లక్ష్య కథానాయకుడిగా బాలీవుడ్ నుంచి 'కిల్' సినిమా వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా నిర్మితమైంది. జులై 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. నిఖిల్ నాగేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్నటి నుంచి ఈ సినిమా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
అమృత్ రాథోడ్ (లక్ష్య) ఎన్ ఎస్ జీ కమాండర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను చాలా కాలంగా 'తులిక' ( తాన్య మనక్తిలా)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె తండ్రి బలదేవ్ సింగ్ ఠాకూర్ (హర్ష్) చాలా శ్రీమంతుడు .. పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త. ఆయన చెప్పిన మాట ఆ ఇంట్లో ఎవరైనా వినవలసిందే. అందువలన తండ్రికి తన ప్రేమ విషయాన్ని తులిక చెప్పలేకపోతుంది. తండ్రి ఒక సంబంధం తీసుకురావడం .. నిశ్చితార్థ వేడుకను ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోతాయి.
ఈ వేడుక అనంతరం తులిక కుటుంబ సభ్యులు 'రాంచీ' నుంచి 'ఢిల్లీ'కి ట్రైన్ లో బయల్దేరతారు. ఈ విషయం తెలుసుకున్న రాథోడ్, మార్గమధ్యంలో ఆ ట్రైన్ ఎక్కుతాడు. ఆ సమయంలోనే 40 మంది వరకూ ఉన్న బందిపోటు దొంగలు, సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ట్రైన్ లోకి అడుగుపెడతారు. ట్రైన్ బయల్దేరిన కొంతసేపటి తరువాత వాళ్లంతా ప్రయాణీకుల దగ్గర దోచుకోవడం మొదలుపెడతారు. ఎదురు మాట్లాడినవారిని తీవ్రంగా గాయపరుస్తూ ఉంటారు.
బందిపోట్లలో ఫణి (రాఘవ్ జుయల్) సిద్ధి .. రవి మిగతా వాళ్లను గైడ్ చేస్తూ ఉంటారు. బలదేవ్ సింగ్ ఠాకూర్ తన ఇద్దరు కుమార్తెలను కాపాడుకోవడంపై దృష్టి పెడతాడు. ట్రైన్ లో బలదేవ్ సింగ్ ఠాకూర్ ఉన్నాడని తెలియగానే, ఆయన ఫ్యామిలీని కిడ్నాప్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు లాగొచ్చని ఫణి భావిస్తాడు. అలా ఆ ఫ్యామిలీ పైకి బందిపోట్ల దృష్టి పోతుంది. సరిగ్గా ఆ సమయంలోనే అమృత్ రాథోడ్ .. అతని స్నేహితుడు వీరేశ్ ఎంట్రీ ఇస్తారు. తులిక ఫ్యామిలీకి అండగా వాళ్లు బందిపోట్లతో తలపడతారు.
బందిపోటు బృందంలో ఒక వ్యక్తిని వీరేశ్ చంపేస్తాడు. అతను ఆ బృందంలో పెద్ద. అందువలన వాళ్లంతా మరింత ఆగ్రహావేశాలకు లోనవుతారు. వీరేశ్ ను .. రాథోడ్ ను చంపకుండా ట్రైన్ దిగకూడదని నిర్ణయించుకుంటారు. ఏ బలదేవసింగ్ ఠాకూర్ ఫ్యామిలీని కాపాడటానికి రాథోడ్ ట్రై చేస్తున్నాడో, ఆ ఫ్యామిలీని అతని కళ్ల ముందే లేపేయాలని భావిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? రాథోడ్ ఆ కుటుంబాన్ని కాపాడగలుగుతాడా? తులికతో అతని వివాహం జరుగుతుందా? అనేది కథ.
'కిల్' .. ఈ మధ్య కాలంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాకి ఒక రేంజ్ లో ప్రమోషన్స్ జరిగాయి. కానీ ఈ సినిమా చూసిన తరువాత ఇందులో కొత్తగా ఏముందని? అనిపిస్తుంది. హీరో ఒక వైపు .. హీరోయిన్ ఫ్యామిలీ ఒక వైపు .. బందిపోటు గ్యాంగ్ ఒక వైపు. అందరూ ట్రైన్ లోనే ఉంటారు. ఆ ట్రైన్ రన్నింగ్ లో ఉంటుంది. ప్రాణాలను చాలా తేలికగా తీసే బందిపోటు దొంగల నుంచి హీరోయిన్ ఫ్యామిలీని హీరో కాపాడాలి .. అదీ కథ.
హీరో - హీరోయిన్ మధ్య లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ చూపించడానికి అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఈ ట్రైన్ వెళ్లిపోతే ఎట్లా .. మళ్లీ ఎప్పుడుందో ఏమో? అన్నట్టుగా అందరినీ కంగారుగా ట్రైన్ ఎక్కించేశాడు. అలా ఈ పాత్రలతో సహా ఆడియన్స్ కూడా హడావిడిగా ట్రైన్ ఎక్కేస్తారు. అప్పటి నుంచి చివరివరకూ ట్రైన్ లో కూర్చుని జరుగుతున్న హింసను కళ్లారా చూడవలసిందే.
ఈ సినిమాలో ఉన్న కథ పాతది .. పైగా ఏ మాత్రం పట్టులేనిది. హీరో ఎంతమంది రౌడీలను కొట్టినా ఆ సీట్ల మధ్యలోనో .. మెట్లపైనో కొట్టాలి. మరో మార్గం లేకపోవడం వలన స్టంట్ మాస్టర్లు చాలా దారుణమైన ఫైట్స్ ను కంపోజ్ చేశారు. హీరో బందిపోట్ల నోళ్లలో .. కళ్లలో పొడుస్తాడు .. గుంతులో గుచ్చుతాడు. తలను పచ్చడి క్రింద కొట్టేస్తాడు. కడుపులో కత్తి గుచ్చి గొంతువరకూ పైకి లాగేస్తాడు. ఇవన్నీ హీరోయిజంలా కాకుండా హీరోలో సైకో ఉన్నాడా అనే అనుమానాన్ని కలిగిస్తాయి.
ఇతర పాత్రల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు. హీరో గురించి చెప్పుకోవాలంటే, ఆయన సృష్టించిన హింస - రక్తపాతం గుర్తుకు వస్తాయి. కథ నడిచేదంతా ట్రైన్ లో .. గుంపు .. గోల .. కొట్లాట .. ఇలా ఈ సినిమా బీపీ పెంచేస్తుంది. ఇలాంటి సినిమాలని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే, వాళ్లను మనం కాదనలేం. టైటిల్ అదే .. కంటెంట్ అదే అని సరిపెట్టుకోలేం. ఎక్కడో ఉన్న చిన్నపాటి లవ్ .. ఎమోషన్ అనే రెండు చుక్కలను చూపించి, మిగతా చుక్కలన్నిటినీ రక్తపాతంతో కలపడానికి ప్రయత్నించిన సినిమా ఇది.
'కిల్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Kill Review
- జులైలో విడుదలైన 'కిల్' సినిమా
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కంటెంట్
- కథ ప్రయాణమంతా ట్రైన్ లోనే
- కనెక్ట్ కాని లవ్ .. ఎమోషన్స్
- ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చే సినిమా
- తట్టుకోలేని హింస - రక్తపాతం
Movie Details
Movie Name: Kill
Release Date: 2024-09-24
Cast: Lakshya, Tanya Manakthila, Raghav Juyal, Abhishek Chauhan, Ashish Vidyarthi
Director: Nikhil Nagesh Bhat
Music: Ketan Sodha
Banner: Dharma Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer