'టెనెంట్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Tenant

Movie Name: Tenant

Release Date: 2024-06-07
Cast: Sathyam Rajesh, Megha Choudary, Bharath Kanth , Chandana, Adukalam Naren
Director:Yugandhar
Producer: Chandrasekhar Reddy
Music: Jemin Jome
Banner: Mahaateja Creations
Rating: 2.25 out of 5
  • సత్యం రాజేశ్ హీరోగా చేసిన 'టెనెంట్'
  • ఏప్రిల్ 19న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఆసక్తికరంగా సాగని కథాకథనాలు 
  • నీరసంగా నడిచే సన్నివేశాలు   

సత్యం రాజేశ్ హీరోగా రూపొందిన చిత్రమే 'టెనెంట్'. మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి యుగంధర్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా, నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఓటీటీ వైపు  నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూద్దాం. 

గౌతమ్ (సత్యం రాజేశ్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన మరదలు సంధ్య (మేఘ చౌదరి)తో అతని వివాహం జరుగుతుంది. హ్యాపీగా వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. అదే అపార్టుమెంటులో ఆ పక్కనే ఉన్న ఫ్లాట్ లో రిషి (భరత్ కాంత్) తన స్నేహితులతో కలిసి ఉంటూ ఉంటాడు. అతను శ్రావణి (చందన)ను ప్రేమిస్తూ ఉంటాడు.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే తాను సెటిల్ కావాలంటూ రిషి ఆమెను ఆపుతూ వస్తుంటాడు. 

ఈ నేపథ్యలోనే హఠాత్తుగా సంధ్య అదోలా మారిపోతుంది. భర్తతో మాట్లాడటం మానేస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే గౌతమ్ ఆమెను హత్య చేస్తాడు. మూడో కంటికి తెలియకుండా ఆమె డెడ్ బాడీని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ తగుల బెట్టేస్తాడు. అదే సమయంలో ఊరు నుంచి రిషి దగ్గరికి శ్రావణి వచ్చేస్తుంది. ఆమెను ఎక్కడ ఉంచాలో తెలియక రిషి అయోమయంలో పడిపోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తన ఫ్లాట్ లోనే ఉంచుతాడు. 

అక్కడ గౌతమ్ తన భార్య డెడ్ బాడీని తగుల బెడుతున్న సమయంలోనే, ఇక్కడ అతని పక్క ఫ్లాట్ లో నుంచి రిషి - శ్రావణి ఇద్దరూ దూకేస్తారు. అటు ఆ కేసు .. ఇటు గౌతమ్ కేసు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్తేర్)కి అప్పగిస్తారు. దాంతో ఆమె రంగంలోకి దిగుతుంది. హాస్పిటల్లో ఉన్న రిషిని కలుసుకుని జరిగిన సంఘటనలను గురించి తెలుసుకుంటుంది. అలాగే గౌతమ్ ను అదుపులోకి తీసుకుని ఆరాతీయడం మొదలుపెడుతుంది. 

గౌతమ్ తన భార్యను ఎందుకు చంపుతాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఎలాంటివి? పెళ్లి చేసుకోవాలనుకున్న రిషి - శ్రావణి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఈ రెండు జంటల జీవితాలు అల్లకల్లోలం కావడానికి కారకులు ఎవరు? అనేది ఆసక్తిని రేకెత్తించే అంశాలు. 

యుగంధర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆయన తయారు చేసుకున్న కథనే ఇది. నిజానికి ఇది చాలా సింపుల్ లైన్. పెళ్లయిన జంట .. ప్రేమలో పడిన జంట చుట్టూ తిరిగే కథ ఇది. ఈకథ అంతా ఒక అపార్టుమెంటులో .. ఒకే ఫ్లోర్ లో జరుగుతుంది. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే ప్రాణంగా మారవలసి వస్తుంది. అప్పుడే ఇంత చిన్న కథలు చివరివరకూ ప్రేక్షకులను కూర్చోబెట్టగలుగుతాయి. 

అయితే దర్శకుడు కూడా స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటానికి తన వంతు ప్రయత్నం చేశాడు. అందువల్లనే గతం .. వర్తమానం తెరపై కలిసి నడుస్తూ ఉంటాయి. అయితే ఈ స్క్రీన్ ప్లే చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ప్రస్తుతంలో చనిపోయిన పాత్ర .. ఆ వెంటనే మొదలయ్యే గతంలో తెరపైకి రావడం అయోమయాన్ని కలిగిస్తూ ఉంటుంది. సాధారణ ప్రేక్షకులకు ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. 

ఇక ఈ కథ ఒక ఆత్మహత్య .. ఒక హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఎస్తేర్ కనిపిస్తుంది. హత్య .. ఆత్మహత్య సంఘటనలు ఒక ఎత్తయితే, వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడం మరో ఎత్తు. అయితే ఈ కథలో ఇన్వెస్టిగేషన్ చాలా చప్పగా సాగుతూ ఉంటుంది. హత్యకీ .. ఆత్మహత్యకి బలమైన కారణాలు ఉన్నప్పటికి, ఆ దిశగా ఆసక్తిని పెంచడంలో ఇన్వెస్టిగేషన్ ట్రాక్ బలహీనంగా అనిపిస్తుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించినవారు .. తమ పాత్రలకు న్యాయం చేశారు. సాహిత్య సాగర్ అందించిన సంగీతం ఫరవాలేదు. జెమిన్ జోమ్ కెమెరా పనితనం బాగుంది. విజయ్ ఎడిటింగ్ ఫరవాలేదు. దర్శకుడు ఎంచుకున్నది చాలా సింపుల్ లైన్ అయినప్పటికీ దానిని బలంగా చెబితే బాగుండేది. కథనంలో ఎంతమాత్రం చురుకుదనం కనిపించదు. నీరసంగా సన్నివేశాలు నడుస్తూ ఉంటాయి. ఇక ఉన్న పాత్రలే తక్కువ. ఆ పాత్రలను అపార్టుమెంటులో ఒక ఫ్లాట్ కి పరిమితం చేయడం .. కథను అక్కడక్కడే తిప్పడం అసంతృప్తిని కలిగిస్తుంది.

Trailer

More Reviews