కోలీవుడ్లో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హిప్ హాప్ ఆది, ఆ తరువాత హీరోగా మారిపోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అంతే వేగంగా ఆయన నిర్మాతగా కూడా మారిపోయాడు. అలాంటి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'కడైసి ఉళగ పోర్'. సెప్టెంబర్ 20న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్టోబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా 'లాస్ట్ వరల్డ్ వార్' పేరుతో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.    

కథ: ఈ కథ 2028లో జరుగుతూ ఉంటుంది. చెన్నైలో రాజకీయ పరంగా రాజేంద్ర ( నాజర్) అంచలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు. ఆయనకి సంబంధించిన వ్యవహారాలన్నీ బావమరిది  నటరాజన్ (నటరాజన్ సుబ్రమణియన్) చూసుకుంటూ ఉంటాడు. రాజేంద్రన్  కి తెలియకుండా నటరాజన్ చాలా వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాజేంద్రన్ తన కూతురైన కీర్తన (అనఘ)ను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలనుకోవడం నటరాజన్ కి ఎంతమాత్రం నచ్చని విషయం.

తండ్రి అనారోగ్యం .. ఆయన బలమైన కోరికను కాదనలేక కీర్తన రాజకీయాలలోకి వస్తుంది. విద్యాశాఖ మంత్రిగా రాజకీయాలలోకి అడుగుపెడుతుంది. ఆ సమయంలోనే ఆమెకి 'తమిళ' (హిప్ హాప్ ఆది)తో పరిచయం ఏర్పడుతుంది. అతని పట్ల ఆమెకి గల అభిమానం .. ప్రేమగా మారుతుంది. అతను తనకి అండగా ఉంటే బాగుండునని భావిస్తుంది. అందుకు అతను ఆనందంగా అంగీకరిస్తాడు. తన శాఖకు సంబంధించి ఆమె తమిళ అభిప్రాయాలను ఆచారంలో పెడుతుంది. 

కీర్తన కొత్త విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలనుకోవడం నటరాజన్ కి మింగుడుపడని విషయంగా మారుతుంది. ఆమెను ఎవరో ప్రభావితం చేస్తున్నారనే విషయాన్ని అతను గ్రహిస్తాడు. తన స్నేహితుడైన పోలీస్ కమిషనర్ ప్రకాశ్ ను కలుసుకుని, కీర్తన వెనక ఎవరన్నది కనిపెట్టి తనకి చెప్పమని అంటాడు. అది కనిపెట్టిన కమిషనర్ కీర్తనను ప్రభావితం చేస్తున్నది తమిళ అని చెబుతాడు.

'వరల్డ్ వార్'లో భాగంగా అప్పటికే కొన్ని దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. చెన్నైలో రాజకీయాల పరంగా కూడా చకచకా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇదే సరైన సమయంగా భావించిన నటరాజన్, తమిళపై తీవ్రవాదిగా ముద్రవేసి చంపేయమని కమిషనర్ తో చెబుతాడు. పర్యవసానంగా తమిళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? నటరాజన్ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి?  యుద్ధం ప్రభావం చెన్నైపై ఎలా ఉంటుంది? అనేది కథ.

విశ్లేషణ: ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. పాటలు .. సంగీతం హిప్ హాప్ ఆది అందించాడు. ఒక వైపున దేశంపై అల్లుకున్న యుద్ధ మేఘాలు .. మరో వైపున చెన్నై ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్వార్థ రాజకీయాల నేపథ్యలో ఆయన ఈ కథను తయారు చేసుకున్నాడు. చెన్నైకి సంబంధించినంత వరకూ ఈ కథలో హీరో - హీరోయిన్, నాజర్ - నటరాజన్ పాత్రలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి. ఈ కథ స్థానిక రాజకీయాలతో కొంతదూరం నడవగా, అక్కడి నుంచి యుద్ధ వాతావరణంలో కొనసాగుతుంది. 

నటరాజన్ విలనిజం ముదురుతూ ఉండగా, యుద్ధం వచ్చిపడుతుంది. దాంతో ఆయన విలనిజం పక్కకి వెళ్లిపోతుంది. దాంతో హీరోయిజానికి కూడా అవకాశం లేకుండా చేసినట్టు అవుతుంది. యుద్ధ వాతావరణంలో కథలోకి 'రిపబ్లిక్' పేరుతో కొత్త ఆర్గనైజేషన్ ఎంటరవుతుంది. ఈ సమస్యల వలన హీరో - హీరోయిన్ మధ్య లవ్ .. రొమాన్స్ మచ్చుకి కూడా కనిపించకుండా పోతుంది. చాలా పాత్రలను ఒకదాని తరువాత ఒకటిగా ఒక రేంజ్ లో పరిచయం చేశారు. కానీ ఆ పాత్రలను ఆ స్థాయిలో మలచడం జరగలేదు.

సాధారణంగా తెరపై ఎక్కువగా రాజకీయాలను గానీ .. యుద్ధ సన్నివేశాలను గాని ఎక్కువగా చూడలేం. అలాంటి రెండు ట్రాకులను కలిపి చూపించడం అసహనాన్ని కలిగిస్తుంది. ఇక వరల్డ్ వార్ అంటే, ఆ స్థాయికి తగిన వాతావరణాన్ని తెరపై చూపించడానికి చాలా బడ్జెట్ అవసరమవుతుంది. ఓ మాదిరి బడ్జెట్ లో వర్కౌట్ చేయడం కష్టమైన విషయం. అదే విషయం మనకి అర్థమైపోతూ ఉంటుంది.

ఇక రిపబ్లిక్ ఆర్గనైజేషన్ .. అందుకు దారితీసిన రాజకీయ పరిస్థితులు .. ఇతర దేశాలపై దాని ప్రభావం .. ఇంతటి విస్తృతమైన కథను చాలా వరకూ వాయిస్ ఓవర్ పై నడిపించారు. సామాన్య ప్రేక్షకులకు ఇది అంత తొందరగా అర్ధమయ్యే అంశం కాదు. అందువలన సామాన్య ప్రేక్షకులు ఒక రకమైన గందరగోళంలో పడిపోతారు. ఇలాంటి ఒక కంటెంట్ ను తలకెత్తుకోవడం హిప్ హాప్ ఆది చేసిన పొరపాటుగానే అనిపిస్తుంది.

పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన హిప్ హాప్ ఆది .. అనఘ .. నాజర్ .. నటరాజన్, తమ పాత్రలకి న్యాయం చేశారు. అర్జున్ రాజా ఫొటోగ్రఫీ బాగుంది. హిప్ హాప్ ఆది అందించిన బాణీలు .. నేపథ్య సంగీతం అంతంత మాత్రంగా అనిపిస్తాయి. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ ఓకే. దేశ సమస్యలు .. రాష్ట్ర రాజకీయాలు .. అధికారం కోసం చేసే కుట్రలు .. కనెక్ట్ కాని ఒక లవ్ స్టోరీ .. ఇలా ఇవన్నీ కలిపేసి ఒకేసారి ప్రేక్షకులపై రుద్దడానికి ప్రయత్నించిన కారణంగా ఈ కథ అయోమయాన్ని .. అసహనాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు.