మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఎక్కువ సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న ఈ తరహా సినిమాలను వాళ్లు ఎక్కువగా లైక్ చేస్తారు. అలాంటి జోనర్లో వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ గా 'కన్నూర్ స్క్వాడ్' కనిపిస్తుంది. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 28వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చి హిట్ టాక్ ను సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా, నిన్నటి నుంచి హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా హిట్ కావడానికి గల కారణాలేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కేరళ రాష్ట్రంలోని 'కన్నూర్' జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించడానికిగాను గతంలో అక్కడ పనిచేసిన ఒక ఎస్పీ, 'కన్నూర్ స్క్వాడ్' పేరుతో నలుగురు సభ్యులు గల బృందంతో ఒక స్క్వాడ్ ను ఏర్పాటు చేస్తాడు. ఆ స్క్వాడ్ కి జార్జ్ (మమ్ముట్టి) టీమ్ లీడర్ గా ఉంటాడు. 2015లో జరిగిన 'మురుగన్' అనే వ్యక్తి హత్య కేసును జార్జ్ టీమ్ చాలా తెలివిగా ఛేదిస్తుంది. ఎన్నో మలుపులు తిరిగిన ఆ హత్య కేసును ఛేదించిన విషయంలో కన్నూర్ స్క్వాడ్ కి అభినందనలు దక్కుతాయి.
2017లో 'కాసర్ గడ్'లోని ఒక రాజకీయనాయకుడు అబ్దుల్ వాహెబ్ హత్య జరుగుతుంది. ఆయన కూతురు తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో ఉంటుంది. ఈ కేసును 10 రోజుల్లోగా ఛేదించి హంతకులను పట్టుకోవాలని, అక్కడి ఎస్పీ చోళన్ (కన్నడ కిశోర్)పై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఆయన ఈ కేసును 'కన్నూర్ స్క్వాడ్'కి అప్పగిస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే ఈ టీమ్ కి చెందిన జయన్ (రోని డేవిడ్ రాజ్) లంచం తీసుకుంటూ కెమెరాకి చిక్కుతాడు. దాంతో టీమ్ పై .. అతని కుటుంబంపై మచ్చ పడుతుంది.
అబ్దుల్ వాహెబ్ మర్డర్ కి సంబంధించిన ఆపరేషన్ నుంచి జయన్ ను తొలగించమని పైఅధికారులు జార్జ్ పై ఒత్తిడి తీసుకుని వస్తారు. ఇంతవరకూ తామంతా కలిసే అన్ని ఆపరేషన్స్ సక్సెస్ చేస్తూ వచ్చామనీ, ఈ ఆపరేషన్ కి అతనిని కూడా అనుమతించమని కోరుతూ జయన్ బాధ్యతను జార్జ్ తీసుకుంటాడు. అంతా కలిసి 'కాసర్ గడ్' చేరుకుంటారు. అబ్దుల్ వాహెబ్ హత్య జరిగిన తీరును గురించి తెలుసుకుంటారు. ఈ కేసు విషయంలో అబ్దుల్ వాహెబ్ బంధువైన రియాజ్ ను వాళ్లు అనుమానిస్తారు.
పక్కా ప్లాన్ తో రియాజ్ ను పట్టుకుంటారు. అబ్దుల్ వాహెబ్ దగ్గరున్న డబ్బు కాజేయడానికి తాను ప్లాన్ చేశాననీ, ఆ ప్లాన్ ను అమీర్ (అర్జున్ రాధాకృష్ణన్) జూఫికర్ (ధృవన్) ఆచరణలో పెట్టారని రియాజ్ చెబుతాడు. అబ్దుల్ వాహెబ్ ను వారు హత్య చేస్తారని తాను కూడా ఊహించలేదని అంటాడు. దాంతో అమీర్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి కన్నూర్ స్క్వాడ్ బయల్దేరుతుంది. ఈ ఆపరేషన్ లో వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? గడువులోగా హంతకులను ఈ టీమ్ పట్టుకోగలిగిందా? .. లేదా? అనేది మిగతా కథ.
కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా మహ్మద్ షఫీ ఈ కథను సినిమాకి తగినట్టుగా రాశాడు. ఈ కథకి రోబీ వర్గీస్ రాజ్ దృశ్య రూపాన్ని ఇచ్చాడు. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ. హీరోయిన్ కనిపించదు ... కామెడీ అనేది వినిపించదు. కథ సీరియస్ గానే మొదలై .. అంతే సీరియస్ గా ముగుస్తుంది. ఒక పోలీస్ ఆపరేషన్ ఎలా ఉంటుందో అంతే సహజంగా ఉంటుంది. ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాల్లో మమ్ముట్టి ఎంత బాగా చేస్తారనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.
ఉత్కంఠభరితమైన సన్నివేశంతో దర్శకుడు ఈ కథను మొదలుపెట్టాడు. దర్శకుడు ముందుగా ఒక కేసును తీసుకుని ఆ కేసును కన్నూర్ స్క్వాడ్ ఎంత తెలివిగా పరిష్కరించిందో చూపించి, ఆ తరువాత అసలు కేసులోకి ఆ టీమ్ ను ఎంటర్ చేసిన తీరు బాగుంది. 10 రోజుల గడువుపెట్టి .. డే 1 .. డే 2 అంటూ ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తూ వెళ్లిన విధానం మెప్పిస్తుంది. హంతకులకు సహకరించిన పవన్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి ఒక మారుమూల గ్రామానికి వెళ్లిన జార్జ్ టీమ్ పై, అక్కడి వాళ్లంతా తిరగబడతారు. ఈ సన్నివేశమే ఈ సినిమాకి హైలైట్.
హంతకులు ఎక్కడికక్కడ సిమ్ కార్డులు మారుస్తూ .. ఎప్పటికప్పుడు ఒక ప్రాంతం నుంచి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోతుంటారు. ఆ సమాచారాన్ని సేకరిస్తూ జార్జ్ టీమ్ వాళ్లను ఫాలో కావడం ఆడియన్స్ లో కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఒక వైపున పై అధికారులకు సమాధానం చెప్పుకుంటూ .. మరో వైపున తన టీమ్ లో స్ఫూర్తిని నింపుతూ మమ్ముట్టి చేసిన యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాలి.
దర్శకుడు ఏదైతే కథను చెప్పాలనుకున్నాడో .. తెరపై దానిని పెర్ఫెక్ట్ గా ఆవిష్కరిస్తూ వెళ్లాడు. స్క్రీన్ ప్లే ఈ కథకి మరింత బలాన్ని ఇచ్చింది. సుశీన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథలో నుంచి బయటికి రాకుండా ఆడియన్స్ ను అలా ట్రావెల్ చేయిస్తుంది. ఇక మహ్మద్ రాహిల్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించిన సీన్స్ .. ఫారెస్టు నేపథ్యంలో సీన్స్ ను చిత్రీకరించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ వర్క్ కూడా ఓకే.
ఈ కథ పోలీసులకు .. నేరస్థులకు మధ్య జరుగుతుంది. క్రైమ్ .. దాని ఇన్వెస్టిగేషన్ తో ఈ కథ నడుస్తుంది. ఇలాంటి కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి కదా అనిపించవచ్చు. కానీ ట్రీట్మెంట్ పరంగా ఈ కథ ఆసక్తిని పెంచుతూ ఆకట్టుకుంటుంది. ఎక్కడ ఓవర్ బిల్డప్ లు .. భారీ డైలాగులు ఉండవు. సహజత్వానికి దగ్గరగా వెళుతుంది. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ఈ కథకి మరింత బలాన్ని ఇచ్చాయి. ఇది ఈ మధ్య కాలంలో పెర్ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. లొకేషన్స్ .. నేపథ్య సంగీతం .. కెమెరా పనితనం .. పెర్ఫెక్ట్ కంటెంట్.
'కన్నూర్ స్క్వాడ్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ
Kannur Squad Review
- మమ్ముట్టి హీరోగా రూపొందిన 'కన్నూర్ స్క్వాడ్'
- సెప్టెంబర్ 28న థియేటర్లకు వచ్చిన సినిమా
- నిన్నటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
- ఆసక్తికరమైన కథాకథనాలు
- ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. లొకేషన్స్ హైలైట్
Movie Details
Movie Name: Kannur Squad
Release Date: 2023-11-17
Cast: Mammootty,Rony David Raj, Azees Nedumangad, Shabareesh Varma, Kishore, Dhruvan
Director: Roby Varghese Raj
Music: Sushin Shyam
Banner: Mammootty Kampany
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer