'ఆర్య' సీజన్ 3 (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

Aarya

Movie Name: Aarya

Release Date: 2024-02-09
Cast: Sushmita Sen,Chandrachur Singh, Viren Vazirani,Aarushi Bajaj,Vikas Kumar, Indraneil Sengupta
Director:Ram Madhvani - Sandeep Modi
Producer: Ram Madhvani - Amita Madhvani
Music: Vishal Khurana
Banner: Ram Madhvani Films
Rating: 3.50 out of 5
  • సుస్మిత సేన్ ప్రధాన పాత్రధారిగా 'ఆర్య 3'
  • నిన్నటి నుంచి 5 .. 6 .. 7 .. 8 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ 
  • ఎక్కడా పట్టుసడలని బలమైన కథ 
  • ఆయువు పట్టుగా అనిపించే స్క్రీన్ ప్లే  
  • ఆసక్తికరంగా సాగే సన్నివేశాలు
  • నిర్మాణ విలువలు .. ఫొటోగ్రఫీ .. బీజీఎమ్ హైలైట్

సుస్మితా సేన్ ప్రధానమైన పాత్రను పోషించిన 'ఆర్య', 1 .. 2 సీజన్లను పూర్తిచేసుకుంది.  3వ సీజన్ కి సంబంధించి 4 ఎపిసోడ్స్ క్రితం ఏడాది నవంబర్ 23వ తేదీన స్ట్రీమింగ్ కి వచ్చాయి. ఈ సీజన్ కి సంబంధించిన 5 .. 6 .. 7.. 8 ఎపిసోడ్స్ ను పార్టు 2గా, ఈ నెల 9వ తేదీ నుంచి 'హాట్ స్టార్' లో అందుబాటులోకి వచ్చాయి. 'అంతిమ్ వార్' పేరుతో వదిలిన ఈ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.
 
ఆర్య ( సుస్మితా సేన్) కోట్ల రూపాయల సరుకును పోలీస్ గొడౌన్స్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంటుంది. ఆ సరుకును ఆమె బయటికి తీసుకురాగానే తమ సొంతం చేసుకోవడానికి నళిని సాహెబా (ఇళా అరుణ్) బృందం రెడీగా ఉంటుంది. గోడౌన్ లో ఉన్న సరుకు ఆర్యదే అని నిరూపించి ఆమెను అరెస్టు చేయాలనే ఆలోచనలో పోలీస్ ఆఫీసర్ ఖాన్ (వికాస్ కుమార్) ఉంటాడు. అదే సమయంలో సూరజ్ - నందిని హత్య కేసులో ఆర్యను దోషిగా తేల్చి ఆమెను జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఇదే సమయంలో రష్యన్ డీలర్లతో డీల్ కుదుర్చుకోవడానికి ఆర్య సిద్ధమవుతుంది. ఈ విషయం ధృవ్ ద్వారా ఖాన్ కి తెలుస్తుంది. అక్కడ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఖాన్ స్కెచ్ వేస్తాడు. తన తల్లి కదలికలను పోలీస్ వారికి అందిస్తున్నది ధృవ్ అనే విషయం 'అరూ' (ఆరుషి)కి తెలుస్తుంది. తాను పోలీస్ ఇన్ఫార్మర్ అనే విషయాన్ని ధృవ్ అంగీకరిస్తాడు. ఆర్య ప్రమాదంలో ఉన్నట్టుగా 'అరూ'తో చెబుతాడు. దాంతో ఖాన్ ఉచ్చులో నుంచి తన తల్లి తప్పించుకోవడానికి 'అరూ' హెల్ప్ చేస్తుంది. 

ధృవ్ కారణంగానే తన సరుకు పట్టుబడిందని తెలుసుకున్న ఆర్య తీవ్రమైన అసహనానికి లోనవుతుంది. తన సరుకు ఎక్కడ ఉందనేది అతని ద్వారానే తెలుసుకుంటుంది. ధృవ్ - 'అరూ' ప్రేమించుకుంటున్నారనే విషయం ఆ సమయంలోనే ఆమెకి తెలుస్తుంది. అందువలన ధృవ్ జోలికి వెళ్లొద్దని దౌలత్ తోను .. సంపత్ తోను చెబుతుంది. కానీ ఆర్య లేని సమయం చూసి సంపత్ అతణ్ణి  షూట్ చేస్తాడు. రూప్  చనిపోవడానికి కూడా తన తల్లే కారణమనే సంగతి ఆ సమయంలోనే వీరూ (వీరేన్)కి తెలుస్తుంది. 

తన తల్లి కారణంగానే 'రూప్' తనకి దూరమైందని భావించిన వీర్ కి మనసు విరిగిపోతుంది. తాను ధృవ్ ను ప్రేమించడం ఇష్టం లేకపోవడం వల్లనే అతనిపై ఆమె కాల్పులు జరిపించిందని 'అరూ' భావిస్తుంది. తన తల్లి తిరిగి దౌలత్ ను చేరదీయడం నచ్చని ఆదిత్య ఆమెపై కోపంతో ఉంటాడు.  తల్లి ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆమెను వదిలి అమ్మమ్మను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోతారు. ఏ పిల్లల కోసమైతే ఇంతా చేస్తూ వచ్చిందో, ఆ పిల్లలే తనని వదిలేసి వెళ్లడాన్ని ఆర్య జీర్ణించుకోలేకపోతోంది. 

అలాంటి పరిస్థితుల్లో ఆర్య ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది? ఆమె నుంచి సరుకు స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో నళిని సాహెబా - అభిమన్యు ఏం చేస్తారు? సూరజ్ - నందిని శవాలు దొరకడంతో పోలీస్ ఆఫీసర్ ఖాన్ ఏం చేస్తాడు? తల్లిని అపార్థం చేసుకుని ఇల్లొదిలి వెళ్లిపోయిన ముగ్గురు పిల్లలు ఎలాంటి ప్రమాదంలో పడతారు? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది. 

'ఆర్య' నిజంగా భారీ సిరీస్. అత్యధిక సంఖ్యలో ఈ సిరీస్ లో పాత్రలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైన పాత్రలను రిజిస్టర్ చేయడం వల్లనే, సిరీస్ కీ .. సిరీస్ మధ్య గ్యాప్ వచ్చినప్పటికీ ఆడియన్స్ కి ఆ పాత్రలు గుర్తుండిపోయాయి. కథ చాలా విస్తృతమైనది .. పాత్రలను డిజైన్ చేసిన తీరు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఏ పాత్రను ఎక్కడ ఎత్తుకోవాలో .. ఏ పాత్రకు ఎక్కడ ముగింపు ఇవ్వాలో ఇచ్చుకుంటూ వచ్చారు.  బలమైన స్క్రీన్ ప్లే ఈ సిరీస్ ను అలా నిలబెట్టేస్తూ వచ్చింది. 

ఈ సిరీస్ కోసం భారీ లొకేషన్స్ ను ఎంపిక చేసుకున్నారు. పాత్రల స్థాయికి తగిన రీతిలో రిచ్ నెస్ కనిపించేలా చూసుకున్నారు. డైలాగ్స్ కూడా అతికించినట్టుగా కాకుండా సహజంగా ఉండటం వలన, అనువాదం అనే ఆలోచన రాదు. సుస్మితా సేన్ నటన ఈ సిరీస్ లో ప్రధానమైన ఆకర్షణ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. ఎడిటింగ్ నీట్ గా ఉండటం వలన, కథలో ఎవరికీ ఎక్కడా కన్ఫ్యూజన్ అనేది కనిపించదు. 

ప్రయాణించే మార్గం సరైనది కానప్పుడు గమ్యానికి చేరుకునేసరికి మిగిలేవి కష్టాలు .. కన్నీళ్లే. సరైన మార్గంలో వెళ్లకుండా చేసే త్యాగాలకు అర్థం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో దోషిగా నిలబడిపోవవలసి వస్తుంది. అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చిన కథ ఇది. మూడు సీజన్లను ఒకేసారి చూసినా బోర్ కొట్టకుండా ఈ సిరీస్ ను ఆవిష్కరించిన తీరు మార్కులు కొట్టేస్తుంది. అత్యంత ఆసక్తికరంగా నడిచిన భారీ సిరీస్ ల జాబితాలో, ఈ సిరీస్ కి కూడా స్థానం దొరుకుతుంది. 

Trailer

More Reviews