ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు థియేటర్ కి వచ్చిన నెల రోజుల తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుంటే, మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీకి వస్తున్నాయి. అలా నేరుగా ఓటీటీకి వచ్చిన సినిమానే 'వైఫ్ ఆఫ్'. భాను యేరుబండి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అవని (దివ్యశ్రీ)కి నటనపై ఆసక్తి ఎక్కువ. సినిమాల్లో నటించాలని ఆశపడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి అభి (అభినవ్) పరిచయమవుతాడు. అతను సినిమా దర్శకుడిగా మారడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. అవనిపై మనసుపడిన అతను, ఆమె పెళ్లి రామ్ (నిఖిల్ గాజుల)తో జరగడంతో నిరాశ చెందుతాడు. రామ్ ఎవరో కాదు అవనికి మేనమామ కొడుకే. 

అవని తల్లిలేని పిల్ల. ఆమె ఆలనా పాలన తండ్రి చూసుకుంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో అవని తండ్రి తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు. ఆ సమయంలో పెద్దమొత్తంలో ఖర్చు అవుతుంది. ఆ డబ్బు కోసం ఏం చేయాలో అవనికి పాలుపోదు. రామ్ తండ్రి ఆ డబ్బును సర్దుబాటు చేస్తాడు. ఆయన మాటను కాదనలేక రామ్ తో అవని తండ్రి ఆమె పెళ్లి జరిపిస్తాడు.    

రామ్ .. అవని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవాళ్లు. అందువలన తన జీవితం అతనితో హాయిగా సాగిపోతుందని ఆమె భావిస్తుంది. కానీ ప్రియ అనే వేరే యువతితో రామ్ సాన్నిహిత్యంగా ఉంటూ, అవనిని పటించుకోవడం మానేస్తాడు. భర్త ప్రేమను పొందడానికి అవని ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఒక రోజున ఆమె ఇంటికి వచ్చేసరికి రామ్ నెత్తుటి మడుగులో పడిపోయి ఉంటాడు. రామ్ కి ఏం జరుగుతుంది? అందుకు కారకులు ఎవరు? అప్పుడు అవని ఏం చేస్తుంది? అనేది కథ.

విశ్లేషణ: ఇది 'అవని' అనే ఒక మధ్యతరగతి యువతి చుట్టూ తిరిగే కథ. సాధారణంగా అమ్మాయిలు వైవాహిక జీవితాన్ని గురించి అనేక కలలు కంటారు. ఎన్నో ఆశలతో అలాంటి జీవితాన్ని మొదలుపెడతారు. అయితే ఆ ప్రయాణంలో అనుకోని మలుపులు ఎదురైతే .. గమ్యమే మారిపోయే పరిస్థితులు ఎదురైతే ఎలా ఉంటుందనేది అవని కథ చెబుతుంది. 

చాలా తక్కువమంది ఆర్టిస్టులతో .. తక్కువ బడ్జెట్ లో దర్శకుడు ఈ కథను రెడీ చేసుకున్నాడు. ఆయన తయారు చేసుకున్న కథ సాధారణమైనదే. అయితే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే వేసుకోవడంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. కథ ఆరంభంలో అవని ఒక్కొక్కరినీ మర్డర్ చేస్తూ వెళుతూ ఉంటుంది. ఎందుకోసం ఆమె అలా చేస్తుందనేది తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఫాలో కావడం మొదలుపెడతారు.                     

దర్శకుడు లవ్ .. రొమాన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ను చూపించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తక్కువ నిడివిలోనే ఈ కథను చెప్పడానికి ట్రై చేశాడు. అందువలన కథ బోర్ కొట్టదు. 'ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనుకోవాలి. ఆ సంతోషాన్ని చిదిమేసి .. ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు' అనే లైన్ పైనే ఈ కథ నడుస్తుంది. 

పనితీరు: ఈ కథలో ప్రధానమైన పాత్రలు మూడే. ఆ మూడు పాత్రలలో అవని పాత్ర ప్రధానమైనదిగా కనిపిస్తుంది. అనుక్షణం మానసిక సంఘర్షణతో సాగే అవని పాత్రలో దివ్యశ్రీ నటన ఆకట్టుకుంటుంది. మిగతా వారి నటన ఫరవాలేదు. అష్కర్ అలీ  ఫొటోగ్రఫీ .. ప్రణీత్ నేపథ్య సంగీతం .. సాయికృష్ణ ఎడిటింగ్ ఓకే.

 ముగింపు: కథ పాతదే అయినా కథనం కొత్తగా అనిపిస్తుంది. అవని అనే పాత్రను దర్శకుడు మొదట వేశ్యగా చూపిస్తాడు .. ఆ తరువాత హంతకురాలిగా ప్రేక్షకుల ముందు నిలబెడతాడు. ఆమె అలా ఎందుకు మారింది అనేది కొద్ది కొద్దిగా రివీల్ చేస్తూ వెళ్లిన విధానమే ఈ కంటెంట్ పై ఆసక్తిని పెంచుతుంది. తక్కువ నిడివి .. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్లస్ పాయింట్స్ గా కనిపించే ఈ సినిమా, ఫరవాలేదనే కేటగిరీలో కనిపిస్తుంది.