'భూతద్దం భాస్కర్ నారాయణ' (ఆహా) మూవీ రివ్యూ!

Bhoothaddam Bhaskar Narayana

Movie Name: Bhoothaddam Bhaskar Narayana

Release Date: 2024-03-22
Cast: Shiva Kandukuri,Raashi Singh,Varshini Sounderajan,Shafi, Devi Prasad,Sivannarayana Naripeddi
Director:Purushotham Raaj
Producer: Snehal Jangala - Karthik Mudumbi
Music: Sricharan Pakala - Vijai Bulganin
Banner: Million Dreams Creations
Rating: 2.25 out of 5
  • కామెడీ థ్రిల్లర్ జోనర్లో 'భూతద్దం భాస్కర్ నారాయణ'
  • శివ కందుకూరి జోడీగా కనిపించే రాశి సింగ్ 
  • నిదానంగా సాగే కథాకథనాలు 
  • అసహనాన్ని కలిగించే సన్నివేశాలు 
  • కథలో చాలా దూరం సాగిన కాలయాపన  

శివ కందుకూరి హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా చేసిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ కామెడీ థ్రిల్లర్ నిన్నటి నుంచి 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతోంది. శివ కందుకూరి ప్రైవేట్ డిటెక్టివ్ గా కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా రాశి సింగ్ కనిపించనుంది. పురుషోత్తమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

భూతద్దం భాస్కర్ నారాయణ ( శివ కందుకూరి)కి చిన్నప్పటి నుంచి కంటి చూపు సమస్య ఉంటుంది. అందువలన అతను భూతద్దాల వంటి స్పెట్స్ వాడుతూ ఉంటాడు. అందువలన అందరూ కూడా అతణ్ణి భూతద్దం భాస్కర్ నారాయణ అని పిలుస్తూ ఉంటారు. టీనేజ్ కి దగ్గరలో ఉండగానే అతను పొరుగింటి లక్ష్మి (రాశి సింగ్)ను ఇష్టపడుతూ ఉంటాడు. భాస్కర్ నారాయణ అన్నయ్య వేరే మతానికి చెందిన యువతిని ప్రేమిస్తాడు. ఆ విషయంలో ఆ యువతి తండ్రితో గొడవ పడతాడు. ఆ మరుసటి రోజునే ఆ యువతి తండ్రి చనిపోవడంతో ఆ కేసు భాస్కర్ నారాయణ్ అన్నయ్య మెడకి చుట్టుకుంటుంది. 

 భాస్కర్ నారాయణ ఆ కేసు గురించి పరిశోదించి, తన అన్నయ్య నిర్దోషి అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ చిన్నపిల్లాడని భావించి ఎవరూ కూడా అతని మాట పట్టించుకోరు. దాంతో డిటెక్టివ్ కావాలనీ .. అన్యాయంగా ఎవరూ శిక్షించబడకూడదని భావిస్తాడు. అలా పెద్దవాడైన భాస్కర్ నారాయణ, పట్టుదలతో డిటెక్టివ్ అవుతాడు. లక్ష్మి పట్ల అతని ఇష్టం .. ప్రేమగా మారుతుంది. లక్ష్మి చెల్లెలు శ్రావణి కూడా అతనితో చనువుగా ఉంటూ  ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక - ఆంద్ర సరిహద్దుల్లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. 

హంతకుడు స్త్రీలను మాత్రమే హత్య చేస్తూ ఉంటాడు. శవంపై దిష్టి బొమ్మ తల పెట్టి వెళుతూ ఉంటాడు. ఎక్కడో హత్య చేసి శవాలను అతను ఒకే ప్రదేశంలో పడేస్తూ ఉంటాడు. హత్య జరిగిన ప్రదేశంలో మొండెం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. తల ఏమైపోయిందనేది ఎవరికీ తెలియదు. అలా 17 మంది హత్యలు జరుగుతాయి. లక్ష్మి చెల్లెలు శ్రావణి మర్డర్ కూడా జరగడంతో, భాస్కర్ నారాయణ ఆలోచనలో పడతాడు. గతంలో తన అన్నయ్యను జైలుపాలు చేసిన సంఘటనకీ, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు ఏదో సంబంధం ఉందని భాస్కర్ నారాయణ భావిస్తాడు. 

జరిగిన 16 హత్యలలో .. శ్రావణి హత్య మాత్రమే మిగతావాటికి భిన్నంగా అనిపిస్తుంది. దాంతో ఆయన మరింత ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. హత్య చేయబడుతున్నవారు స్త్రీలు కాదనీ, ట్రాన్స్ జెండర్లనే విషయం అతనికి అర్థమవుతుంది. వాళ్లంతా ఒకే జాతకాన్ని కలిగి ఉన్నారనే విషయం అతని పరిశోధనలో తేలుతుంది. వాళ్లంతా వేరే కారణంగా హత్య చేయబడలేదనీ, 'బలి' ఇవ్వబడ్డారనే సంగతి అతనికి స్పష్టమవుతుంది. 18 వ హత్యగా ఎవరు బలి కానున్నారనేది అతనికి అర్థమైపోతుంది. 

అప్పుడు భూతద్దం భాస్కర్ నారాయణ ఏం చేస్తాడు? ట్రాన్స్ జెండర్లను ఎవరు హత్యచేస్తున్నారు?  అందుకు కారణం ఏమిటి? శ్రావణి హత్య .. మిగతా హత్యలకు ఎందుకు భిన్నంగా జరుగుతుంది? ట్రాన్స్ జెండర్లను ఎవరు బలి ఇస్తున్నారు? ఈ తతంగం వెనుక ఉన్నదెవరు? 18వ బలిని భాస్కర్ నారాయణ ఆపగలుగుతాడా?  అనే మలుపులతో ఈ కథ నడుస్తూ ఉంటుంది.

ఈ కథను దర్శకుడు పురుషోత్తమ్ రాజుయే రాసుకున్నాడు. సీరియస్ గా జరుగుతూ పోయే హత్యలను,  కామెడీ టచ్ తో ఒక డిటెక్టివ్ ఎలా పరిశోధిస్తూ వెళ్లాడు? అనేదే కథ. వరుస హత్యలు .. ఒక డిటెక్టివ్ రంగంలోకి దిగడం .. సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం వంటి కథలు చాలానే వచ్చాయి. కొత్తగా అనిపించాలంటే .. ఆ డిటెక్టివ్ తన పరిశోధనను కొత్త రూట్లో సాగిస్తూ .. కేసులు సాల్వ్ చేస్తూ వెళ్లాలి. ఐడియా భలేగా ఉందే అని ఆడియన్స్ అనుకోవాలి .. కానీ అలా అనుకునే అవకాశం లేని సినిమా ఇది. 

హత్యలన్నీ ఒకదాని తరువాత ఒకటిగా .. ఒకేలా జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలకు సంబంధించి ఊళ్లో జనల్లోగానీ .. పోలీస్ డిపార్టుమెంటులో గాని ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇక తాను గొప్ప డిటెక్టివ్ గా పేరుతెచ్చుకోవాలనే పట్టుదలతో పెరిగిన హీరోకూడా సందర్భం లేకుండా కామెడీ చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు తన లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటాడుగానీ, అందుకు సంబంధించిన పనుల పరంగా అడుగు కూడా ముందుకు వేయడు. 

అలా పుణ్యకాలం మొత్తం పూర్తవుతుందనగా, అప్పుడు డిటెక్టివ్ బయల్దేరతాడు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కి సంబంధించిన లింకులు .. ట్విస్టులు, వరుస హత్యలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి కథానాయకుడు ప్రయత్నించడం వంటి సీన్స్ ఓకే. కానీ మొదటి నుంచి అక్కడివరకూ కథను ఇంట్రెస్టింగ్ గా నడిపే విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. కథాకథనాల సంగతి అటుంచితే, ఆర్టిస్టుల నుంచి పెర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకోవడానికి ఒకటికి రెండుమార్లు ట్రై చేసి ఉంటే బాగుండేది. అలా చేయకపోవడం వలన చాలా సీన్స్ కృతకంగా అనిపిస్తాయి. 

ఇక అసలే సీన్స్ డల్ గా అనిపిస్తుంటే .. నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో వెళ్లింది. గౌతమ్ ఫొటోగ్రఫీ ఫరవాలేదు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. సాగతీత సన్నివేశాలతో కథానాయకుడు కాలక్షేపం చేయకుండా .. తన పక్కనే ఉంటూ అతి కామెడీ చేసే ఫ్రెండ్ ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ ముందుకు వెళ్లుంటే ఈ కథ మరింత బెటర్ గా ఉండేదేమో అనిపిస్తుంది. ఆడిటోరియంలో ఎవరూ ఊహించని వ్యక్తిని చివరికి విలన్ గా చూపించాలనుకోవడంలో తప్పులేదు. కానీ అలాంటి పాత్రను పోషించిన ఆర్టిస్టుకి అది ఎంతవరకూ సెట్ అవుతుందనేది కూడా చూసుకోవాలసిన అవసరం ఉంది. 

Trailer

More Reviews