ఈ మధ్య కాలంలో సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. కంటెంట్‌ బాగుంటే ఇలాంటి చిత్రాల్లో స్టార్స్‌ లేకపోయినా సక్సెస్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ సైన్స్‌ ఫిక్షన్‌కు, మైథలాజికల్‌ అంశాన్ని జోడించి 'రహస్యం ఇదం జగత్‌' అనే చిత్రాన్ని రూపొందించాడు. నూతన నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీచక్రం - టైమ్‌ ట్రావెల్ అంశాన్ని కూడా టచ్‌ చేశాడు దర్శకుడు. టీజర్‌ - ట్రైలర్‌తో ఆకట్టుకున్న 'రహస్యం ఇదం జగత్‌' .. ఈ శుక్రవారం విడుదలైంది. సైన్స్‌ ఫిక్షన్‌కు మైథలాజికల్‌ అంశాన్ని జోడించి నిర్మించిన ఈ చిత్రం ఎలా వుంది? అనేది  తెలియాలంటే, ఈ సమీక్షను చదవాల్సిందే. 

కథ: అమెరికా నేపథ్యంలో నడిచే కథ ఇది. అమెరికాలో ఉద్యోగం చేస్తూ  వున్న అకీరా (స్రవంతి) తండ్రి మరణించడంతో ఇండియాకు వెళ్లిపోదాం అనుకుంటుంది. అకీరా బాయ్‌ ఫ్రెండ్‌ అభి (రాకేష్‌) కూడా ఆమె కోసం అమెరికాలో మంచి పొజిషన్‌, స్నేహితులను వదిలి ఇండియాకు వెళ్లిపోదామని నిర్ణయించుకుంటాడు. ఇక వెళ్లే ముందు స్నేహితులతో కలిసి ఓ వెకేషన్‌ ప్లాన్‌ చేస్తారు. అలా అడవిలో ఉండే ఓ ఊరుకు వెళతారు. అక్కడికి అకిరా మాజీ ప్రేమికుడు 'విశ్వ' కూడా వస్తాడు. వాళ్లు బుక్‌ చేసుకున్న హోటల్‌ మంచు కురవడంతో క్లోజ్‌ అయిపోతుంది. దాంతో అక్కడే  వున్న ఓ ఖాళీ ఇంట్లో వుండాల్సి వస్తుంది. 

ఆ స్నేహితులతో వున్న 'అరు' మల్టీ యూనివర్శ్‌పై పరిశోధన చేస్తుంటుంది. స్నేహితులంతా కలిసి డిన్నర్‌ చేస్తున్న టైమ్‌లో మాటమాట పెరిగి అకీరా కోసం అభి, విశ్వకు గొడవ జరగుతుంది. అదే సమయంలో విశ్వ వైట్ ఎలిఫెంట్‌ అనే పవర్‌ఫుల్‌ డ్రగ్‌ తీసుకుని, ఆ మత్తులో అకీరా, కళ్యాణ్‌లను చంపేస్తాడు. మరో వైపు మల్టీ యూనివర్శ్‌కి వెళ్లే దారి ఆ ఊళ్లోనే వుందని తెలుసుకున్న అరు,  అభిని తీసుకుని అక్కడికి వెళుతుంది. అయితే అక్కడ అరుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపుతాడు. అసలు ఈ హత్యలు జరగడానికి కారణమేమిటి?  నిజంగానే మల్టీ యూనివర్స్ వుందా? టైమ్‌ ట్రావెల్‌కు ఈ కథకు సంబంధమేమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ: ఇది చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన స్పాన్‌ వున్న కథ. పూర్తిగా అమెరికాలోనే కథ జరగడం వల్ల హాలీవుడ్‌ సినిమాలా అనిపిస్తుంది. సినిమాలో కొన్ని పాత్రలు పూర్తిగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడటం వల్ల కూడా హాలీవుడ్‌ సినిమా అనే ఫీలింగ్‌ కూడా కలుగుతుంది. అయితే మేకింగ్‌ విషయంలో మాత్రం సినిమా ఆ స్థాయిలో లేదు. పలు హాలీవుడ్‌ సినిమాల ఇన్‌స్పిరేషన్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. 

హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్లడం, వామ్‌హోల్‌ ఏర్పడటం ఇలాంటి మైథలాజి అంశాలను ఈ చిత్రంలో దర్శకుడు చూపించాడు. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. అనుకున్న కథను క్లారిటీగా చూపిస్తే ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేవారు. పతాక సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. ఫస్ట్‌ హాఫ్ లో ఉన్నసీన్స్‌కు సెకండాఫ్‌లో లింక్‌ ఇచ్చి, ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతూ చివర్లో ఉత్కంఠను కలిగించాడు. రొటిన్‌గా కాకుండా కొత్తగా ఆలోచించి కథను రాసుకున్నాడు. అయితే దానిని తెరపైకి తీసుకరావడంలో తడబడ్డాడు. కొత్త సినిమాలు కోరుకునే వారిని ఆకట్టుకునే అంశాలు ఇందులో వున్నాయి. 

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే కీలక సన్నివేశాల్లో  మాత్ర వారి నటన సాదాసీదాగానే  ఉండటం వల్ల సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. స్రవంతి బాగానే నటించింది. సైంటిస్ట్‌ పాత్రకు 'అరు' పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. విలన్‌గా కార్తీక్‌ రాణించాడు. అంతా థియేటర్స్‌ ఆర్టిస్ట్‌లు కావడంతో నటనలో సహజత్వం కోసం ప్రయత్నించారు. 

సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు తనకున్న బడ్జెట్‌ పరిధుల మేరకు ఓ కొత్త ప్రయత్నాన్ని తెరకెక్కించడంలో సఫలీకృతుడయ్యాడు. అయితే ఇలాంటి కథను చెప్పడంలో డైరెక్టర్‌ కి పూర్తి క్లారిటీ కావాలి. కానీ అది లోపించినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ కి సినిమాటోగ్రఫీ చేయడం చాలా కష్టం. కానీ ఈ సినిమాకు కెమెరామెన్‌ ప్రతిభ ప్లస్‌ అయ్యింది. నేపథ్య సంగీతం ఆకట్టుకోలేదు. ఓ కొత్త ప్రయత్నాన్ని తీసుకొచ్చేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో మెప్పించే స్థాయిలో లేకపోయినా, నిజాయితీగా తన ఎఫర్ట్‌ పెట్టాడు. ఓవరాల్‌గా కొత్త సినిమాలు, న్యూ అటెంప్ట్‌లను ఇష్టపడేవారిని 'రహస్యం ఇదం జగత్‌' ఓ మోస్తరుగా అలరించే అవకాశం వుంది.