ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ జోనర్లకి చెందిన కంటెంట్ కి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకు కారణం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి యూత్ ఎక్కువగా చేరుకోవడమే. అయితే ఈ మధ్య కాలంలో ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ కంటెంట్ కి కూడా ఆదరణ పెరుగుతూపోతోంది. అలాంటి కంటెంట్ తో 'అమెజాన్ ప్రైమ్' లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన వెబ్ సిరీస్ 'స్వీట్ కారం కాఫీ'. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
సుందరి (లక్ష్మి) తన కొడుకు రాజారత్నం ఇంట్లో ఉంటూ ఉంటుంది. సుందరి కోడలు కావేరి (మధుబాల) ఆమెను తన తల్లి మాదిరిగానే చూసుకుంటూ ఉంటుంది. మనవడు (బాలా) మనాలిలో చదువుకుంటూ ఉంటాడు. ఇక మనవరాలు నివేదిత (శాంతి బాలచంద్రన్) క్రికెట్ ప్రాక్టీస్ పై ఎక్కువ దృష్టి పెడుతుంది. భర్తని కోల్పోయిన సుందరిని కొడుకు రాజా రత్నం ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. ఇంట్లో నుంచి ఆమె కాలు బయట పెట్టవలసిన అవసరం రాకుండా చూస్తుంటాడు.
ఇక ఇంటికి సంబంధించిన అన్ని పనులను కావేరినే చూసుకుంటూ ఉంటుంది. అయితే ఎప్పుడూ తన పనిలో తాను నిమగ్నమై ఉండే రాజారత్నం ధోరణి కావేరి బాధ కలిగిస్తుంది. తాను ఎప్పుడూ ఇల్లు పట్టుకుని వేళ్లాడుతూ ఉండటం వల్లనే తన భర్తకి తన విలువ తెలియడం లేదని భావిస్తుంది. కావేరి కూతురు నివేదిత, కార్తీక్ అనే క్రికెటర్ తో ప్రేమలో పడుతుంది. అయితే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆమె క్రికెట్ ఆడకూడదని అతను తేల్చిచెబుతాడు. దాంతో నివేదిత మనసుకి కష్టం కలుగుతుంది.
అస్తమాను నాలుగు గోడల మధ్యనే ఉండలేక ఎక్కడికైనా వెళితే బాగుంటుందని కావేరితో సుందరి అంటుంది. అలాంటి సమయం కోసమే వెయిట్ చేస్తున్న కావేరీ అందుకు ఓకే అంటుంది. 'గోవా' ట్రిప్ వేద్దామని నివేదిత సలహా ఇస్తుంది. అందుకు అవసరమైన కారును తన స్నేహితురాలు శ్వేతను అడిగి తీసుకుంటుంది. ఇంట్లో తెలియనీయకుండా ... ఎక్కడికి వెళుతున్నది చెప్పకుండా, ఒక కాగితం ముక్క రాసి పెట్టేసి ఒకరోజు రాత్రి వెళ్లిపోతారు.
కారులో ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి, సుందరి ఒక వ్యక్తి అడ్రెస్ కోసం తన స్నేహితురాలితో రహస్యంగా మాట్లాడుతూ ఉంటుంది . కార్తీక్ పెట్టిన కండిషన్ గురించే ఈ ప్రయాణంలో నివేదిత ఆలోచన చేస్తూ ఉంటుంది. కార్తీక్ తో తన ప్రేమను గురించి తల్లితోను .. నాయనమ్మతోను చెబుతుంది. అలాగే పెళ్లికి ముందు తన తల్లి ఫ్లాష్ బ్యాక్ ను గురించి .. నాయనమ్మ ఫ్లాష్ బ్యాక్ ను గురించి తెలుసుకుంటుంది. కార్తీక్ ప్రేమలో ఉన్న నివేదితకి ఈ ట్రిప్ లోనే విక్రమ్ పరిచయమవుతాడు.
సుందరి ఎవరి అడ్రస్ కోసం వెతుకుతోంది? కార్తీక్ విషయంలో నివేదిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కావేరి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? విక్రమ్ ఎవరు? మనసును తేలిక పరచుకోవడం కోసం బయట ప్రపంచంలోకి వెళ్లిన ఈ ముగ్గురికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
వనిత మాధవన్ మీనన్ అందించిన కథ ఇది. బిజోయ్ నంబియార్ .. కృష్ణ మారిముత్తు .. స్వాతి రఘురామన్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. ఒక అత్తగారు .. కోడలు .. టీనేజ్ కి వచ్చిన ఒక మనవరాలు, తమ మానసిక ఒత్తిడిని జయించడం కోసం సరదాగా కారులో ఓ ట్రిప్ వేస్తారు. ఇలా మూడు తరాల వారు కలిసి చేసే ప్రయాణం .. ఈ ప్రయాణంలో మనసు విప్పి తమ గతంలోని అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకోవడమనే ఒక పాయింట్ పై కథను నడిపించాలనే ఆలోచన బాగుంది.
మొత్తంగా చూసుకుంటే 8 ఎపిసోడ్స్ లో ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలకి పైగా నిడివిని కలిగి ఉంది. కానీ ఆ నిడివికి తగిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ లేదు. మొదటి రెండు ఎపిసోడ్స్ బాగానే అనిపిస్తాయి. ఫోక్ ఫెస్టివల్ ఎపిసోడ్ ను పక్కన పెట్టేస్తే, మూడు - నాలుగు ఎపిసోడ్స్ ఓ మాదిరిగా కనిపిస్తాయి. ఇక 5వ ఎపిసోడ్ నుంచి అంతగా ప్రాధాన్యత లేని సాగతీత సన్నివేశాలు వచ్చి చేరడం మొదలవుతుంది. రాబర్ట్ - జూలియా ప్రేమ సన్నివేశాలు, కావేరిని విక్రమ్ ఓ సంగీత సామ్రాట్టుకు పరిచయం చేయడం .. ధర్మశాల ఎపిసోడ్ బోర్ కొట్టిస్తాయి.
ముఖ్యంగా విక్రమ్ - నివేదితల ట్రాక్ విషయానికొస్తే, ఫస్టు సీన్ లో పరిచయం .. సెకండ్ సీన్ లో మాటలు .. మూడో సీన్ లో హగ్ చేసుకోవడం .. పెద్దగా పరిచయం లేని విక్రమ్ తో కలిసి అతని బైక్ పై కావేరి వెళ్లిపోవడం కాస్త అసహజంగా అనిపిస్తుంది. స్వేఛ్ఛ పేరుతో ఈ మూడు పాత్రలను ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చిన డైరెక్టర్, వాటిని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లలేదని అనిపిస్తుంది.
ఇక సుందరి .. కావేరి .. నివేదిత ముగ్గురూ కలిసి ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకుంటూ ఉండగానే, వారి ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా రన్ అవుతూ ఉంటాయి. అయితే ఎవరి ఫ్లాష్ బ్యాక్ లోను స్పష్టత కనిపించదు. సుందరి పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో ఏదో ట్విస్ట్ ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తారు. దర్శకులు దానిని కూడా తేల్చి అవతల పారేశారు. ఆల్రెడీ ఒకరితో ప్రేమలో ఉన్న నివేదిత, మరో యువకుడికి దగ్గర కావడం ఒక ఆశ్చర్యమైతే, ఆమె ప్రేమ విషయం తెలిసికూడా తల్లిగానీ .. నాయనమ్మగాని సరైన సలహా ఇవ్వకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.
లక్ష్మి నటనకు వంక బెట్టవలసిన పనిలేదు .. కథ ఆ మాత్రం హుషారుగా నడవనికి కారణం ఆమెనే. మిగతా వాళ్లంతా ఫరవాలేదు. గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. విరాజ్ సింగ్ - కృష్ణన్ వసంత్ కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ విషయానికొస్తే, విదేశీ ప్రేమికుల నేపథ్యంలో సీన్స్ ను .. విక్రమ్ నేపథ్యంలో సీన్స్ ను .. నివేదిత - కార్తీక్ కాంబినేషన్ సీన్స్ ను ట్రిమ్ చేయవచ్చు. ఇక కొన్ని పాత్రలకి కొంతమంది ఆర్టిస్టులు కూడా సెట్ కాలేదనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడక్కడా ఫీల్ వర్కౌట్ అయినప్పటికీ, టైటిల్ కి తగిన స్థాయి కంటెంట్ మాత్రం కనిపించలేదనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్: టైటిల్ .. లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. లక్ష్మి నటన.
మైనస్ పాయింట్స్: కొన్ని అనవసరమైన సీన్స్ .. ఇంట్రెస్టింగ్ గా లేని ఫ్లాష్ బ్యాక్స్ .. నిడివి కారణంగా పలచబడిన కథ .. ఎక్కడా ఎలాంటి ట్విస్టులు లేకపోవడం.
'స్వీట్ కారం కాఫీ' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!
Sweet Kaaram Coffee Review
- ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన 'స్వీట్ కారం కాఫీ'
- మంచి పాయింటును పట్టుకుని నడవలేకపోయిన కథ
- రెండు ఎపిసోడ్స్ తరువాత తగ్గుతూ వచ్చిన గ్రాఫ్
- టైటిల్ కి తగిన స్థాయిలో కనిపించని సందడి
- అసహనానికి గురిచేసే అనవసరమైన సీన్స్
- లక్ష్మి నటన మాత్రమే హైలైట్
Movie Details
Movie Name: Sweet Kaaram Coffee
Release Date: 2023-07-06
Cast: Lakshmi, Madhubala, Shanthi, Vamsi Krishna, Kavin Jay Babu, Bala Suresh
Director: Bejoy Nambiar
Music: Govind Vasanth
Banner: A Lion Tooth Studios
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer