'ది రైల్వే మెన్' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ

Movie Name: The Railway Men
- భోపాల్ దుర్ఘటన నేపథ్యంలో 'ది రైల్వే మెన్'
- నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
- యథార్థ సంఘటనకు సహజమైన ఆవిష్కరణ
- అక్కడక్కడా కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్
- అదనపు బలంగా నిలిచిన నేపథ్యం సంగీతం .. ఫొటోగ్రఫీ
1984లో భోపాల్ దుర్ఘటన జరిగింది. అక్కడి 'యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ' నుంచి గ్యాస్ లీక్ కావడంతో 15000 మందికి పైగా మరణించారు. దేశ చరిత్రలో చోటుచేసుకున్న పెను ప్రమాదాలలో 'భోపాల్ గ్యాస్ లీకేజ్' ఒకటిగా నిలిచిపోయింది. ఆ రోజున రైల్వే కార్మికులు చేసిన సాహసం కారణంగా ప్రమాద తీవ్రత తగ్గిందని అంటారు. అలాంటి సంఘనటనను దృశ్య రూపంగా అందించే ప్రయత్నంలో భాగంగా 'ది రైల్వే మెన్' సిరీస్ ను రూపొందించారు. నిన్నటి నుంచి ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇఫ్తేకర్ సిద్ధికీ (కేకే మీనన్) భోపాల్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన కొడుకును కూడా రైల్వే లోనే జాబ్ చూసుకోమని చెబుతాడు. అయితే అందుకు అతను అయిష్టతను వ్యక్తం చేస్తాడు. సిద్ధికీకి అంకితభావంతో పనిచేసే ఆఫీసర్ గా .. మంచి మనసున్న వ్యక్తిగా పేరు ఉంటుంది. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా .. ఆపద వచ్చినా ఆదుకోవడంలో అతను ముందుంటాడు.
భోపాల్ లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఒకటి నడుస్తూ ఉంటుంది. విదేశానికి చెందిన ఈ సంస్థ బాధ్యతలను మ్యాడ్సన్ నిర్వహిస్తూ ఉంటాడు. విదేశానికి చెందిన అలెక్స్ బ్రౌన్ అనే సైంటిస్ట్ ఈ లిక్విడ్ చాలా ప్రమాదకరమైనదనీ, జనవాసాల మధ్య ఆ ఫ్యాక్టరీ ఉండకూడదని ముందుగానే చెబుతాడు. అయితే సంస్థ నిర్వాహకులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అలాంటి ఫ్యాక్టరీలో 'కమ్రుద్దీన్' అనే సిన్సియర్ వర్కర్ పనిచేస్తూ ఉంటాడు.
ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని విభాగాలకు మరమ్మత్తులు అవసరమని కమ్రుద్దీన్ చెప్పినప్పటికీ మ్యాడ్సన్ పట్టించుకోడు. అతను లేని సమయంలో అనుభవంలేని కుర్రాళ్లు తీసుకున్న నిర్ణయం మూలంగా ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడం మొదలవుతుంది. గతంలో ఈ ఫ్యాక్టరీలో పనిచేసే 'ఇమద్' (బాబిల్ ఖాన్) అనే యువకుడికి ఫ్యాక్టరీ పరిస్థితిపై అవగాహన ఉంటుంది. అతని ద్వారా విషయం తెలుసుకున్న రిపోర్టర్ (సన్నీ హిందూజ), రెండేళ్ల క్రితం టైసన్ ఇచ్చిన రిపోర్ట్ ను సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే ఒక రోజు రాత్రి ఆ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. జనాలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ ఎక్కడివారు అక్కడ కుప్పకూలి పోతుంటారు. ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాదు. భోపాల్ రైల్వేస్టేషన్ లోని జనాలను కాపాడటానికి స్టేషన్ మాస్టర్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో సెంట్రల్ రైల్వేకి జనరల్ మేనేజర్ గా ఉన్న రతిపాండే (మాధవన్), తనిఖీలో భాగంగా 'ఇటార్సీ' రైల్వే స్టేషన్ కి వెళతాడు.
భోపాల్ రైల్వే స్టేషన్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదని తెలిసి రంగంలోకి దిగుతాడు. అక్కడ గ్యాస్ లీక్ అయిందని తెలుసుకుంటాడు. భోపాల్ జంక్షన్ కి మరి కాసేపట్లో 'గోరఖ్ పూర్ - ముంబై రైల్ చేరుకోనుందని తెలిసి, వెంటనే దానిని ఆపడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. ఇందిరాగాంధీ హత్య కారణంగా, అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న సిక్కు యువతి (మందిరా బేడీ)పై దాడి జరుగుతుండటంతో అందుకు రైల్వే గార్డు అడ్డుపడతాడు.
ఇక గూడ్స్ నడుపుతున్న ఇమద్, గ్యాస్ లీకేజ్ ను గ్రహించి తనవాళ్లను కాపడుకోవడం కోసం ధైర్యం చేస్తాడు. తన ప్రాణాలకు తెగించి ఫ్యాక్టరీ అంతవరకూ కప్పిపుచ్చుతూ వచ్చిన వాస్తవాలను బయటపెట్టడానికి రిపోర్టర్ తన అన్వేషణ కొనసాగిస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాల్లో వాళ్లందరూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నారనేది మిగతా కథ.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి అప్పటివారికి చాలామందికి తెలుసు. ఈ జనరేషన్ వారికి అప్పుడు జరిగిన ఆ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చెప్పడంలో దర్శకుడు శివ్ రావైల్ సక్సెస్ అయ్యాడు. ఈ మొత్తం సంఘటనలో సెంట్రల్ రైల్వే మేనేజర్ .. స్టేషన్ మాస్టర్ .. రైల్వే గార్డు .. ఫ్యాక్టరీలో పనిచేసే కమ్రుద్దీన్ .. ఇమద్ .. రిపోర్టర్ .. విజయ అనే ఒక సాధారణ మహిళ పాత్రలు ప్రధానంగా కనిపిస్తూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.
ఒక వైపున గ్యాస్ లీక్ అవుతుంటే .. మరో వైపున తన కూతురు పెళ్లి కోసం తాపత్రయపడే మహిళగా విజయ్ ట్రాక్ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఫ్లాట్ ఫామ్ పై అడుక్కునే పదేళ్ల వయసున్న ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు చనిపోవడం మనసును భారం చేస్తుంది. ఇతర ప్రధానమైన పాత్రలన్నీ స్ఫూర్తిని కలిగిస్తాయి. గ్యాస్ లీకేజీకి కొన్ని రోజుల ముందు .. కొంత సేపటి ముందు అని సీజీ వేస్తూ వెళ్లడం, ఆపదలో ఉన్నవారి ట్రైన్ .. వాళ్లను కాపాడటానికి నిర్ణయించబడిన ట్రైన్ ఒకే లైన్లో బయల్దేరడం టెన్షన్ పెట్టేస్తుంది.
ఇక ఈ సిరీస్ లో ఇబ్బంది పెట్టే సీన్ అన్సారీ పోస్టు మార్టం సీన్. పోస్టు మార్టం జరిగే తీరును క్లోజప్ షాట్స్ లో స్క్రీన్ పై ఎక్కువ సేపు చూపించడం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. నిజానికి అంతలా చూపించవలసిన అవసరం లేదు కూడా. అంతకు మించి అనవసరమైన సీన్స్ ఏమీ కనిపించవు. ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆ పాత్రలను రిజిస్టర్ చేస్తూ నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి.
కథాకథనాలకు సామ్ స్లాటర్ అందించిన నేపథ్య సంగీతం .. రూబైస్ కెమెరా పనితనం అదనపు బలంగా నిలిచాయి. యశ జైదేవ్ ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలకు వంకబెట్టనవసరమే లేదు. ఈ సంఘటన పబ్లిక్ కి సంబంధించినది .. అందువలన విపరీతమైన జనాలను చూపించవలసి ఉంటుంది. ఈ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షులం మనమే అన్నంత సహజంగా ఈ సిరీస్ ను ఆవిష్కరించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మనసుకు హత్తుకునే సిరీస్ లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. సహజత్వం .. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు .. ఎమోషన్స్ .. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ : అన్సారీ పోస్టుమార్టం సీన్