? అనేది కథ.

విశ్లేషణ: కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారుల ఖాతాల నుంచి నెలకి 5 .. 10 .. 15 రూపాయలు కట్ అవుతూ ఉంటాయి. అయితే వాటిని గురించి ఖాతాదారులెవరూ పెద్దగా పట్టించుకోరు. అందుకు కారణం వారు బిజీగా ఉండటమే. అయితే ఒక రైల్వే టీసీ దృష్టి పెట్టడం వలన, దీని వెనుక వేలకోట్ల స్కామ్ ఉందనే విషయం బయటపడుతుంది. ఈ ఆసక్తికరమైన అంశం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. హీరో ఒక బ్యాంకు స్కామ్ ను వెలికి తీయడానికి చేసే ప్రయత్నాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఆయన అలా చేయడం నచ్చని బ్యాంకు చైర్మన్ .. ప్రతీకారం తీర్చుకోవడం కోసం రంగంలోకి దిగడంతో సెకండాఫ్ కొనసాగుతుంది.

 ఒక సంపన్నుడిని కాపాడటానికి అవినీతి అధికారులంతా ఎలా ఏకమవుతారనేది దర్శకుడు చూపించిన విధానం, సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. రాజకీయనాయకుల వల్లనో .. కొద్దిమంది కోటీశ్వరుల వల్లనో బ్యాంకులు నడవడం లేదు. బ్యాంకులన్నింటినీ నడిపించేవారు సామాన్యులే అనే విషయాన్ని హైలైట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సున్నితమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూనే, సామాన్యులు ఎలా మోసపుతున్నారనేది చూపించిన తీరు ఆలోచింపజేస్తుంది. 

పనితీరు: ఈ కథ అంతా రాధే మోహన్ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో మాధవన్ అలా ఒదిగిపోయాడు. అలాగే ఒక ప్రైవేట్ బ్యాంకు చైర్మన్ గా నీల్ నితిన్ ముఖేశ్ నటన కూడా ఆకట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ గా కృతి కుల్హారి నటన మెప్పిస్తుంది. దర్శకుడు ఈ కథను సాధ్యమైనంత సహజంగా చెప్పడానికి ప్రయత్నించాడు. అందువలన ఎలాంటి హడావిడి లేకుండా ఈ కథ నడుస్తుంది. సుకుమార్ ఫొటోగ్రఫీ .. మనన్ సాగర్ ఎడిటింగ్ బాగున్నాయి. నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగుతుంది.
 
దర్శకుడు వినోదం పాళ్లను కలపడానికి ట్రై చేయలేదు. ప్రధానమైన అంశాన్ని వివరంగా చెప్పడానికే ప్రాధాన్యతనిచ్చాడు. అందువలన ప్రధానమైన అంశంపై మాత్రమే ఫోకస్ పెట్టి చూస్తే,  ఈ కంటెంట్ ఫరవాలేదనిపిస్తుంది.   
    

Movie Details

Movie Name: Hisaab Barabar

Release Date: 2025-01-24

Cast: Maadhavan, Neil Nitin Mukhesh, Lirthi Kulhari, Rashmi Desai

Director: Ashwin Dhir

Producer: Sharad Patel - Shreyanshi Patel

Music: -

Banner: Jio Studios

Review By: Peddinti

Hisaab Barabar Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews