'రత్నం' ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Rathnam

Movie Name: Rathnam

Release Date: 2024-05-23
Cast: Vishal, Priya Bhavani Shankar, Samudrakhani, Muralisharma, Yogibabu
Director:Hari
Producer: Kaarthekeyan Santhanam
Music: Devi Sri Prasad
Banner: Stone Bench Films
Rating: 2.50 out of 5
  • విశాల్ హీరోగా రూపొందిన 'రత్నం'
  • హరి మార్క్ మాస్ యాక్షన్ మూవీ ఇది 
  • ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ కి ప్రాధాన్యత 
  • కథ దెబ్బతినడానికి కారణమైన అంశం అదే
  • ఎంటర్టైన్ మెంట్ లోపించిన కంటెంట్

మాస్ యాక్షన్ హీరోగా తమిళంలోనే కాదు .. తెలుగులోను విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఆయన తమిళంతో పాటు తెలుగులోను తన సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. అలా ఆయన చేసిన 'రత్నం' సినిమా తమిళ .. తెలుగు భాషల్లో ఏప్రిల్ 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 
 
ఈ కథ ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు గ్రామంలో జరుగుతుంది. పన్నీర్ స్వామి (సముద్రఖని) రౌడీయిజం చేస్తూనే రాజకీయనాయకుడిగా ఎదుగుతాడు. పదేళ్ల వయసులో ఉండగానే అతని ప్రాణాలను రత్నం (విశాల్) కాపాడతాడు. అప్పటి నుంచి అతణ్ణి పన్నీర్ స్వామి ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. అతని కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడేలా రత్నం ఎదుగుతాడు. ఈ ఇద్దరినీ టచ్ చేయడానికి లోకల్ రౌడీలు మాత్రమే కాదు, పోలీసులు సైతం భయపడుతూ ఉంటారు. 

అలాంటి పరిస్థితుల్లోనే 'నీట్' ఎగ్జామ్ రాయడానికి మల్లిక ( ప్రియా భవాని శంకర్) ఆ గ్రామానికి వస్తుంది. ఆమెను చూడగానే రత్నం ఫాలో కావడం మొదలుపెడతాడు. అదే సమయంలో ఆమెపై హఠాత్తుగా ఎటాక్ జరుగుతుంది. తమ స్థలాన్ని ఆక్రమించడానికి ధర్మలింగం (మురళీశర్మ) ప్రయత్నిస్తున్నాడనీ, తనపై దాడి చేసింది అతని మనుషులు కావొచ్చని రత్నంతో  మల్లిక చెబుతుంది. తమ పూర్వీకుల సమాధులున్న ఆ స్థలాన్ని తాము వదులుకోలేమని అంటుంది.   
 
ఇక ధర్మలింగం మానవత్వం ఎంతమాత్రం లేని ఒక మృగం వంటివాడు. ఎక్కడ ఖరీదైన స్థలం కనిపించినా దానిని ఆక్రమించడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళుతుంటాడు. అతని ఇద్దరి తమ్ముళ్లతో కలుపుకుని 'లింగం బ్రదర్స్' గా పాప్యులర్ అవుతారు. మొదటి నుంచి కూడా అనేక దుర్మార్గాలు చేస్తూ ముగ్గురూ ఎదుగుతారు. అలాంటి వాళ్ల ముగ్గురూ కలిసి మల్లిక వాళ్ల 5 ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజ్ కట్టేస్తారు. ఆ స్థలాన్ని తమకి అమ్మినట్టుగా సంతకం చేయమని బెదిరిస్తూ ఉంటారు.      

మల్లిక స్థలాన్ని ఆక్రమించి కాలేజ్ బిల్డింగ్ కట్టిన ధర్మలింగానికి బుద్ధి చెప్పడానికి రత్నం రంగంలోకి దిగుతాడు. తన గ్యాంగ్ ను ఆమె ఇంటికి కాపలా పెడతాడు. మల్లిక కోసం రత్నం రిస్క్ చేయడం పన్నీర్ స్వామికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే సందేహాన్ని అతను రత్నం దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు రత్నం ఒక ఫొటోను తీసి పన్నీర్ స్వామికి చూపిస్తాడు. అచ్చం తన తల్లి రంగనాయకి మాదిరిగా ఉండటం వల్లనే, ఆమెను కాపాడుతున్నానని చెబుతాడు.

రంగనాయకి ఎవరు? రత్నం గతం ఏమిటి? మల్లికను చంపించడానికి ధర్మలింగం  ప్రయత్నించడం వెనుక కేవలం స్థలం విషయమే కాకుండా మరేదో కారణం ఉందని రత్నం భావిస్తాడు. ఆ కారణం ఏమిటి? అతని బారి నుంచి మల్లికను రత్నం కాపాడతాడా? తాను ఒంటరినని బాధపడుతూ వచ్చిన రత్నానికి చివరికి తెలిసే నిజం ఏమిటి? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

హరి దర్శకత్వంలో ఇంతవరకూ మాస్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా వచ్చాయి. అలాగే విశాల్ నుంచి వచ్చిన సినిమాలు దాదాపు ఈ జోనర్ కి సంబంధించినవే. అలా ఈ ఇద్దరి మార్క్ మాస్ యాక్షన్ తో రూపొందిన సినిమానే ఇది. ఎమోషన్ - యాక్షన్ ప్రధానంగా ఈ కథ సాగుతుంది. ప్రధానమైన ప్రతి పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అయితే చాలా తక్కువ నిడివిలోనే వాటిని పూర్తి చేయడం వలన ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. 

ఇక చివర్లో రివీల్ అయ్యే ట్విస్టులు కూడా ఆసక్తికరంగానే అనిపిస్తాయి. బైకులపై .. కార్లపై .. లారీలపై ఛేజింగ్ సీన్స్ ను ఒక రేంజ్ లో తీశారు. ఇక డైలాగులకంటే కూడా వేటకొడవళ్ల శబ్దాలు ఎక్కువగా వినిపిస్తాయి. తెగిపోయిన కాళ్లు .. చేతులే తెరపై ఎక్కువగా కనిస్తాయి. ఇక టీనేజ్ స్టేజ్ ను ఎప్పుడో దాటిపోయిన పాత్రలకి పోలికలు మారిపోవడం చిత్రంగా అనిపిస్తుంది. 

తనని హీరో కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండటంతో, తనని ప్రేమిస్తున్నాడేమోనని మల్లిక అనుకుంటుంది. అతన్నే పెళ్లి చేసుకుంటానని తండ్రితో చెబుతుంది. ఆమె తన తల్లి మాదిరిగా ఉండటం వల్లనే ఇదంతా చేస్తున్నాననే విషయాన్ని హీరో అప్పుడు రివీల్ చేస్తాడు. ఈ కథ ప్రేక్షకులకు ఎక్కక పోవడానికి ప్రధానమైన కారణం ఇదే. ఇక హీరోకు జోడి లేదు .. అందువలన రొమాన్స్ కి ఛాన్స్ లేదు .. ఆడియన్స్ నిరాశ చెందడానికి ఇది మరో కారణం.

ఇక విశాల్ .. సముద్రఖని ఒక వైపు .. మురళీశర్మ విలనిజం మరో వైపు. విలన్ వైపు వెయిట్ తగ్గడం కూడా ఆడియన్స్ లో ఉత్కంఠ తగ్గడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది విశాల్ పాత్రకి స్టైల్ ను యాడ్ చేయలేదు. ఆయన చాలా డల్ గా కనిపిస్తూ ఉంటాడు. యోగిబాబుతో కామెడీని ప్లాన్ చేశారుగానీ, అది సరిపోదు. ఆర్టిస్టులంతా ఎవరి పాత్ర పరిధిలో వారు బాగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సినిమాకి చాలా హెల్ప్ అయింది. సుకుమార్ ఫొటోగ్రఫీకి మంచి మార్కులే ఇవ్వొచ్చు. ఎడిటింగ్ కూడా ఓకే. కథలో .. యాక్షన్ ఉంది ..  ఎమోషన్ ఉంది .. కానీ అందులో కొత్తదనం లేదు. నేల .. టైర్లు అరిగిపోయిన దారిలోనే ఈ కథా రథం పరిగెడుతుంది. 

Trailer

More Reviews