'లియో' - మూవీ రివ్యూ

  • విజయ్ హీరోగా రూపొందిన 'లియో'
  • వంకబెట్టనవసరం లేని భారీతం
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ 
  • కనెక్ట్ కాని ఎమోషన్స్ .. ఎక్కువైపోయిన యాక్షన్
  • మైనస్ గా అనిపించే సంజయ్ దత్ ట్రాక్
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు విజయ్ కి కూడా ఇక్కడ ఫాలోయింగ్ పెరిగింది .. మార్కెట్ పెరిగింది. 'మాస్టర్' సినిమా దగ్గర నుంచి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తరువాత విజయ్ - లోకేశ్ కనగరాజ్ కలిసి మరోసారి చేసిన సినిమానే 'లియో'. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకుల ముందుకు సితార బ్యానర్ వారు తీసుకొచ్చారు. త్రిష కథానాయికగా ... ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందనేది చూద్దాం.

ఈ కథ హిమాచల్ ప్రదేశ్ లో మొదలవుతుంది. పార్తీబన్ (విజయ్) అక్కడ ఒక కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష)  టీనేజ్ కి వచ్చిన కొడుకు .. ఐదేళ్ల కూతురు .. ఇది అతని కుటుంబం. ప్రశాంతమైన జీవితాన్ని అతను గడుపుతూ ఉంటాడు. ఓ కలెక్టర్ ను హత్య చేసిన ఐదుగురు హంతకులు అక్కడి నుంచి తప్పించుకుంటారు. వాళ్లకి ఆ పనిని అప్పగించినవారు హ్యాండ్ ఇవ్వడంతో, ఎక్కడ తలదాచుకోవాలనేది వాళ్లకి అర్థం కాదు. ఆ సమయంలో వాళ్లలో ఎవరి దగ్గర కూడా డబ్బు ఉండదు. 

ఆ హంతకులు డబ్బు కోసం ఇద్దరిని హత్య చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది. అలాంటి సమయంలో వాళ్లు పార్తీబన్ కాఫీ షాప్ లోకి ఎంటరవుతారు. డబ్బు తీసుకుని అవతల పడదామని అనుకుంటారుగానీ, ఈ లోగా అక్కడ పని చేసే శృతి అనే యువతి పట్ల ఒకడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతనితో పాటు అతనికి సపోర్టుగా వచ్చిన మిగతా హంతకులంతా పార్తీబన్ తో తన్నులు తింటారు. అతని కూతురును గాయపరచడానికి ప్రయత్నించి, అతని చేతిలో చనిపోతారు. 

ఐదు హత్యలు చేసిన కేసులో పార్తీబన్ ను పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ వ్యక్తులకు సంబంధించినవారు విజయ్ పై పగబడతారు. ఈ కేసు విషయంలో విజయ్ పాప్యులర్ అవుతాడు. అతని ఫొటో ఆంటోని దాస్ (సంజయ్ దత్) కి చేరుతుంది. అతని తమ్ముడు హేరాల్డ్ (అర్జున్) కి కూడా ఈ సంగతి తెలుస్తుంది. వాళ్లిద్దరూ కూడా అక్రమ వ్యాపారాలు .. భయంకరమైన నేరచరిత్ర ఉన్నవారే. అలాంటి వాళ్లిద్దరూ కూడా, పార్తీబన్ ఫొటోను చూసి 'లియో' బ్రతికే ఉన్నాడని నిర్ణయించుకుంటారు.

'లియో' ఎవరో కాదు . ఆంటోని దాస్ సొంత కొడుకు. కొన్ని కారణాల వలన అతను చనిపోయాడని వాళ్లు అనుకుంటారు. అతను బ్రతికే ఉన్నాడని భావించి, తిరిగి తమతో వచ్చేయమని అడగాలనుకుంటారు. ఈ విషయంలో 'పార్తీబన్'ను కలుస్తారు. అయితే 'లియో' ఎవరో తనకి తెలియదనీ, 20 ఏళ్లుగా తాను అక్కడే ఉంటున్నానని అతను చెబుతాడు. వాళ్లను తానెప్పుడూ చూడలేదని అంటాడు. అయినా వాళ్లు ఎంతమాత్రం నమ్మకుండా అతణ్ణి వేధిస్తుంటారు. 

అయితే ఆంటోని దాస్ ధోరణి చూసిన 'సత్య'కి తన భర్త గత జీవితంపై అనుమానం వస్తుంది. దాంతో ఆయన గురించి రహస్యంగా తెలుసుకోవడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? పార్తీబన్ ఫ్యామిలీపై పగబట్టిన వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల కారణంగా ఆ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? అనేది అసలు కథ.

 లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రైటర్ కూడా ఆయనే. లోకేశ్ కనగరాజ్ అనగానే, ఇంతవరకూ ఆయన సినిమాలు చూస్తూ వచ్చినవారికి ఆయన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయించే తీరే ఆయన సినిమాలకు ప్రత్యేకతగా నిలుస్తూ ఉంటుంది. ఈ సినిమా విషయంలోను అదే అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నప్పటికీ, యాక్షన్ వాటిని డామినేట్ చేసిందనే  చెప్పాలి. 

ఒక మర్డర్ చేసిన హంతకులు తప్పించుకోవడం .. ఎక్కడా ఆశ్రయం దొరక్క వాళ్లు రోడ్ల వెంట తిరుగుతూ ఉండటం చూసి, హీరో ఇంట్లోకి ఎంటరవుతారేమోనని ఆడియన్స్ టెన్షన్ పడతారు. కానీ వాళ్లు ఆయన కాఫీ షాప్ లోకి వెళతారు .. ఆయన చేతిలో ప్రాణాలు కోల్పోతారు. ఆ రౌడీల తరఫు ఆడవాళ్లు, హీరోను చంపిన తరువాతనే తమవాళ్ల శవాలకు అంత్యక్రియలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తరువాత మార్కెట్లో హీరోపై ఎటాక్ జరిగేవరకూ పెరుగుతూ వెళ్లిన గ్రాఫ్, అక్కడి నుంచి తగ్గింది. 

ఓ పాతిక కార్లలో ... తన అనుచరులతో కలిసి తిరిగే విలన్, నువ్వే నా కొడుకువంటూ హీరో వెంటపడటం .. అతను కొడుకును తీసుకెళ్లాలని అనుకోవడం వెనక ఉన్న రీజన్ ఆడియన్స్ కి అంత కరెక్టుగా అనిపించకపోవడం వలన ఆ ట్రాక్ అంత బలంగా అనిపించదు. భారీ స్థాయిలో ఫైట్స్ ఉన్నాయి .. కానీ వాటి వెనుక బలమైన ఎమోషన్స్ లేకపోవడం వలన ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అప్పటి వరకూ ఇంట్రస్టింగ్ గా నడుస్తూ వచ్చిన కథ, సంజయ్ దత్ - అర్జున్ ఎంట్రీతో పక్కకి వెళ్లిపోయిందనిపిస్తుంది.

కథాకథనాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, కంటెంట్ ను ఆ మాత్రం నిలబెట్టింది అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. 'విక్రమ్' .. 'జైలర్' స్థాయిలోనే ఈ కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక ఆయన బాణీలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. 'నే రెడీనా' అనే పాట తెలుగులో సాహిత్యం పరంగా అసంతృప్తిని కలిగిస్తుంది. మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ బాగుంది. మంచు కొండలను తెరపై ఆయన అందంగా ఆవిష్కరించారు. 

 నిర్మాణ విలువల పరంగా ఈ సినిమాకి వంక బెట్టవలసిన పనిలేదు. తారాగణం పరంగా కూడా భారీతనాన్ని తెచ్చుకున్న సినిమా ఇది. యాక్షన్ సీన్స్ పరంగా ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా .. కెమెరా వర్క్ పరంగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే సంజయ్ దత్ కి సంబంధించిన ట్రాక్ ఏదైతే ఉందో .. అదే ఈ సినిమాకి ప్రధానం. కానీ దానినే సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు. ఆడియన్స్ ల్లో ఉత్కంఠను రేకెత్తించలేకపోయారు. ఈ ట్రాక్ ఈ సినిమాకి మైనస్ అయిందని చెప్పక తప్పదు. 

Movie Details

Movie Name: Leo

Release Date: 2023-10-19

Cast: Vijay, Trisha, Sanjay Dutt, Arjun,Gautham Vasudev Menon, Mansoor Ali Khan

Director: Lokesh Kanagaraj

Producer: S.S.Lalit Kumar - Jagadish Palanisamy

Music: Anirudh

Banner: Seven Screen Studio

Review By: Peddinti

Leo Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews