'105 మినిట్స్' (ఆహా) మూవీ రివ్యూ!

105 Minnutes

Movie Name: 105 Minnutes

Release Date: 2024-06-07
Cast: Hansika
Director:Raju Dussa
Producer: Bommak Shiva
Music: Sam C. S.
Banner: Rudransh Celluloids
Rating: 2.00 out of 5
  • హన్సిక ప్రధాన పాత్రగా '105 మినిట్స్'
  • ఈ నెల 7 నుంచి మొదలైన స్ట్రీమింగ్
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • ప్రయోగం పేరుతో కథ లేకుండా చేసిన సాహసం    


తమిళంలో నాయిక ప్రధానమైన పాత్రలు చేయడంలో నయనతార .. త్రిష .. ఐశ్వర్య రాజేశ్ తరువాత స్థానంలో హన్సిక కనిపిస్తూ ఉంటుంది. తెలుగులోను ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమానే '105 మినిట్స్'. జనవరి 26వ తేదీన విడుదలైన ఈ సినిమా, రీసెంటుగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఒకే ఒక పాత్రతో .. 6 రోజులోనే షూటింగు పూర్తిచేసుకున్న సినిమా ఇది. హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథలోకి వెళితే .. జానూ (హన్సిక) ఆఫీసులో తన పని ముగించుకుని ఇంటికి బయల్దేరుతుంది. అప్పటికే బాగా చీకటి పడుతుంది .. వర్షం మొదలవుతుంది. ఉరుములు .. మెరుపులు హడావిడి చేస్తుండటంతో,  ఆమె కారు వేగాన్ని పెంచుతుంది. అయితే తనని ఎవరో గమనిస్తున్నట్టుగా .. తనవైపు కోపంగా చూస్తున్నట్టుగా .. తనతో వస్తున్నట్టుగా ఆమెకి అనిపిస్తుంది. ఆ కంగారులోనే ఆమె తన ఇంటికి చేరుకుంటుంది. 

ఇంట్లోకి వచ్చిన తరువాత పవర్ పోతుంది. ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అలికిడి అవుతూ ఉంటుంది. ఏవో శబ్దాలు అవుతూ ఉంటాయి. దాంతో ఆమెలో భయం మొదలవుతుంది. ఎవరో వికృతంగా నవుతున్నట్టుగా .. అంతలో మరెవరో ఏడుస్తున్నటుగా వినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ ఇంట్లో నుంచి ఎక్కడో అడవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా .. అక్కడ తనని మరింత భయపెడుతున్న భావానికి లోనవుతూ ఉంటుంది. 

ఊహించని విధంగా తన కాళ్లకి గొలుసులు ఎవరు కట్టారో .. ఎలా కట్టారో కూడా ఆమెకి అర్థం కాదు. ఒక గదిలో నుంచి మరో గదిలోకి ఎవరో తనని తరుముతున్నట్టుగా ఆమె నడుస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ లోపల ఉన్న అదృశ్య శక్తి ఆమెకి ఆ అవకాశం లేకుండా చేస్తూ ఉంటుంది. 'నీప్రేమ కావాలి .. నీ కోసం పోయిన నా ప్రాణం కావాలి' అంటూ ఆ అదృశ్య శక్తి ఆమెను వెంటాడుతూ ఉంటుంది.

చాలా తక్కువ సమయంలోనే అదృశ్య శక్తి వలన జానూ గాయాల పాలవుతుంది. ఒక వైపు నుంచి ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మరో వైపు నుంచి డోర్ బెల్ మోగుతూ ఉంటుంది. కానీ తీసే అవకాశం ఆమెకి లేకుండా పోతుంది. అంతగా జానూ భయపడటానికి కారకులు ఎవరు? వాళ్లతో కూడిన జానూ గతం ఏమిటి? అనేవి ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. 

తెలుగు హీరోపై కొన్ని ప్రయోగాలు జరుగుతూ వస్తూనే ఉన్నాయి. అలాంటి ప్రయోగాలలో '105 మినిట్స్' ఒకటి. ఒకే ఒక పాత్ర మాత్రమే తెరపై కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్ర పొందే ఆవేదన .. భయం .. ఆక్రోశం .. ఆందోళన చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. '105 మినిట్స్' అనేది ఈ సినిమా నిడివి. ఈ సమయంలో ఏం జరిగిందనేదే కథ.

ఇక్కడి నుంచి ఇక్కడి వరకూ అన్నట్టుగా దర్శకుడు ఒక సమయాన్ని గురించి చెబుతున్నప్పుడు, ఆ సమయంలో ఏం జరిగిందా అనేది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తారు. ఒక టైమ్ ఫ్రేమ్ లో జరిగే కథలు, ఏ క్షణంలో ఏం జరుగుతుందా? అన్నట్టుగా సాగుతుంటాయి. ఈ 105 మినిట్స్ లో ప్రతి నిమిషం విలువైనదే .. ప్రతి నిమిషం టెన్షన్ పెట్టించేదే అన్నట్టుగా కథ నడవాలి. అలాంటి ఉత్కంఠను పొందడానికి సిద్ధమైన ఆడియన్స్ పై నీళ్లు చల్లే సినిమా ఇది. 

ఉన్నది ఒకటే పాత్ర .. ఆ పాత్ర పూర్వాపరాలు పరిచయం చేయరు. కథ మొదలవుతుండగానే ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేస్తారు. ఆమెను ఓ కిటికీలో నుంచి మనకి చూపిస్తున్నారని అనుకోవాలి. ఆమె భయపడుతూ ఉంటుంది .. బాధపడుతూ ఉంటుంది. కంటికి కనిపించనివారు ఆమెను టెన్షన్ పెడుతూ ఉంటారు. ఆమెకీ .. ఆ భయపెడుతున్నవారికి మధ్య ఉన్న సంబంధం గురించి మనకి తెలియదు. 

జానూని అంతగా టార్చర్ చేస్తున్న ఆ దుష్ట శక్తిని చూసి తీరాలి. వాడు ఎవరనేది తెలుసుకోవాలి? అనే ప్రేక్షకులు అనుకుంటారు. కానీ దర్శకుడు అలాంటి అవకాశం ఇవ్వడు. ఈ '105 మినిట్స్' కేవలం బిగినింగ్ మాత్రమే అంటూ, సీక్వెల్ కోసం వెయిట్ చేయమని చెబుతాడు. ఈ సినిమా చూడక ముందు, ఒక పాత్రతో సినిమా చేయడం నిజంగా సాహసమే అనిపిస్తుంది. సినిమా చూసిన తరువాత, కథ లేకుండా సినిమా తీయడం అంతకంటే పెద్ద సాహసంగా అనిపిస్తుంది.

సామ్ సీఎస్ నేపథ్య సంగీతం .. శ్యామ్ వడవలి ఎడిటింగ్ .. కిశోర్ ఫొటోగ్రఫీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే కథలో సందర్భాలు .. సన్నివేశాలు .. లొకేషన్స్ మారుతున్నప్పుడు మిగతావారి పనితీరును గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సినిమాలో అలాంటివేం కనిపించవు. ఒక ఇంట్లో .. ఒక పాత్రతో సినిమా తీయడం ప్రయోగమే అవుతుంది .. అదీ అందుకు తగిన కథ ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఈ సినిమాలో ఆ కథనే లేదు. 

ఈ సినిమా చివర్లో 'ఇలాంటి కష్టం ఏ ఆడపిల్లకు రాకూడదు' అని జానూ అనుకుంటుంది. ఆ డైలాగ్ ను ' ఇలాంటి కష్టం ఏ ప్రేక్షకుడికి రాకూడదు' అని మార్చుకోవచ్చు. '105 మినిట్స్' అనే టైటిల్ పెట్టి, ఆ టైమ్ లో ఏమీ చెప్పకండా, అసలు కథ నెక్స్ట్ పార్టులో అని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.

Trailer

More Reviews