'బస్తర్' (జీ 5) మూవీ రివ్యూ!

Bastar

Movie Name: Bastar

Release Date: 2024-05-17
Cast: Adah Sharma, Indira Tiwari, Vijay Krishna, Shilpa Shukla, Yashpal Sharma
Director:Sudipto Sen
Producer: Vipul Amrutlal Shah
Music: Bishakh Jyoti
Banner: Sunshine Pictures
Rating: 3.00 out of 5
  • అదా శర్మ ప్రధాన పాత్రగా 'బస్తర్'
  • నక్సలిజం నేపథ్యంలో సాగే కథ 
  • యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా 
  • సహజత్వానికి దగ్గరగా వెళ్లిన కథాకథనాలు 
  • హింస - రక్తపాతం ఎక్కువ

అదా శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన 'బస్తర్' మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. గతంలో 'ది కేరళ స్టోరీ' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శక నిర్మాతలు సుదీప్తో సేన్ - విపుల్  అమృతలాల్ షా నుంచి వచ్చిన సినిమా కావడంతో, ముందు నుంచే ఈ సినిమాపై అందరిలో అంచనాలు ఉన్నాయి. 2010 లో ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. నక్సలిజం నేపథ్యంలో నడిచే ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన తెలుగులోను 'జీ 5' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

ఈ కథ 2010 లో జరుగుతూ ఉంటుంది. అది ఛత్తీస్ గఢ్ లోని 'బస్తర్' ప్రాంతం. అక్కడ నక్సలైట్ల కార్యకలాపాలు ఉద్ధృతంగా జరుగుతూ ఉంటాయి. 'బస్తర్ అటవీ ప్రాంతం కావడంతో, నక్సలైట్లు దానిని అడ్డాగా చేసుకుంటారు. ఆ ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి ఒకరిని నక్సలిజంలోకి పంపించాలనే ఒక నిబంధన ఉంటుంది. అంతేకాదు .. పోలీసులతో ఎవరూ ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎవరికీ రాకూడదు. 

ఆ ప్రాంతంలో నక్సలైట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ గా నీరజా మాధవ్ (అదా శర్మ)ను నియమిస్తుంది. దాంతో ఆమె తన టీమ్ తో దూసుకుపోతూ ఉంటుంది. నక్సలైట్లను ఏరిపారేస్తూ వెళుతుంటుంది. అయితే అవన్నీ నకిలీ ఎన్ కౌంటర్లు అంటూ ఆమెపై కోర్టులో కేసులు కూడా నడుస్తూనే ఉంటాయి. ఒక వైపున వాటిని ఎదుర్కొంటూనే, గర్భవతి అయిన ఆమె ఆ ఫారెస్టు ప్రాంతంలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటుంది.     

అలాంటి పరిస్థితుల్లోనే ఆ ప్రాంతానికి చెందిన మిళింద్ అనే వ్యక్తి, తన పిల్లల చదువు విషయంగా నీరజా మాధవ్ ను కలుస్తాడు. దాంతో నక్సలైట్ నాయకుడైన లంకా రెడ్డి .. అతని అనుచరులు మిళింద్ ను దారుణంగా చంపేస్తారు. అతని కొడుకు రమణను తమ దళంతో తీసుకుపోతారు. ఉన్న ఒక్క కూతురుతో రత్న జీవితాన్ని భారంగా గడుపుతూ ఉంటుంది. లంకా రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంటుంది. 

 రత్నకి ఎస్పీవోగా శిక్షణ ఇప్పిస్తూ ఉంటుంది నీరజా మాధవ్. పోలీస్ శిక్షణ తీసుకుంటున్న రత్న, దళంలో ఉన్న తన కొడుకును బయటకి తీసుకురావాలనే ఆలోచనలో ఉంటుంది. నీరజా మాధవ్ తనతో పాటు రత్నను కూడా కూంబింగ్ కి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఇక నగరాల్లో ఉన్న కొంతమంది కన్ను 'బస్తర్' ప్రాంతంలో ఖనిజ సంపదపై పడటం వలన, ఆ ప్రాంతం అభివృద్ధి చెందకుండా నక్సలైట్లను సపోర్టు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

ఈ కారణంగానే పోలీసుల కదలికలకి సంబంధించిన సమాచారం నక్సలైట్లకు చేరిపోతుంది. వాళ్లు జవాన్ల శిబిరంపై దాడి చేయవచ్చనే అనుమానం నీరజా మాధవ్ కి కలుగుతుంది. దాంతో ఆమె హోమ్ మినిష్టర్ కి విషయం చెప్పి బ్యాకప్ కోరుతుంది. అయితే సరైన సమయంలో అతను స్పందించలేకపోతాడు. ఆ రాత్రివేళ జవాన్లు అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, ఊహించని విధంగా నక్సలైట్ల దాడి జరుగుతుంది. ఫలితంగా 76 మంది జవాన్లు చనిపోతారు. 

అప్పుడు నీరజా మాధవ్ ఏం చేస్తుంది? నక్సలిజాన్ని కట్టడి చేయాలనే ఆమె ప్రయత్నం ఫలిస్తుందా? జవాన్లకు సంబంధించిన సమాచారాన్ని నక్సలైట్లకు అందించినది ఎవరు? తన భర్తను చంపిన లంకారెడ్డిపై రత్న ప్రతీకారం తీర్చుకుంటుందా? దళంలో చేరిన తన కొడుకును బయటికి తీసుకుని రాగలుగుతుందా? అనేది మిగతా కథ.

ఇది యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా. బస్తర్ లో నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రభుత్వం .. ఆ ప్రదేశంపై తమ పట్టుకోల్పోకూడదనే ఉద్దేశంతో నక్సలైట్లు ఉంటారు. ఈ ఇద్దరి మధ్యలో తమ స్వార్థప్రయోజనాలను నెరవేర్చుకునే పనిలో బయటికి కనిపించని కొన్ని పెద్ద తలకాయలు ఉంటాయి. ఇలా వివిధ కోణాల నుంచి ఈ కథ ముందుకు వెళుతుంది. దర్శకుడు తాను చెప్పదలచుకున్నది పెర్ఫెక్ట్ గా చెప్పాడు. ఎక్కడా కూడా నాటకీయత వైపు వెళ్లలేదు. 

అయితే ఈ సినిమాలో హింసను సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు సాధారణమైన స్థాయిలో వదిలిపెట్టలేదు. తలలు నరకడం .. మెడలు కోయడం .. కట్టెలు కొట్టినట్టుగా కాళ్లు - చేతులు కొట్టడం .. చాలా దారుణంగా .. టైట్ క్లోజప్ లో చూపించారు. ఇక పసిపిల్లను మంటల్లోకి విసిరేయడం వంటి దృశ్యాలు సాధారణమైన ప్రేక్షకులు చూడలేనివి.

కథ అంతా కూడా అదా శర్మ పాత్రను పట్టుకునే పరిగెడుతూ ఉంటుంది. ఆమె తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక ఇతర పాత్రలలోని వారంతా పాత్ర పరిధిలో మెప్పించారు. ఇక రగుల్ ధర్మన్ కెమెరా పనితనం బాగుంది. ఫారెస్టు నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. భిషక్ జ్యోతి నేపథ్య సంగీతం .. ఆడియన్స్ ను సన్నివేశాలలో నుంచి బయటికి రాకుండా చూస్తుంది. దేవ్ రావ్ జాదవ్ ఎడిటింగ్ ఓకే. 


Trailer

More Reviews