'ఏదైనా జరగొచ్చు' మూవీ రివ్యూ

జీవితాన్ని విలాసవంతంగా గడపాలి .. అందుకోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఓ ముగ్గురు కుర్రాళ్లు, డబ్బు కోసం ఎంతకైనా తెగించే ఓ రౌడీతో శత్రుత్వం పెట్టుకుంటారు. ఆ రౌడీ ఆశ్రయంలో వున్న దెయ్యం ఆగ్రహానికి గురవుతారు. పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలతో ఈ కథ సాగుతుంది. కథాకథనాల్లో బలం తక్కువ .. సన్నివేశాల పరంగా హడావిడి ఎక్కువ అనిపించే ఈ సినిమా, కొత్తదనాన్ని ఆశించి వెళ్లిన ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది.
'ఏదైనా జరగొచ్చు' అనేది ఈ సినిమా టైటిల్ కావడంతో, ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు .. అదేమిటో చూడాలనే ప్రేక్షకులు థియేటర్లకు వెళతారు. అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠను రేకెత్తించే ఆ సంఘటనలు ఏమై వుంటాయో తెలుసుకోవడానికి కుతూహలాన్ని కనబరుస్తారు. మరి ఈ కథలో నిజంగానే అలాంటి ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయా? టైటిల్ కి తగినట్టుగానే కథ సస్పెన్స్ తో సాగిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

జై (విజయ్ రాజా) రాకీ .. విక్కీ అనే ముగ్గురు స్నేహితులు, ఏడాది తిరిగేలోగా తాము కోటీశ్వరులుగా మారిపోవాలనే నిర్ణయానికి వస్తారు. ప్రతి నిమిషాన్ని డబ్బుగా మార్చేయాలనే ఉద్దేశంతో, ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తూ వెళతారు. తమ కారణంగా డబ్బు పోగొట్టుకున్న శశి ( పూజా సోలంకి)కి, సాధ్యమైనంత త్వరగా డబ్బు సర్దుబాటు చేయాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కాళీ (బాబీసింహా) అనే రౌడీతో శత్రుత్వాన్ని తెచ్చుకుంటారు. కాళీ అక్రమంగా సంపాదించిన డబ్బంతా అతని ఇంట్లోనే ఎక్కడో వుండి ఉంటుందని భావిస్తారు. ఆ డబ్బు కోసం ఓ అర్థరాత్రి వేళ కాళీ ఇంటికి వెళ్లిన ఈ ముగ్గురు స్నేహితులు, అక్కడ బేబీ అనే దెయ్యం (శషా సింగ్)ను చూసి భయంతో వణికిపోతారు. బేబీకి కాళీతో వున్న సంబంధం ఏమిటి? అటు కాళీ నుంచి .. ఇటు దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేస్తారు? అనేది తెరపైనే చూడాలి.

దర్శకుడు రమాకాంత్ ఈ కామెడీ థ్రిల్లర్ కి 'ఏదైనా జరగొచ్చు' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాడు. అయితే ఇంటర్వెల్ కి ముందు వరకూ ఏమీ జరగదు. ముగ్గురు స్నేహితులు .. వాళ్లకి పరిచయమైన కథానాయిక కాంబినేషన్లో పసలేని సన్నివేశాలను చేసుకుంటూ వెళ్లాడు. ఇంటర్వెల్ కి ముందు దెయ్యం పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో కథ కాస్త పట్టాలెక్కి, కాళీ ఫ్లాష్ బ్యాక్ తో పుంజుకుంటుంది. అయితే కాళీ పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ నిడివి పెరిగిపోయింది.

కాళీ పాత్రను బాగా డిజైన్ చేసిన దర్శకుడు, శషా సింగ్ పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేకపోయాడు. దెయ్యంగా మారకముందు ఆమె బాడీ లాంగ్వేజ్ ను .. స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రేక్షకులకు అర్థం కాదు. ప్రేతాత్మను బంధించిన 'సీసా' విషయంలోనే ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. ఒక్కోసారి అది పొగతో నిండివున్నట్టుగా .. మరోసారి ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఐటమ్ సాంగ్ విషయంలోను అంతే .. మంచి సాంగ్ ను ఎంపిక చేసుకున్నాడు. కానీ ఆ సాంగ్ కోసం ఏ మాత్రం గ్లామర్ లేని ఆర్టిస్ట్ ను తీసుకున్నాడు.  

ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన ముగ్గురు యువకుల నటన అంతంత మాత్రమే. ఇక హీరోయిన్ స్థానంలో కనిపించిన పూజా సోలంకి నటన కూడా అంతేవుంది. బాబీసింహా పోషించిన 'కాళీ' పాత్ర .. తేడా మాంత్రికుడిగా అజయ్ ఘోష్ నటన మాత్రమే కాస్త చెప్పుకోదగినవిగా అనిపిస్తాయి. వెన్నెల కిషోర్ .. చమ్మక్ చంద్ర .. తాగుబోతు రమేశ్ .. రచ్చరవి పాత్రలు ఉన్నప్పటికీ, సన్నివేశాల్లో .. అందుకు తగిన డైలాగ్స్ లో విషయం లేకపోవడం వలన వాళ్లు ఏమీ చేయలేకపోయారు. క్లైమాక్స్ లో దెయ్యంతో చాలా హడావిడి చేయించారు. అయినా ఆడియన్స్ కి ఏమీ అనిపించదు. అందుకు కారణం కథా పరంగా .. పాత్ర పరంగా బలమైన నేపథ్యం లేకపోవడమే.
 
సంగీతం పరంగా చూసుకుంటే ఫరవాలేదనిపించే స్థాయిలో మార్కులు పడతాయి. రీ రికార్డింగ్ పనితీరు .. కెమెరా పనితనం బాగున్నాయి. కథాకథనాలు అంత బలంగా లేకపోవడం .. ప్రధాన పాత్రధారుల్లో ఒక్క బాబీ సింహా మినహా మిగతా వాళ్లంతా నటన విషయంలో వీక్ గా ఉండటం .. కొన్ని పాత్రల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు తేలిపోవడం వలన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కామెడీ థ్రిల్లర్లో ఏ పాత్రలోను కామెడీ అనేది కనిపించదు .. ఏ సన్నివేశం థ్రిల్లింగ్ గా అనిపించదు.          

Movie Details

Movie Name: Edaina jaragochhu

Release Date: 2019-08-23

Cast: Vijay Raja, Pooja Solanki, Sasha Singh, Bobby Simha, Vennela Kishore, Ravi Shiva Teja

Director: RamaKanth

Producer: Umakanth

Music: Srikanth Pendyala

Banner: Wet Brain entertainments

Review By: Peddinti

Edaina jaragochhu Rating: 2.00 out of 5


More Movie Reviews