'రాధా మాధవం' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • పరువు హత్యల నేపథ్యంలో 'రాధా మాధవం'
  • బలహీనమైన కథ
  • ఆకట్టుకోని కథనం  
  • కొత్త ఆర్టిస్టుల నుంచి తీసుకోని అవుట్ పుట్
  • కసరత్తు తగ్గిన కంటెంట్ 
పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమానే 'రాధా మాధవం'. గోనాల వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమాకి, దాసరి ఇసాక్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు నూతన నటీనటులతో రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామానికి చెందిన యువకుడు మాధవ్ ( వినాయక్ దేశాయ్) అదే గ్రామానికి చెందిన యువతి రాధ( అపర్ణాదేవి) ప్రేమించుకుంటూ ఉంటారు. మాధవ్ తక్కువ కులానికి చెందినవాడైతే, రాధ అగ్రకులానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతారు. ఆ తరువాత అతను పై చదువుల కోసం పట్నం వెళ్లి వస్తాడు. అప్పటి నుంచే రాధతో ప్రేమాయణం మొదలవుతుంది. 

మాధవ్ చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతారు. అప్పటి నుంచి ఆ ఊళ్లో వాళ్లే అతణ్ణి చేరదీస్తారు. రాధ విషయానికి వస్తే ఆమె తల్లి లేని పిల్ల. తండ్రి పర్యవేక్షణలోనే పెరుగుతుంది. రాజకీయాలలో ఎదగాలనేది ఆమె తండ్రి కోరిక.  అందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. కులం విషయంలో తండ్రి పట్టింపు ఆమెకి కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. 

ఎన్నికలు దగ్గర పడుతుండగా .. రాధ - మాధవ్ ప్రేమవ్యవహారం వీరభద్రం దృష్టికి వస్తుంది. ఆ సమయంలో తొందరపడితే మాధవ్ వర్గానికి సంబంధించిన ఓట్లు పోతాయని వీరభద్రం భావిస్తాడు. తనని గెలిపిస్తే మాధవ్ తో రాధ పెళ్లి జరిపిస్తానని మాట ఇస్తాడు. తాను గెలిచిన తరువాత మాధవ్ ను హత్య చేయించి, తనకి అండగా నిలబడతానని చెప్పిన కాళీతో ఆమె వివాహం జరిపించాలని నిర్ణయించుకుంటాడు.

రాధ - మాధవ్ ల పెళ్లి కోసం ఆ ఊళ్లో వారు వీరభద్రాన్ని గెలిపిస్తారు. అతని మనసులో ఏముందో గ్రహించిన రాధ - మాధవ్ ఓ రాత్రివేళ ఆ ఊరు వదిలి పారిపోతారు. అప్పుడు వీరభద్రం ఏం చేస్తాడు? అతని కారణంగా ఆ జంట ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది? చివరికి వారి వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ. 

నిజానికి ఇది చాలా సింపుల్ లైన్ .. రొటీన్ లైన్. తక్కువ బడ్జెట్ లో .. కొత్త ఆర్టిస్టులతో చేసిన ఒక ప్రయత్నం. ఈ కథను మొదలుపెట్టిన తీరును చూస్తేనే ఆశ్ఛర్యం కలుగుతుంది. ఏదైతే సస్పెన్స్ లో ఉంచాలో ఆ విషయాన్ని ముందుగానే చెప్పేశారు. అసలు సంగతి ఫస్టు సీన్ లోనే తెలిసిపోవడం వలన, ఆ తరువాత కథ ప్రేక్షకులకు చప్పగా అనిపిస్తుంది. చివరివరకూ అదే పరిస్థితి. 

ఒక కథను కొత్తవాళ్లతో తీయడం తప్పు కాదు. కానీ అలాంటప్పుడు వాళ్ల నుంచి పూర్తి అవుట్ పుట్ ను రాబట్టుకోవలసి ఉంటుంది. లేదంటే పెద్దగా అనుభవం లేనివారు చేసే స్టేజి డ్రామాలు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో చాలా పాత్రల నుంచి సరైన అవుట్ పుట్ రాలేదు. పాత్రలను డిజైన్ చేయడమే కుదరలేదు. కొన్ని సన్నివేశాలు సినిమా స్థాయిలో లేవనే అనిపిస్తుంది. 

కెమెరా పనితనం విషయానికి వస్తే .. లైటింగ్ సరిగ్గా లేకపోవడం తెలుస్తుంది. ఇక సంగీతం పరంగా చూసుకుంటే, తెరపై నడుస్తున్న దృశ్యానికి సంబంధం లేకుండా నడుస్తుంది. ఎడిటింగ్ వైపు నుంచి చూసుకుంటే, ఇద్దరు కమెడియన్స్ ను కూర్చోబెట్టి మేపే సీన్స్ ను లేపేయవచ్చు. ఎందుకు ఆ సన్నివేశాలను సాగదీశారనేది మనకి అర్థం కాదు. ఒక రకంగా అది వాళ్ల దృష్టిలో కామెడీ అయ్యుంటుందని సరిపెట్టుకోవాలంతే. 

నిజానికి 'రాధామాధవం' అనేది చాలా ఫీల్ గుడ్ టైటిల్. కనుక కంటెంట్ కూడా అలాగే ఉండొచ్చునని అనుకోవడం సహజం. కానీ టైటిల్ కి తగిన ఫీల్ ను ఎక్కడా వర్కౌట్  చేయలేకపోవడం మనకి కనిపిస్తుంది. కథాకథనాలలో కొత్తదనం ఉంటే .. కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉంటే, ఆర్టిస్టులు కొత్తవారైనా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. బడ్జెట్ తక్కువైనా పట్టించుకోరు. ఆ స్థాయిలో కసరత్తు చేయకుండా కార్యరంగంలోకి దిగితే కష్టమే. 

Movie Details

Movie Name: Radha Madhavam

Release Date: 2024-06-21

Cast: Vinayak Dasai, Aparnadevi, Meka Ramakrishna

Director: Dasari Issak

Producer: Gonala Venkatesh

Music: Chaithu Kolli

Banner: Gvk Creations

Review By: Peddinti

Radha Madhavam Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews