'వధువు' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

Vadhuvu

Movie Name: Vadhuvu

Release Date: 2023-12-08
Cast: Avika Gor, Nandu, Ali Reza. Rupa Lakshmi
Director:Poluri Krishna
Producer: Srikanth Mohta - Mahendra Soni
Music: Sriram Maddury
Banner: Shree Venkatesh Films
Rating: 2.75 out of 5
  • 'వధువు'గా మెప్పించిన అవికా గోర్ 
  • 7 ఎపిసోడ్స్ గా వచ్చిన సీజన్ వన్
  • బెంగాలి సిరీస్ కి ఇది రీమేక్ 
  • అదే తరహాలో సాగిన రీమేక్ 
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్

అవికా గోర్ అనే పేరు వినగానే .. చిన్నతనంలో ఆమె చేసిన 'బాలికా వధూ' సీరియల్ గుర్తుకువస్తుంది. ఆయా సీరియల్ కి తెలుగు అనువాదంగా వచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' కూడా విశేషమైన ఆదరణను అందుకుంది. మళ్లీ ఇంతకాలానికి అవికా నుంచి 'వధువు' వెబ్ సిరీస్ అంటూ ... టైటిల్ ను లుక్ వదలడంతో, ఒక్కసారిగా అందరిలో ఆసక్తి తలెత్తింది. ఈ నెల 8వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. 7 ఎపిసోడ్స్ గా వదిలిన ఈ కథ ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.

ఇందు ( అవికా గోర్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. తల్లి .. తండ్రి ... ఒక చెల్లి .. ఇది ఆమె కుటుంబం. ఇందుకి పెళ్లి సంబంధాలు వస్తుంటాయిగానీ .. ఒక కారణంగా అవి తప్పిపోతూ ఉంటాయి. ఆ ఒక్క కారణం ఆమె చెల్లెలు భాను. చిన్నప్పటి నుంచి కూడా అక్క ఇందు అంటే భానుకి అసూయ .. ఈర్ష్య .. ద్వేషం ఉంటాయి. అందువల్లనే ఇందు వివాహం చేసుకోవాలనుకున్న యువకుడితో భాను వెళ్లిపోతుంది. 

అలా భాను చేసిన ఆ పని కారణంగా ఆ పెళ్లి ఆగిపోవడమే కాదు, ఆ తరువాత ఇందుకి వచ్చిన సంబంధాలు తప్పిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే శ్రీమంతుల కుటుంబానికి చెందిన ఆనంద్ తో ఆమెకి పెళ్లి కుదురుతుంది. భ్రమరాంబ పెద్ద కొడుకు ఆనంద్ ( నందూ) చిన్న కొడుకు ఆర్య (అలీ రెజా). కూతురు స్నేహతో పాటు అల్లుడు కూడా అదే బంగ్లాలో ఉంటూ ఉంటారు. ఒక శుభ ముహూర్తాన ఆనంద్ తో ఇందు పెళ్లి జరిగిపోతుంది. 

అత్తగారింట్లో అడుగుపెడుతూనే ఆమె కాస్త తేడా మనిషి అనే విషయాన్ని ఇందూ గ్రహిస్తుంది. తన మాటనే నెగ్గాలి అనే పట్టుదలను ఆమెలో చూస్తుంది. ఇక తన భర్త ఆనంద్ కి కోపం ఎక్కువనే విషయం అర్థమవుతుంది. ఆ ఇంట్లో మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఉన్న పద్మ, పదే పదే తనని హెచ్చరిస్తూ ఉండటం ఇందుని ఆలోచింపజేస్తుంది. తన మరిది ఆర్య కి వైష్ణవి అనే యువతితో వివాహం జరిగిందనే విషయాన్ని తన దగ్గర ఎందుకు దాచారనేది ఆమెకి అర్థం కాదు. 

అత్తగారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి, తన కాపురాన్ని కూలదోయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని ఇందు గ్రహిస్తుంది. ఇది తన చెల్లెలు భాను పనే అయ్యుంటుందని అనుకుంటుంది. అన్నా వదినల మధ్య మనస్పర్థలు తెలెత్తడానికి తన భార్య వైష్ణవి కారణం కావొచ్చని ఆర్య భావిస్తాడు. చెల్లెలు భర్త సంజయ్ తో .. తన తమ్ముడు ఆర్యతో కూడా ఇందుకి సంబంధం ఉందని ఆనంద్ అనుమానిస్తాడు. 

'ఇందు'కి అత్తగారింట్లో ఎదురయ్యే పరిస్థితులు ఎలాంటివి? ఆమె కాపురంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నవారెవరు? పద్మ ఎందుకు పిచ్చిదైపోయింది?  ఆర్యతో వైష్ణవికి ఉన్న గొడవేంటి? .. అందుకు కారకులు ఎవరు? పరువు ప్రతిష్ఠల పేరుతో భ్రమరాంబిక ఇంట్లో జరుగుతున్న నాటకాలకు ఇందు ఎలా తెరదించుతుంది? అనే ఆసక్తికరమైన సంఘటనలతో ఈ కథ ముందుకు వెళుతుంది.

ఇది బెంగాలీ సిరీస్ 'ఇందు'కి రీమేక్. అందువల్లనే కథాకథనాలు నడిచే తీరులో బెంగాలీ తరహా ఛాయలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పోలూరి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, మొదటి ఎపిసోడ్ కాస్త పేలవంగానే కనిపిస్తుంది. నటీనటుల నటన నుంచి .. సంభాషణల వరకూ కృతకంగానే అనిపిస్తుంది. ఆ తరువాత ఎపిసోడ్ నుంచి కథ కాస్త నెమ్మదిగా కుదురుకుంటుంది. ఐదో ఎపిసోడ్ నుంచి మరికాస్త పుంజుకుంటుంది.

దర్శకుడు సీజన్ 1 తో కథను పూర్తి చేసే ఆలోచనలో లేడు. అలాంటప్పుడు కథ ఎలా నడవాలో అలాగే ముందుకు వెళుతూ ఉంటుంది. కథ .. స్క్రీన్ ప్లే బలాన్ని కూడా కలుపుకుని సాగుతూ ఉంటుంది. అవికా గోర్ నే ఎందుకు ఈ పాత్ర కోసం తీసుకోవాలి? అంటే, పెళ్లి కూతురుగా గతంలో ఆమె సీరియల్ .. ఆమెకి వచ్చిన క్రేజ్ కారణమని చెప్పుకోవాలి. తన వయసుకి తగిన పాత్రలో ఆమె మెప్పించింది. కథా పరంగా ఒక వైపున అవికాను నిలబెడితే, మరో వైపున నందూ - అలీ రెజా - అవికా అత్తగారు పాత్రలు సమంగా తూగాలి. కానీ ఆ పాత్రలకి వాళ్ల వెయిట్ చాలలేదు. 

ఇక అవికా గోర్ అత్తగారి పాత్రను .. ఆమె అల్లుడి పాత్రను మరింత ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకనో దర్శకుడు ఆ పాత్రలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో సస్పెన్స్ టచ్ .. మరికొన్ని సందర్భాల్లో హారర్ టచ్ ... ఇంకొన్ని సందర్భాల్లో థ్రిల్లర్ టచ్ ఇస్తూ, జోనర్ విషయంలో దర్శకుడు కాస్త అయోమయాన్ని కలిగించాడనే చెప్పాలి. అయితే     

         
 నిర్మాణ విలువలు బాగున్నాయి. రామ్ కె మహేశ్ ఫొటోగ్రఫీ .. శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం ..  అనిల్ కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి. సీజన్ వన్ లోని ఏడు ఎపిసోడ్స్ లో మొదటి ఎపిసోడ్ మాత్రమే కాస్త వీక్ గా ఉంటుంది. మిగతావి ఫరవాలేదు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే, ఈ సీజన్ తో దీనిని ముగించలేదు గనుక, నెక్స్ట్ సీజన్ పై కాస్త ఆసక్తిని కలిగిస్తూ వదిలేశారు. అవికా గోర్ కి యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది గనుక, ఆ వర్గాల వారికి నచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. అవికా గోర్ నటన

మైనస్ పాయింట్స్: బలహీనమైన ఫస్టు ఎపిసోడ్ .. కొన్ని పాత్రలకి సెట్ కాని ఆర్టిస్టులు .. మరికొన్ని పాత్రలను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయకపోవడం .. 

Trailer

More Reviews