గత సంక్రాంతికి 'వీరసింహా రెడ్డి'గా విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'గా మరోసారి సంక్రాంతి బరిలో నిలిచారు. బాలకృష్ణ అభిమానులు మెచ్చే మాస్, యాక్షన్ అంశాలతో 'డాకు మహారాజ్'ను రూపొందించామని, ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు ఫెస్టివల్‌గా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు కూడా విడుదల చేశారు. ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎలాంటి కథాంశంతో తెరకెక్కింది? అనేది చూద్దాం.
కథ: చిత్తూరు జిల్లాలోని 'మదనపల్లి'లో .. 1996లో కథ ప్రారంభమవుతుంది. కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్) అనే పారిశ్రామిక వేత్తకు చెందిన కాఫీ ఎస్టేట్‌ను కాంట్రాక్టుకు తీసుకున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్) అక్కడ జంతువుల అవయవాలు స్మగ్లింగ్ చేయడంతో పాటు, పలు అక్రమాలకు పాల్పడుతుంటాడు. ఇది తెలిసిన కృష్ణమూర్తి తన ఎస్టేట్ లీజ్‌ను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పడంతో, త్రిమూర్తులు కోపంతో రగిలిపోతాడు.
కృష్ణమూర్తి కుటుంబాన్ని భయపెట్టి, ఆయన మనవరాలు వైష్ణవిని చంపడానికి త్రిమూర్తులు ప్రయత్నిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న 'చంబల్ లోయ'కు చెందిన 'డాకు మహారాజ్' (బాలకృష్ణ) వైష్ణవిని కాపాడటానికి జైలు నుంచి తప్పించుకుంటాడు. 'నానాజీ'గా పేరు మార్చుకుని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. కృష్ణమూర్తి ఫ్యామిలీని త్రిమూర్తులు గ్యాంగ్ నుంచి రక్షిస్తుంటాడు.
ఇక కథలో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... 'చంబల్ లోయ'లో సీతారామ్ (బాలకృష్ణ), అయన భార్య కావేరి (ప్రగ్యాజైస్వాల్) ఇరిగేషన్ ఇంజనీర్లుగా చంబల్ లోయకు ఉద్యోగ రీత్యా వస్తారు. ఆ ఏరియాలో ప్రజలు తాగునీరు కోసం అల్లాడుతుంటారు. కేవలం వారానికి ఒక్కసారి ఇచ్చే తాగు నీరు కోసమే బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) మైనింగ్ కంపెనీలో ఆ గ్రామ ప్రజలు పనిచేస్తూ.. చిత్రహింసలకు గురవుతుంటారు. వాళ్ల కోసం 'డాకు మహారాజ్' గా సీతారామ్ ఎలా మారతాడు? ఈ కథలో నందిని (శధ్దా శ్రీనాథ్) ఎవరు? వైష్ణవికి .. డాకు మహారాజ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ.
విశ్లేషణ: బాలకృష్ణ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ కథ ఇది. అయితే దర్శకుడు బాబీ ఈ చిత్రం కోసం పాత కథాకథనాలనే నమ్ముకున్నాడు. కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడానికి చేసిన ప్రయత్నం కనిపించింది. కేవలం బాలకృష్ణ అభిమానులను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్‌ను పండించాడు.
సినిమా ప్రారంభం నుంచి ఫస్ట్ హాఫ్ వరకు చిత్రాన్ని దర్శకుడు చాలా స్టయిలిష్‌గా, డిసెంట్ ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించాడు. ముఖ్యంగా బాలకృష్ణ గత సినిమాలకు భిన్నంగా స్టయిలిష్ మేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సెకండాఫ్‌లో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు కొన్నిసన్నివేశాలు కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఎమోషన్స్ మిస్ అయిన ఫీల్ కలుగుతుంది.
ఫస్ట్‌హాఫ్‌కు ధీటుగా సెకండాఫ్ కూడా ఉన్నట్లయితే తప్పకుండా ఈ చిత్రం రేంజ్ మరోలా ఉండేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో తాగునీరు కోసం గ్రామ ప్రజలు, క్వారీలో చిత్రహింసలు పడుతూ పనిచేయడం సీన్స్, సినిమాటిక్‌గా రాసుకున్నట్లు అనిపించడంతో సహజత్వం లోపించింది. ఇక బాలకృష్ణ పాత్రను, ఆయనను దర్శకుడు ప్రజెంట్ చేసిన విధానానికి మాత్రం అందరూ ఫిదా అవ్వాల్సిందే. చంబల్ లోయ నేపథ్యం ప్రేక్షకులకు కాస్త కొత్తదనంగా అనిపిస్తుంది. అయితే కథపై కూడా మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఓన్లీ బాలకృష్ణ అభిమానులకే కాకుండా అందరికి సంపూర్ణ విందుభోజనంలా ఉండేది.
నటీనటుల పనితీరు: ఎటువంటి పాత్రనైనా తనదైన శైలిలో మెప్పించే బాలకృష్ణ కూడా ఈచిత్రంలో డాకు మహారాజ్‌గా, సీతారామ్‌గా, నానాజీగా భిన్నమైన షేడ్స్‌ల్లో ఒదిగిపోయాడు. ఆయన లుక్ ఎంతో కొత్తగా స్టయిలిష్‌గా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఎంతో డిఫరెంట్‌గా ఉన్నాయి. బాలకృష్ణ పాత్ర ఎంతో సెటిల్డ్‌గా అనిపిస్తుంది.
శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌లు అభినయానికి స్కోప్ ఉన్న తమ పాత్రల్లో రాణించారు. ఊర్వశి రౌతేలా సినిమాకు ప్రత్యేక అందంలా నిలిచింది. 'దబిడి దిబిడి' పాటలో మరింత అందంగా కనిపించింది. రవికిషన్ విలనిజం, దర్శకుడు సందీప్ రాజ్ నటన ఫర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా సహజంగా అనిపించారు.
సాంకేతిక వర్గం: ఈ చిత్రంతో దర్శకుడిగా బాబీ మరో మెట్టు ఎదిగాడు. టెక్నికల్‌గా బాబీ టేకింగ్, మేకింగ్ స్థాయిని అభినందించాల్సిందే. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ సీన్స్‌ను బాగా రాసుకున్నడు, ఎమోషన్స్ సీన్స్‌తో పాటు, మరిన్ని బలమైన సన్నివేశాలు ఉండి ఉంటే చిత్రం రేంజ్ బాగా పెరిగేది. అయితే పాత కథను బాబీ ప్రజెంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతం చిత్రానికి బిగ్గెస్ ఎస్సెట్. ముఖ్యంగా సంగీతంతో సన్నివేశాల బలాన్ని పెంచాడు తమన్. సినిమా నిర్మాణ విలువలు ఎంతో రిచ్‌గా ఉన్నాయి.
'డాకు మహారాజ్' - మూవీ రివ్యూ!
Daaku Maharaaj Review
- మూడు డిఫరెంట్ షేడ్స్‌లో బాలకృష్ణ
- బాలకృష్ణ అభిమానులకు విందు భోజనం
- స్టయిలిష్ మేకింగ్‌తో ఆకట్టుకున్న బాబీ
Movie Details
Movie Name: Daaku Maharaaj
Release Date: 2025-01-12
Cast: Balakrishna, Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandhini Chowdary
Director: Bobby Kolli
Music: Thaman S
Banner: Sithara Entertainments - Fortune Four Cinemas
Review By: Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer