విశాల్ హీరోగా ఇంతకుముందు చాలానే యాక్షన్ సినిమాలు వచ్చాయి. 'మార్క్ ఆంటోని' కూడా యాక్షన్ మూవీనే. అయితే గతంలో వచ్చిన సినిమాలకీ .. ఈ సినిమాకి ఉన్న తేడా .. కాలం. అవును ఈ సినిమా కథ అంతా కూడా 1975 నుంచి 1995 మధ్యలో నడుస్తుంది. అంతేకాదు .. ఫోన్ తో ముడిపడిన టైమ్ మెషిన్ కాన్సెప్ట్ తో ఈ కథ రూపొందింది. ఈ రెండు విషయాల్లో కొత్తగా అనిపించే ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.
ఈ కథ 1975లో మొదలవుతుంది. జాకీ (ఎస్.జె. సూర్య) ఒక డాన్. తన కనుసన్నలలోనే అన్నీ జరగాలని కోరుకునే వ్యక్తి. ఆయన కొడుకు మదన్ (ఎస్. జె.సూర్య - జూనియర్) తండ్రి తలపెట్టిన అక్రమ లావాదేవీలలో తోడుగా ఉంటాడు. జాకీ దగ్గరే ప్రధానమైన అనుచరుడిగా మార్క్ (విశాల్) ఉంటాడు. అంతేకాకుండా తాను ఒక గ్యారేజ్ ను రన్ చేస్తూ ఉంటాడు. మార్క్ ఎవరో కాదు .. ఆంటోని (విశాల్ సీనియర్) కొడుకు. తన తల్లిని చంపిన తండ్రి పట్ల ద్వేషంతోనే అతను పెరుగుతాడు.
అలా 1975లో నుంచి ఈ కథ 1995లోకి అడుగుపెడుతుంది. జాకీ కొడుకు మదన్ .. మార్క్ ఇద్దరూ కలిసే పెరుగుతారు. అయితే ఇద్దరూ కూడా రమ్య (రీతూ వర్మ) అనే అమ్మాయి ప్రేమలో పడతారు. రమ్య మాత్రం మార్క్ పైనే మనసు పారేసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే చిరంజీవి (సెల్వరాఘవన్) ఒక చిత్రమైన ఫోన్ కనిపెడతాడు. డేటు .. టైమ్ సెట్ చేసుకుని, గతంలోని వాళ్లతో ఆ ఫోన్లో మాట్లాడవచ్చు. భవిష్యత్తులోకి వెళ్లి మాత్రం మాట్లాడటం కుదరదు. రోజుకి ఒక నెంబర్ కి ఒకసారి మాత్రమే ఆ ఫోన్ నుంచి కాల్ వెళుతుంది.
ఆ ఫోన్ పనితీరును పరీక్షించుకునే సమయంలోనే చిరంజీవి ఒక ప్రమాదంలో చనిపోతాడు. అనుకోకుండా ఆ ఫోన్ మార్క్ కి దొరుకుతుంది. దాంతో అతను 20 ఏళ్ల వెనక్కి వెళ్లి .. చనిపోయిన తన తల్లితో మాట్లాడతాడు. తన తండ్రితో మాట్లాడటానికి మాత్రం పెద్దగా ఆసక్తిని చూపించడు. అప్పటి వరకూ జాకీకి శత్రువుగా ఉంటూ వచ్చిన ఏకాంబరం (సునీల్) మార్క్ కళ్లు తెరిపిస్తాడు. అధికారం కోసం .. పెత్తనం కోసం తన తండ్రినీ .. తల్లిని చంపింది జాకీ అనే విషయం మార్క్ కి తెలుస్తుంది.
దాంతో టైమ్ మెషిన్ తో ముడిపడిన ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులకు మార్క్ టచ్ లోకి వెళతాడు. వాళ్ల మరణానికి ముందు వాళ్లను హెచ్చరించి, వాళ్లు చనిపోకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జాకీ ఏం చేస్తాడు? తన నిజస్వరూపం మార్క్ కి తెలిసిపోవడంతో ఆయన ఎలా స్పందిస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ నడుస్తుంది.
అదిక్ రవిచంద్రన్ కి దర్శకుడిగా మంచి అనుభవమే ఉంది. ఇంతకుముందు ఆయన నుంచి విభిన్నమైన కథాచిత్రాలు వచ్చాయి. అలాగే కాస్త ప్రయోగాత్మకంగా ఆయన 'మార్క్ ఆంటోని' కథను ఎంచుకున్నాడు. 'మార్క్ - ఆంటోని' అనే తండ్రీకొడుకుల కథ ఇది. 20 ఏళ్ల క్రితం చనిపోయిన తండ్రితో, టైమ్ మెషిన్ తో కూడిన ఫోన్ తో మార్క్ మాట్లాడి, విలన్ కి చెక్ పెట్టడానికి చేసే ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తుంది.
టైమ్ మెషిన్ .. గతంలోకి కాల్ చేసి మాట్లాడటం .. జరగబోయే ప్రమాదాల బారి నుంచి ఆ కాలంలో వారిని హెచ్చరించడం వంటివి బాగానే అనిపిస్తాయి. సాధ్యా సాధ్యాలు .. లాజిక్కులు వంటివి పక్కన పెడితే ఆ కాసేపు ఆసక్తిని పెంచుతాయి. అయితే టైమ్ మెషిన్ తో కూడిన ఫోన్ ను దర్శకుడు సరిగ్గా డిజైన్ చేయించుకోలేకపోయాడు. చేసిన ఐటమ్ ఒక సినిమా స్థాయికి తగినదిగా లేదు. అలాగే ఫోన్ చేసినవారు గాల్లోకి లేవడం కూడా అంత కరెక్టుగా అనిపించదు.
ఇక ఈ సినిమాలో హీరో విశాల్ ద్విపాత్రాభినయం చేశాడు. అలాగే విలన్ గా ఎస్.జె. సూర్య కూడా ద్విపాత్రాభినయం చేశాడు. అటు వాళ్లిద్దరూ .. ఇటు వీళ్లిద్దరూ తండ్రీ కొడుకులే. 20 ఏళ్ల క్రితం ఆంటోని కుటుంబానికి జాకీ అన్యాయం చేస్తే, ఇప్పుడు ఆంటోని కొడుకు మార్క్ కి జాకీ కొడుకు మదన్ ఎసరు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. మార్క్ అటు గతంలోని పరిస్థితులను అర్థం చేసుకుంటూ, ప్రస్తుత కాలంలోని పరిస్థితులను చక్కబెట్టడానికి సతమమవుతూ ఉంటాడు.
తెరపై ఇద్దరుగా విశాల్ .. ఇద్దరుగా ఎస్ జె సూర్య కనిపిస్తూ కన్ఫ్యూజ్ చేస్తుంటారు. దానికి తోడు మాట్లాడితే గతంలోని పాత్రలకు టచ్ లోకి వెళుతూ ఉంటారు. గతాన్ని సాధ్యమైనంత వరకూ వర్తమానంలోకి లాగుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. ఒకే సన్నివేశాన్ని వివిధ కోణాల్లో చూపిస్తూ ఉంటారు. దాంతో ప్రేక్షకులు కథను అర్థం చేసుకోవడానికి నానా తిప్పలు పడవలసి వస్తుంది. ఇక ఈ సినిమా 1975 - 95 మధ్య జరిగేది కావడంతో, ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ తో .. హెయిర్ స్టైల్ తో ఆడియన్స్ ను మరింత ఇబ్బంది పెట్టేశారు.
కథాకథనాల సంగతి అలా ఉంచితే, ప్రధానమైన పాత్రలను సైతం దర్శకుడు సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. మార్క్ పాత్రలో విశాల్ చాలా సేపు అమాయకంగా .. అయోమయంగా కనిపించడం, అదే తరహాలో మాట్లాడటం ప్రేక్షకులకు రుచించదు. ఆయనను అలా చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడరు. ఇక మదన్ పాత్రలో సూర్య అతివాగుడు కూడా చిరాకు తెప్పిస్తుంది. సీనియర్ విశాల్ ఓవర్ గెటప్పు .. అలాగే సీనియర్ సూర్య ఓవర్ యాక్షన్ కాస్త అసహనాన్ని కలిగిస్తాయి.
రీతూ వర్మ ఈ సినిమాలో ఒకటి రెండు చోట్ల కనిపిస్తుంది. ఆమెతో విశాల్ కి ఎలాంటి రొమాంటిక్ సాంగ్స్ లేవు. అసలు ఆమె ఈ పాత్రను ఎందుకు ఒప్పుకుందనేది అర్థం కాదు. ఆమె పాత్ర లేకపోయినా కథకి వచ్చే నష్టం కూడా లేదు. ఎటొచ్చి ఆమెతో కూడా ద్విపాత్రాభినయం చేయించనందుకు దర్శకుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకోవాలంతే.
జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ స్థాయిని మించేసి వెళ్లిపోయింది. బాణీల పరంగా కూడా అంత గుర్తుపెట్టుకునేవేమీ లేవు. కథలోని గందరగోళాన్ని ఎడిటర్ గా విజయ్ ఏమీ చేయలేకపోయి ఉండొచ్చు. హీరోలుగా మార్క్ - ఆంటోని, విలన్స్ గా జాకీ - మదన్ ధాటిని తట్టుకోవడం ఆడియన్స్ కి కాస్త కష్టమే. కథను సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. హీరో - విలన్ ద్విపాత్రాభినయం .. ఆ పాత్రలను సరిగ్గా మలచకపోవడం .. హడావిడి - గందరగోళంలో నుంచి కామెడీని పిండటానికి ట్రై చేయడం .. ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం మైనస్ గా అనిపిస్తాయి.
'మార్క్ ఆంటోని' - మూవీ రివ్యూ
Mark Antony Review
- విశాల్ నుంచి వచ్చిన 'మార్క్ ఆంటోని'
- లేని లవ్ ట్రాక్ .. పేలని కామెడీ ట్రాక్
- ఆడియన్స్ ను అయోమయంలోకి నెట్టేసే ద్విపాత్రాభినయాలు
- ఓవర్ యాక్షన్ లు .. ఓవర్ గెటప్పులు
Movie Details
Movie Name: Mark Antony
Release Date: 2023-09-15
Cast: Vishal, S. J. Suryah, Ritu Varma, Selvaraghavan, Sunil, Abhinaya, Nizhalgal Ravi
Director: Adhik Ravichandran
Music: G. V. Prakash Kumar
Banner: Mini Studio
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer