తమిళంలో ఒక నెల రోజుల క్రితం థియేటర్లకు వచ్చిన 'తందట్టి' సినిమా, అక్కడ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. పశుపతి .. రోహిణి .. వివేక్ ప్రసన్న .. అమ్ము అభిరామి .. దీపా శంకర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన 'అమెజాన్ ప్రైమ్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. సస్పెన్స్ తో కూడిన ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది చూద్దాం.
సుబ్రమణియన్ (పశుపతి) ఓ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. వృత్తి పట్ల అంకితభావం .. నిజాయతీ కలిగిన పోలీస్. మరో పది రోజుల్లో అతని రిటైర్మెంట్ ఉంటుంది. ఒక రోజున సెల్వరాజ్ అనే ఒక టీనేజ్ కుర్రాడు ఆ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. తన నాయనమ్మ తంగ పొన్ను (రోహిణి) నాలుగు రోజులుగా కనిపించడం లేదని సుబ్రమణియన్ కి చెబుతాడు. అదే సమయంలో ఓ నలుగురు స్త్రీలు వచ్చి తమ తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తారు. ఆ నలుగురూ తన మేనత్తలేనని సెల్వరాజ్ చెబుతాడు.
తప్పిపోయిన తంగపొన్ను పట్ల ఆ కూతుళ్లకు ఉన్న ప్రేమను చూసి, సుబ్రమణియన్ ఆశ్చర్యపోతాడు. ఆ ముసలావిడను వెతికి తీసుకొచ్చే బాధ్యత తనదంటూ ధైర్యం చెబుతాడు. ఈ కేసు 'కిడారిపట్టి' గ్రామం నుంచి వచ్చిందనీ, పోలీసులు తమ గ్రామంలోకి రావడం ఆ ఊరు వాళ్లకు నచ్చదని సుబ్రమణియన్ కి మిగతా పోలీసులు వివరిస్తారు. ఆ గ్రామంలో ఏ చిన్న గొడవ జరిగినా అక్కడి నుంచి బయటపడటం పోలీసుల వలన కాదంటూ, గతంలో తమకి ఎదురైన కొన్ని అనుభవాలు చెబుతారు.
తామంతా డ్యూటీపై వేరే ప్రదేశానికి వెళుతున్నామనీ, ఆ గ్రామంలో సుబ్రమణియన్ చిక్కుబడితే, అతనికి అందుబాటులో ఎవరమూ ఉండమని అంటారు. అక్కడి నుంచి బయటపడటానికి ఒంటరి పోరాటమే చేయవలసి ఉంటుందని హెచ్చరిస్తారు. సుబ్రమణియన్ ఆ ప్రాంతానికి వచ్చి కొంతకాలమే అవుతున్న కారణంగా, అతనికి 'కిడారిపట్టి' ఊరు గురించిన అవగాహన పెద్దగా ఉండదు. అందువలన మిగతా పోలీసుల మాటలను పెద్దగా పట్టించుకోకుండా, సెల్వ రాజ్ తో కలిసి 'కిడారిపట్టి'కి బయల్దేరతాడు.
తన నాయనమ్మ 'తంగపొన్ను' చాలా మంచిదనీ, తన తండ్రి తాగుబోతు అని మార్గమధ్యంలో సుబ్రమణియన్ తో చెబుతాడు సెల్వ రాజ్. తన తండ్రి చేసిన ఒక పని కారణంగానే, తన పేరున ఉన్న కొంత పొలాన్ని నాయనమ్మ కోల్పోయిందని చెబుతాడు. ఇక తన మేనత్తలు నలుగురికి కూడా తల్లి పట్ల ఎంతమాత్రం ప్రేమానురాగాలు లేవని చెబుతాడు. ఆమె బంగారపు 'చెవి దుద్దులు'లను కాజేసే సమయం కోసం వాళ్లంతా ఎదురుచూస్తున్నారని అంటాడు.
'తంగపొన్ను'ను వెతకడం కోసం, సెల్వ రాజ్ తో కలిసి సుబ్రమణియన్ టౌన్ కి వెళతాడు. అక్కడ ఒక బస్టాండ్ లో దీనస్థితిలో ఆమె కనిపిస్తుంది. కొన్ని రోజులుగా పస్తులున్న కారణంగా ఆమె కుప్పకూలిపోతుంది. వెంటనే సుబ్రమణియన్ ఆమెను హాస్పిటల్లో చేరుస్తాడు. కానీ అప్పటికే ఆమె చనిపోతుంది. సెల్వ రాజ్ రిక్వెస్ట్ చేయడంతో అతనితో పాటు 'తంగపొన్ను' శవాన్ని తీసుకుని సుబ్రమణియన్ 'కిడారిపట్టి' గ్రామానికి చేరుకుంటాడు.
అయితే అంత్యక్రియలకి ముందు శవం చెవులకు ఉన్న 'దుద్దులు' మాయమవుతాయి. ఆ దుద్దులు తన మరణంలోను తనవెంటే ఉండాలనేది ఆమె కోరిక. అంతగా ఆ దుద్దులకు ఉన్న ప్రత్యేకత .. ప్రాధాన్యత ఏమిటి? అలాంటి దుద్దులను ఎవరు కాజేశారు? ఎవరు ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ఆ ఊరు వచ్చిన సుబ్రమణియన్ ఎలా అక్కడ ఇరుక్కుపోతాడు? చివరికి ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ.
ఒక స్త్రీ జీవితంలో చెవి దుద్దుల సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. చివరివరకూ అవి తనతోనే ఉండాలని ఆమె కోరుకుంటుంది. తమిళనాట ఒక రకమైన చెవి దిద్దులను అక్కడి స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. ఆ చెవి దుద్దుల చుట్టూ అల్లుకున్న కథనే 'తందట్టి'. దర్శకుడు చెవి దుద్దులను ప్రధానంగా చేసుకుని అల్లుకున్న కథ మొదటి నుంచి చివరివరకూ కామెడీని .. సస్పెన్స్ ను .. ఎమోషన్స్ ను కలిపి నడిపిస్తూ ఉంటుంది.
తల్లి చెవి దుద్దుల కోసం ఆమె పిల్లలు ఎలా పోట్లాడుకుంటారు? శవం దగ్గర గ్రామస్థుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ సమయంలోను మర్యాదలు చేయడం లేదంటూ బంధువుల అలకలు ఎలా ఉంటాయి? అక్కడ ఏ క్షణంలో ఏం గొడవ జరుగుతుందోనని ఒక ఒంటరి పోలీస్ ఎలా భయపడ్డాడు? అనేది దర్శకుడు చాలా సహజంగా ఆవిష్కరించాడు. ఆ సన్నివేశాలన్నీ కూడా హాయిగా నవ్విస్తాయి. అందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ గా పశుపతి .. తంగపొన్నుకి తాగుబోతు కొడుకుగా వివేక్ ప్రసన్న నటన ఈ సినిమాకి హైలైట్.
సుందర రామమూర్తి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మహేశ్ ముత్తుస్వామి కెమెరా పనితనం .. శివానందీశ్వరన్ ఎడిటింగ్ బాగున్నాయి. కథకి తగిన లొకేషన్స్ కంటెంట్ ను మరింతగా ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తాయి. కథ .. స్క్రీన్ ప్లే అంతా ఒక ఎత్తు .. క్లైమాక్స్ ట్విస్ట్ ఒక ఎత్తు. మొదటి నుంచి కాస్త కామెడీగా .. సస్పెన్స్ తో .. ఎమోషన్స్ తో సాగుతూ వచ్చిన ఈ కథను, క్లైమాక్స్ ట్విస్ట్ అనేది ఎక్కడికో తీసుకుని వెళ్లిపోతుంది. ఆడియన్స్ లో ఎవరూ కూడా ఈ ట్విస్టును గెస్ చేయలేరు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో, ది బెస్ట్ క్లైమాక్స్ లలో ఒకటిగా ఇది కనిపిస్తుంది. ఒక చిన్న సినిమా ఎంత బలమైన కంటెంట్ ను చెప్పగలదు అనడానికి నిర్వచనంగా నిలుస్తుంది.
కథ .. స్క్రీన్ ప్లే .. లొకేషన్స్ .. క్లైమాక్స్ ట్విస్ట్ .. కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పశుపతి - వివేక్ ప్రసన్న నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఒకటి రెండు సీన్స్ ను కాస్త పొడిగించినట్టుగా అనిపించినా, పెద్దగా పట్టించుకోవలసిన అవసరం ఉండదు. ఈ సినిమా చూసిన ఎవరైనా, ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి సినిమాగా మార్కులు ఇవ్వకుండా ఉండలేరు.
'తందట్టి' - (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ
- తమిళంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన 'తందట్టి'
- ఈ నెల 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- చెవి దుద్దుల చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్
- మొదటి నుంచి చివరివరకూ కూర్చోబెట్టే కంటెంట్
- ఎవరూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్
Movie Details
Movie Name: Thandatti
Release Date: 2023-07-14
Cast: Pasupathy, Rohini, Vivek Prasanna, Ammu Abhirami, Deepa Shankar
Director: Ram Sangaiah
Music: Sundara Ramamoorthy
Banner: Prince Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer