ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పాత్ర ప్రధానంగా సాగే వెబ్ సిరీస్ లు చేయడానికి వాళ్లంతా ఉత్సాహాన్నీ చూపుతున్నారు. అలా తొలిసారిగా హీరోయిన్ హన్సిక కూడా ఒక వెబ్ సిరీస్ చేసింది .. దాని పేరే ' MY 3'. ఈ నెల 15వ తేదీ నుంచి 'హాట్ స్టార్' లో 9 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. తమిళంలో నాయిక ప్రధానమైన పాత్రలు చేయడంలోను మంచి అనుభవం ఉన్న హన్సిక, ఈ వెబ్ సిరీస్ తో ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం.
ఈ కథ అంతా కూడా 'ఊటీ'లో జరుగుతుంది .. చంద్రశేఖర్ దంపతులు శ్రీమంతులు. వాళ్లకి అనేక వ్యాపారాలు ఉంటాయి .. వేలమంది ఉద్యోగులు వాళ్ల దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఒక వైపున ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోవడంలో ఆయన చాలా బిజీగా ఉంటూ ఉంటాడు. వాళ్ల ఒక్కగానొక్క సంతానమే ఆదిత్య (రావ్) ఆ దంపతులు ఆదిత్యను ఎంతో గారాబంగా చూసుకుంటూ ఉంటారు. ఒక రోజున వాళ్ల ముగ్గురూ కారులో వెళుతూ ఉండగా ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో ఆదిత్య తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగులుతాడు. ఆ సమయంలో అతనికి మనుషులపై నమ్మకం పోతుంది.
ఆ చిన్న వయసులో అతను ఎవరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఎవరైనా అతనిని టచ్ చేస్తే వెంటనే ఒళ్లంతా ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అతను బాధతో విలవిలలాడిపోతూ ఉంటాడు. డాక్టర్ మూర్తి సాయంతో ఆదిత్య పెద్దవాడవుతాడు. తన వ్యాపార వ్యవహారాలను స్వయంగా చూసుకునే స్థాయికి చేరుకుంటాడు. అయితే తన దగ్గరికి ఎవరూ రాకుండా .. తనని టచ్ చేయకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాడు. ఈ ఎలర్జీ కారణంగా ఆయన ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు.
ఆదిత్య తనకి గల ఎలర్జీ కారణంగా ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటూ ఉంటాడు. వ్యాపార వ్యవహారాలలో ఆయన రాజశేఖర్ (అనీశ్ కురువిల్లా) అర్జున్ (నారాయణ్)ను నమ్ముతాడు. వాళ్లిద్దరూ తండ్రీకొడుకులు. ఇద్దరూ కలిసి ఆదిత్యను పాతిక కోట్లకు మోసం చేస్తారు. ఈ విషయం తెలిసిన ఆదిత్య, ఆ ఇద్దరినీ తన సంస్థ నుంచి తొలగిస్తాడు. అప్పటి నుంచి ఆ ఇద్దరూ ఆదిత్యపై పగ పెంచుకుంటారు. ఆ పగ తీర్చుకునే ప్రయత్నాల్లోనే ఉంటారు.
'ఊటీ'లోనే మైత్రి (హన్సిక) నివసిస్తూ ఉంటుంది. సైన్స్ సంబంధమైన వస్తువులను స్వయంగా తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇలియాస్ (శంతను భాగ్యరాజ్) కూడా ఒక సైంటిస్ట్. అతను మైత్రిని పోలిన ఒక 'రోబో'ను తయారు చేస్తాడు. ఆ రోబో చూడటానికి ఒక మనిషిలానే అనిపిస్తుంది. తన యజమానికి అవసరమైన అన్ని పనులను చేయగలిగే సామర్థ్యం ఆ రోబోకి ఉంటుంది. ఆ రోబోను తయారు చేయడానికి ఆమె ఇలియాస్ కి పది లక్షలు బ్యాంక్ ద్వారా ఇప్పిస్తుంది. ఈ విషయంలో అన్నతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
ఇలియాస్ దగ్గరున్న 'రోబో'కి 'MY 3' అనే పేరు పెడతారు. ఆ రోబోను తాను లీజ్ కి తీసుకుంటానని ఆదిత్య చెబుతాడు. అయితే చివరి నిమిషంలో టెక్నికల్ సమస్య తలెత్తుతుంది. గడువు దాటితే ఆదిత్యకి కోపం వస్తుందని భావించి. 'MY 3'ని రిపేర్ చేసేవరకూ రోబోలా నటించమని చెప్పి, 'మైత్రి'ని ఆదిత్య ఇంట్లో దింపేస్తారు. ఇక అతని ఎదురుగా రోబోలా నటించడానికి మైత్రి ఎన్ని కష్టాలు పడుతుంది? మైత్రిని ప్రేమిస్తున్న ఇలియాస్, ఆమెను ఆదిత్య దగ్గర ఉంచవలసి వచ్చినందుకు ఎంత ఇబ్బంది పడతాడు? చివరికి ఈ ఇద్దరిలో మైత్రి ఎవరికి దక్కుతుంది? అనేది మిగతా కథ.
ఇది రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన కథ. రాజా రామ్మూర్తి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కీ, రాజేశ్ దర్శకత్వం వహించాడు. ఈ కథ అంతా కూడా ఆదిత్య - మైత్రి - ఇలియాస్ అనే మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డబ్బు ఉన్నప్పటికీ ఏకాంతంగా ఉండిపోవలసిన పరిస్థితిలో ఆదిత్య .. డబ్బు లేకపోవడం వలన ఒంటరిగా మిగిలిపోయిన మైత్రి .. తనకి కావలసిన డబ్బు ఈ ఇద్దరితో ముడిపడి ఉందని గ్రహించిన ఇలియాస్. అలా ఈ పాత్రలు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి.
ఆదిత్య పాత్ర వైపు నుంచి ఎమోషన్ .. మైత్రి పాత్ర నుంచి లవ్ .. ఇలియాస్ టీమ్ ద్వారా కామెడీని పండించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అప్పుడప్పుడు హన్సిక కూడా నవ్వించడానికి ట్రై చేసింది. నిజానికి పాయింట్ పరంగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కానీ దానికి దృశ్య రూపాన్ని ఇవ్వడంలో .. సన్నివేశాలను డిజైన్ చేసుకోవడంలో దర్శకుడు పూర్థిస్థాయిలో సక్సెస్ కాలేదనిపిస్తుంది. అవసరమైన అంశాలను హైలైట్ చేయలేదేమోనని అనిపిస్తుంది.
మొదటి రెండు ఎపిసోడ్స్ చూస్తే .. మరీ పేలవంగా అనిపిస్తాయి. సరైన అవుట్ పుట్ తీసుకోలేదనే విషయం స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. 3వ ఎపిసోడ్ బ్యాంగ్ నుంచి ఫరవాలేదు. అయితే ఆ తరువాత కూడా అనవసరమైన సీన్స్ లేకపోలేదు. హన్సిక నటనను ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా చెప్పుకోవచ్చు. మొదట్లో కాస్త అతిగా అనిపించినా ఆ తరువాత సర్దుకుంటుంది. అన్ని సమయాల్లో ఎమోషన్స్ ను పక్కన పెట్టేసి రోబోలా ఉండటం సాధ్యపడదనే పాత్రలో ఆమె మెప్పించింది.
హీరోలు ఇద్దరూ పాత్ర పరిధిలో న్యాయం చేశారు. ఇక అర్జున్ పాత్ర ద్వారా కామెడీ వర్కౌట్ చేయాలని చూశారుగానీ, ఆ పాత్ర ధోరణి చిరాకు పుట్టిస్తుంది. అనీశ్ కురువిల్లా పాత్ర కూడా తేలిపోయింది. అసలు ఆ ట్రాక్ దెబ్బకొట్టేసింది. ఆదిత్య పై పగబట్టిన ఈ తండ్రీ కొడుకులు, అతన్ని దెబ్బకొట్టాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆర్ధిక మూలాలపై కాకుండా, ఆదిత్య దగ్గరున్న 'రోబో'పై దృష్టి పెడతారు. ఆ రోబోను కాజేయడం వలన వలన ఏం ఒరుగుతుందనేది అర్థం కాదు. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ విషయానికొస్తే, హీరో చిన్నప్పటి సీన్స్ ను .. అర్జున్ కామెడీ సీన్స్ ను .. ఇలియాస్ టీమ్ సంభాషణలకు సంబంధించిన సీన్స్ ను ట్రిమ్ చేయవలసింది.
మొత్తంగా చూసుకుంటే పాయింట్ కొత్తదే అయినా, దానికి తగినట్టుగా పాత్రలను .. సన్నివేశాలను దర్శకుడు డిజైన్ చేసుకోలేకపోయాడు. ఫలితంగా ఎలాంటి ట్విస్టులు లేకుండా కథ సాదా సీదాగా నడుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎక్కడా తలెత్తదు. ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా లవ్ .. ఎమోషన్స్ కనెక్ట్ కావు. ఇక కామెడీ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 9 ఎపిసోడ్స్ గా ఉన్న ఈ వెబ్ సిరీస్ ను టైట్ కంటెంట్ తో 6 ఎపిసోడ్స్ లో అందించవచ్చు. అలా చేసి ఉంటే ప్రేక్షకులకు ఈ స్థాయి అసహనం తప్పేది.
'MY 3' -(హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ
MY3 Review
- కొత్త పాయింటును టచ్ చేసిన 'MY 3'
- బలహీనమైన స్క్రీన్ ప్లే
- ఎలాంటి ట్విస్టులు లేని సీన్స్
- ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయని పాత్రలు
- రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే కథ
- ఆ రెండూ కనెక్ట్ కాని వెబ్ సిరీస్ ఇది
Movie Details
Movie Name: MY3
Release Date: 2023-09-15
Cast: Hansika Motwani, Mugen Rao, Shanthanu Bhagyaraj, Janani, Narayan Lucky, Anish Kuruvilla
Director: Rajesh
Music: Ganesan
Banner: TrendLoud Digital India
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer