'కాలాపాని' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ
Kaala Paani Review
- నెట్ ఫ్లిక్స్ లో 'కాలాపాని' సిరీస్
- ఈ నెల 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథాకథనాలు
- ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. లొకేషన్స్ హైలైట్
- ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ సిరీస్
గతంలో 'కాలాపాని' పేరుతో ప్రియదర్శన్ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది. అండమాన్ - నికోబార్ దీవులు .. అక్కడి 'సెల్యూలార్ జైలు' నేపథ్యంలో ఆ కథ నడుస్తుంది. అదే ప్రాంతంలోని నీరు ఎలా విషపూరితమైంది .. అది ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అనే కథాంశంతో అదే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ నిర్మితమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా వదిలిన 7 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 2027లో జరుగుతూ ఉంటుంది. అండమాన్ - నికోబార్ ప్రాంతంలోని ఒక హాస్పిటల్లో డాక్టర్ సౌదామిని ( మోనా సింగ్) పనిచేస్తూ ఉంటుంది. ఒక చిత్రమైన వ్యాధితో బాధపడుతూ 11 మంది పేషంట్స్ ఆమె హాస్పిటల్లో చేరతారు. జ్వరం .. దగ్గు .. మెడపై నల్లని మచ్చలు రావడం ... పేషంట్ కోలుకున్నట్టుగా అనిపించి .. ఆ వెంటనే తిరగబెట్టడం .. రక్తపు వాంతులతో చనిపోవడం ఆ వ్యాధి లక్షణాలు. అయితే ఈ వ్యాధి ఒక రకమైన వైరస్ వలన వస్తుందని ఆమె భావిస్తుంది. ఆ వైరస్ మూలాలు ఎక్కడివి? అనే విషయంపై ఆమె పరిశోధన చేస్తుంటుంది.
1989లోనే ఈ రకమైన వైరస్ కారణంగా చాలామంది చనిపోయారనే విషయం ఆమె పరిశోధనలో తెలుస్తుంది. ఈ విషయంలో ఆమెకి సహాయంగా ఉండటానికి గాను 'రీతూ గాగ్ర' (రాధిక మెహరోత్ర ) కొత్తగా చేరుతుంది. ఇద్దరూ కూడా డాక్టర్ శశి మహాజన్ తో చర్చిస్తూ ముందుకు వెళుతుంటారు. ఒక ప్రదేశానికి సంబంధించిన వారిలోనే ఈ వైరస్ ఎందుకు కనిపిస్తుందనే ఆలోచన రావడంతో, అక్కడికి వెళుతుంది సౌదామిని. ఆ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అప్పుడు ఆమెకి అర్థమవుతుంది.
'జస్కిన్స్ లేక్' ద్వారా ఆ వైరస్ సోకుతుందనీ, ఆ తరువాత ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుందని ఆమె తెలుసుకుంటుంది. కానీ ఆ ప్రదేశంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం వలన ఆమె మరణిస్తుంది. ఈ సంఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఆ సమయంలో 'అండమాన్' ప్రాంతంలో రానున్న న్యూ ఇయర్ సందర్భంగా 'టూరిస్ట్ ఫెస్టివల్'కి ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ ఫెస్టివల్ వలన వైరస్ చాలా ఫాస్టుగా వ్యాపించే ఛాన్స్ ఉందని భావించిన లెఫ్టినెంట్ గవర్నర్, అన్ని రవాణా మార్గాలను మూసేయమని ఆదేశిస్తాడు.
ఆ సమయానికి సంతోష్ ( వికాస్ కుమార్) దంపతులు తమ ఇద్దరు పిల్లలను తీసుకుని అండమాన్ చేరుకుంటారు. చిరంజీవి (సుకాంత్ గోయెల్) అనే ఒక క్యాబ్ డ్రైవర్ వారికి అక్కడి ప్రదేశాలు చూపిస్తూ ఉంటాడు. పిల్లలు మారాం చేయడంతో తెలిసినవారికి వాళ్లను అప్పగించి, సంతోష్ దంపతులు వేరే ప్రదేశానికి వెళతారు. అలాగే జ్యోత్స్నా (ఆరుషి) అనే యువతి కూడా తన లవర్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ చిక్కుబడుతుంది. అక్కడ టూరిస్ట్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసిన 'షా' దంపతులు కూడా బయటికి వెళ్లలేని పరిస్థితి వస్తుంది. లాక్ డౌన్ విధించడంతో ఎక్కడివాళ్లు అక్కడ చిక్కుబడిపోతారు.
డాక్టర్ సౌదామిని పాత ఫైల్స్ ను పరిశీలించిన రీతూ గాగ్ర, ఆ వైరస్ కి ఒక మూలిక పనిచేస్తుందని తెలుసుకుంటుంది. ఆ మూలికలు 'ఒరకా' తెగకి చెందిన గిరిజన ప్రాంతంలో ఉన్నాయని భావిస్తుంది. 'ఒరాకా' తెగవారికి వైరస్ సోకకపోవడానికి ఆ మూలికనే కారణమని గ్రహిస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? తన పిల్లలను చేరుకోవడానికి సంతోష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? జ్యోత్స తన లవర్ ను కలుసుకోగలిగిందా? డాక్టర్ రీతూ గాగ్ర ఆయా వైరస్ కి సంబంధించిన మూలికను సంపాదించగలిగిందా? అనేవి ఈ కథలోని ఆసక్తికరమైన అంశాలు.
ఈ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ నిడివి ఒక గంటకు పైనే ఉంటుంది. ఒక వైపున అండమాన్ - నికోబార్ ప్రజలు .. మరో వైపున అక్కడికి వచ్చే టూరిస్టులు .. ఆ పక్కనే భయంకరమైన అడవులు .. అక్కడ నివసించే 'ఒరాకా' తెగకి చెందిన గిరిజనులు. చాలా వేగంగా సోకుతున్న వైరస్ .. ఏమీ చేయలేని స్థితిలో ప్రభుత్వం .. హెల్త్ కేర్ సెంటర్లలో టెన్షన్ వాతావరణం .. తమవారి దగ్గరికి చేరుకునే మార్గం లేక అవస్థలుపడే కుటుంబ సభ్యులు .. ఇలా ఒక ఒక విషాదకరమైన కథను అత్యంత సహజంగా ఆవిష్కరించడంలో సమీర్ సక్సేనా సక్సెస్ అయ్యాడు.
ఈ కథ చాలా సాధారణంగా మొదలవుతుంది .. ఆ తరువాత అంతే సాధారణంగా కొన్ని పాత్రలు పరిచయమవుతాయి. ఆ తరువాత ఆ కథ ఎలా చిక్కబడుతూ వెళుతుంది .. ఆ పాత్రలు బలపడుతూ ఎలా ప్రధానమైన పాత్రలుగా మారతాయి అనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి యజమాని అయిన సంతోష్ .. ఆ ఫ్యామిలీకి ఆ పరిసరాలను చూపించే క్యాబ్ డ్రైవర్ చిరంజీవి .. లవర్ కోసం వెయిట్ చేసే జ్యోత్స్న .. ఒక డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరిన రీతూ గాగ్ర .. స్వార్థపరుడైన పోలీస్ ఆఫీసర్ గా కామత్ పాత్రలను డిజైన్ చేసిన తీరు మనలను ఆశ్చర్య పరుస్తుంది.
ఈ కథను స్క్రీన్ పై చూస్తున్నట్టుగా కాకుండా .. కథలో మనం కూడా భాగమయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథలో ఎమోషన్స్ వైపు నుంచి సంతోష్ ఫ్యామిలీ కన్నీళ్లు తెప్పిస్తుంది. డబ్బే లోకంగా బ్రతికిన చిరంజీవి పాత్ర కళ్లు తెరిపిస్తుంది. జ్యోత్స పాత్రను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. రీతూను చూస్తే అలా నిజాయితీగా .. ధైర్యంగా నిలబడాలనిపిస్తుంది. ప్రతి పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన తీరు .. ఆ పాత్రలను ఆడియన్స్ కి కనెక్ట్ చేయబడిన విధానం గొప్పగా అనిపిస్తాయి.
ఒక సిరీస్ కు ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది .. ఆ పరిధిలోనే వారు క్రౌడ్ ను సెట్ చేసుకుంటారు. కానీ ఈ సిరీస్ లో కనిపించే క్రౌడ్ చూస్తే విస్మయానికి లోనవుతాము. వైరస్ వార్త వినగానే ఫెస్టివల్ జరిగే ప్లేస్ నుంచి జనాలు బయటికి తోసుకురావడం .. వేరే దీవికి వెళ్లడం కోసం వేలాదిమంది షిప్ లోకి తోసుకెళ్లడం వంటి సీన్స్ ను చాలా నేచురల్ గా తెరకెక్కించారు. ఇక 'ఒరాకా' ప్రజలు .. వాళ్ల జీవన విధానాన్ని ఆవిష్కరించిన తీరు కూడా మనసును కదిలిస్తుంది.
కథ .. కథనం .. కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ప్రధానమైన పాత్రలను పోషించినవారి నటన .. లొకేషన్స్ .. ఇలా ప్రతి అంశం హైలైట్ అనే చెప్పాలి. కథలో ఎక్కడా లూజ్ సీన్స్ ఉండవు .. చివర్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ దర్శకుడు మరింత టెన్షన్ పెట్టేస్తాడు. ఒక వైపున సముద్రం . మరో వైపున ఫారెస్ట్ .. ఈ మధ్యలో జనం. ఆ ప్రాంతంతో పరిచయంలేని టూరిస్టులు .. ఇంకో వైపున డాక్టర్లు .. పరిస్థితి అదుపుతప్పుతూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసే ప్రభుత్వ అధికారులు . ఇలా అన్ని వైపుల నుంచి ఎంతో సహజత్వంతో కట్టిపడేసే సిరీస్ ఇది .. కదిలించే సిరీస్ ఇది. ఈ సిరీస్ చూసిన ప్రతి ప్రేక్షకుడు .. అందులో ఒక పాత్ర కాకుండా ఉండలేడనేది నిజం.
Movie Details
Movie Name: Kaala Paani
Release Date: 2023-10-18
Cast: Mona Singh, Amey Wagh, Arushi Sharma, Vikas Kumar, Radhika Mehrotra,Sukant Goel
Director: Sameer Saxena
Music: Rachita Arora
Banner: Posham Pa Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer