'సిద్ధార్థ్ రాయ్' (ఆహా) మూవీ రివ్యూ!

Siddharth

Movie Name: Siddharth

Release Date: 2024-05-03
Cast: Deepak Raj, Thanvi Negi, Nandini, Anand, Kalyani Natarajan, Mathew Varghese
Director:Yashasvi
Producer: Jaya Adapaka
Music: Rathan
Banner: Radha Damodar Stuidios
Rating: 2.00 out of 5
  • దీపక్ రాజ్ హీరోగా రూపొందిన 'సిద్ధార్థ్ రాయ్'
  • కంగారుపెట్టేసే హీరో యాటిట్యూడ్  
  • బలహీనమైన కథాకథనాలు 
  • ఉన్మాదానీకీ .. ఉత్సాహానికి మధ్య లవ్వు
  • కలవరపెట్టే కాన్సెప్ట్ ఇది

ఈ మధ్య కాలంలో యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమాల జాబితాలో 'సిద్ధార్థ్ రాయ్' ఒకటి. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన దీపక్ రాజ్, హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. అతని జోడీగా తన్వీ నేగి అలరించింది. ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ నెల 3వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ వైజాగ్ లో జరుగుతుంది. సిద్ధార్థ్ (దీపక్ రాజ్) శ్రీమంతుల బిడ్డ. అతని తండ్రి (ఆనంద్) జీవితంలో చాలా క్రిందిస్థాయి నుంచి ఎదుగుతూ కోటీశ్వరుడు అవుతాడు. తన ఎదుగుదలకి కారణం మంచి పుస్తకాలు చదవడం అని ఆయన భావిస్తూ ఉంటాడు. ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండటం వలన, దీపక్ చిన్నప్పటి నుంచి వాటిని చదువుతూ జీనియస్ అవుతాడు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా .. లాజికల్ గా ఆలోచించడం మొదలుపెడతాడు. 

 ఎక్కువగా చదువుకోవడం వలన ఎమోషన్స్ అనేవి అతనికి చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులు చనిపోతే ఏడవడం .. ఆకలేస్తే రుచికరమైనవి మాత్రమే తినాలనుకోవడం .. నిద్రొస్తే బెడ్ రూమ్ లో మాత్రమే పడుకోవాలనుకోవడం .. లైగిక పరమైన అవసరాలను మనసుపడినవారితోనే తీర్చుకోవాలనుకోవడం వంటి విషయాలకు అతను పూర్తిగా వ్యతిరేకి. అతని విపరీత ధోరణి పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు.  

దీపక్ చదువుకునే ఇంజనీరింగ్ కాలేజ్ లోనే ఇందూ ( తన్వీ నేగి) చేరుతుంది. దీపక్ మిగతావారికంటే భిన్నంగా కనిపించడంతో అతని పట్ల ఆకర్షణ పెంచుకుంటుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలోనే అతని స్వభావం ఆమెకి అర్థమవుతూ వస్తుంది. జీవితాన్ని నడిపించేది సైన్స్ - లాజిక్ అనేది అతని ఉద్దేశం. జీవితాన్ని అందంగా మార్చేది ఎమోషన్స్ అనేది ఆమె అభిప్రాయం. ఆమె మాటల ప్రభావం వలన సిద్ధార్థ్ లో కాస్త మార్పు కనిపిస్తుంది. దాంతో పేరెంట్స్ కూడా ఆనందంగా ఉంటారు.  

ఇక సిద్ధార్థ్ తో కలిసి నడవాలనే నిర్ణయానికి ఇందూ వస్తుంది. అతను కూడా తన తల్లిదండ్రులకు ఇందూను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక మూడు సంఘటనలు వరుసగా జరుగుతాయి. దాంతో సిద్ధార్థ్ ఎంతమాత్రం మారలేదనే విషయం ఇందూకి అర్థమైపోతుంది. ఇక మనిద్దరికీ కలవదు బాసూ అంటూ నిర్మొహమాటంగా అతనికి గుడ్ బై చెబుతుంది. అప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు? ఇందూ తీసుకున్న ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ.

ఈ సినిమాకి యశస్వి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఫస్టులుక్ బయటికి వచ్చినప్పుడు, 'అర్జున్ రెడ్డి'తో పోలికపెడుతూ అంతా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో హీరో యాటిట్యూడ్ కి దగ్గరగా ఈ సినిమా హీరో కూడా బిహేవ్ చేస్తాడు. టీజర్ .. ట్రైలర్ వచ్చిన తరువాత ఆడియన్స్ లో ఆ అభిప్రాయం మారకపోగా మరింత బలపడింది. సినిమా విడుదల తరువాత కూడా అదే అభిప్రాయం ఆడియన్స్ లో ఉండిపోయింది. 

ఎక్కడో జరిగిన ఒక యథార్థ సంఘటనకి ప్రేరణ ఈ కథ .. అంటూ దర్శకుడు చివర్లో చెప్పినప్పటికీ, పేక్షకులు జీర్ణించుకోలేని కొన్ని అంశాలు ఈ కథలో కనిపిస్తాయి. అసలు ఏ మాత్రం ఎమోషన్స్ లేని హీరోను ముందుగా ఆ విషయం తెలిసిమరీ హీరోయిన్ ప్రేమించడం ఒక చిత్రం. అదే అతనిలోని లోపం అన్నట్టుగా భావించి పక్కన పెట్టడానికి ట్రై చేయడం మరో విచిత్రం. తల్లిదండ్రుల విషయంలోనే పెద్దగా ఎమోషన్స్ కి వెళ్లని హీరో, హీరోయిన్ కోసం అదే పనిగా తిరగడం ఇంకో విచిత్రం. ఇదే విషయాన్ని ఈ సినిమాలో ఒక పాత్ర చేత కూడా దర్శకుడు చెప్పించాడు.

ఇక మానసిక సమస్యతో చిన్నప్పటి నుంచి బాధపడుతున్న హీరోను, శ్రీమంతులైన పేరెంట్స్ అలా వదిలేసి, అంతా అయిన తరువాత డాక్టర్ దగ్గరికి వెళ్లడం ప్రేక్షకుడిని బిత్తరపోయేలా చేస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో రెండు సిగరెట్లు ఒకేసారి తాగుతూ ఉంటాడు. నిద్రొస్తే రోడ్డుపైనే పడుకుంటాడు. లైంగిక పరమైన కోరికలు కలిగితే అందుబాటులో ఉన్నవారితో కానిచ్చేస్తూ ఉంటాడు. ఇలా అతని వికారాలు తట్టుకోవాలంటే కాస్తంత గుండె ధైర్యం కావలసిందే.

హీరో ధోరణి చూసి కంగారు పడాలా? లేదంటే అతని హెయిర్ స్టైల్ - మీసకట్టు చూసి భయపడాలా? అనే అయోమయం ఆడియన్స్ కి కలుగుతుంది. ఒకవేళ అలాంటి లుక్ తోనే అతను తేడా అని చెప్పాలనుకున్నాడా? అనే విషయం అర్థంకాదు. హీరోకి ఎమోషన్స్ లేవు అనే విషయం స్పష్టం చేయడానికి అన్నట్టుగా, అతనితో రోబో తరహాలో డైలాగ్స్ చెప్పించారు. ఇక రోబో ఆలోచన రానివారు, అతన్ని ఏదైనా అతీంద్రియ శక్తి ఆవహించిందేమో అనుకుంటారు. 

రథన్ సంగీతం .. శ్యామ్ కె నాయుడు కెమెరా పనితనం .. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కథకి తగినట్టుగానే కనిపిస్తాయి. గతంలో ప్రేమకథ అనేది సున్నితంగానే తెరపై కనిపిస్తూ వచ్చింది. ప్రేమకోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని హీరో, ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే హీరోయిన్ ను ఆదరించడానికి ప్రేక్షకులు ఎంతమాత్రం వెనక్కి తగ్గేవారు కాదు.

 కానీ ఇప్పుడు కొత్తదనం పేరుతో, ఎవరు ప్రేమికుడో .. ఎవరు ఉన్మాదో .. అసలు వీరిద్దరి మధ్య ఉండే తేడా ఏమిటి? అనే విషయంలో అయోమయం నెలకొనేలా ఈ కథలు ఉంటున్నాయి. యథార్థ సంఘటనే అయినా ప్రయోజనం లేని కథలను చెప్పవలసిన పనిలేదు. చూపించవలసిందంతా చూపించి, ఇలాంటి సమస్యకు ఇలాంటి పరిష్కారమే దక్కుతుందని చెప్పే అవసరం కూడా ఉండదు. 

Trailer

More Reviews