రామాయణం ఒక ఇతిహాసం .. ఈ కథను ప్రధానంగా చేసుకుని ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. ఈ సారి కథతో పాటు ఈనాటి టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ ఆవిష్కరించిన సినిమానే 'ఆదిపురుష్'. రామాయణం గురించి చాలామందికి తెలుసు. అయినా ఎప్పటికప్పుడు ఈ కథను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఆ కథలోని గొప్పతనం అది. ప్రభాస్ కథానాయకుడిగా నిర్మితమైన ఈ సినిమా, ఇంతవరకూ రానంత భారీ బడ్జెట్ లో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ కథ రామాయణంలోని 'అరణ్యకాండ' .. 'యుద్ధకాండ'లోని అంశాలను ప్రధానంగా చేసుకుని నడుస్తుంది. దర్శకుడు కథారంభానికి సంబంధించిన విషయాలను పెయింటింగ్స్ తో .. సింగిల్ డైలాగ్స్ తో సింపుల్ గా చెప్పేస్తూ, ప్రధానమైన పాత్రలను నేరుగా 'అరణ్యకాండ'లోకి ప్రవేశపెట్టాడు. అందువలన ఎక్కడా భరత .. శత్రుఘ్నులుగానీ, అయోధ్య ప్రజలుగాని కనిపించరు. సింగిల్ డైలాగ్ కోసం దశరథుడు - కైకేయి తెరపైకి వస్తారంతే, మిగిలినవారి ప్రస్తావన ఎక్కడా వినిపించదు.
సీతారామలక్ష్మణులు వనవాసానికి బయల్దేరడం .. శ్రీరాముడిపై శూర్పణఖ మనసు పారేసుకోవడం .. లక్ష్మణుడి కారణంగా ఆమెకి అవమానం జరగడం .. శూర్పణఖ ద్వారా సీత అందచందాలను గురించి రావణుడు తెలుసుకోవడం .. సీతాదేవిని పొందాలని ఆశపడటం .. ఆమెను అపహరించడం .. సీతాన్వేషణ చేస్తూ రామలక్ష్మణులు బయల్దేరడం .. హనుమ - సుగ్రీవుల సాయంతో రావణుడిపై రాముడు యుద్ధం ప్రకటించడం .. యుద్ధంలో తన పరివారంతో పాటు రావణుడు నశించడం .. సీతా సమేతుడైన రాముడు 'అయోధ్య' సింహాసనాన్ని అధిరోహించడం .. ఇదీ కథ.
ఇదీ అందరికీ తెలిసిన కథనే .. అయితే ఎవరి మార్క్ తో వారు ఈ కథను తెరకెక్కిస్తూ వచ్చారు. అయితే ప్రధానమైన పాత్రల వేషధారణ .. వారి బాడీ లాంగ్వేజ్ .. కొన్ని కీలకమైన అంశాలను మార్చే సాహసం మాత్రం తెలుగు దర్శకులెవరూ చేయలేదు. అలాంటి ఒక సాహసం ఓం రౌత్ చేశాడు. ఇంతవరకూ శ్రీరాముడిని దర్శకులంతా నీలిమేఘఛాయ కలిగినవాడిగా చూపిస్తూ వచ్చారు. కానీ అందుకు భిన్నంగా ఓం రౌత్ చూపించాడు. ఇక శ్రీరాముడి మీసాల విషయంలోను ఇదే మాట చెప్పుకోవలసి ఉంటుంది.
ఇక సీతాదేవిని నుంచున్న పళంగా నేలను పెకిలించి రావణుడు ఆమెను ఎత్తుకెళతాడనే జనాలకు తెలుసు. కానీ సీతాదేవి ఆయన మంత్రశక్తికి లోబడి అమాంతం వెల్లకిలా గాల్లోకి లేచి అతన్ని అనుసరించడం .. రావణుడి వాహనంగా గబ్బిలాన్ని చూపించడం .. సీతాదేవి తన ఆనవాలుగా హనుమంతుడికి 'చూడామణి' కాకుండా 'చేతి గాజు' ఇవ్వడం .. రావణుడి అనుచరులు హాలీవుడ్ సైంటిఫిక్ సినిమాల్లో మాదిరి వేషధారణతో కనిపించడం .. వానర వీరులు .. రావణుడి కాపలాదారులు బొమ్మల మాదిరిగా కదలడం .. రావణుడు పది తలలు వరుసగా కాకుండా, ఐదు తలలపై మరో ఐదు తలలు కలిగినట్టుగా చూపించడం ఇబ్బందిపెడతాయి.
ఇక ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలు తప్ప .. అయోధ్యలో శ్రీరాముడి ఫ్యామిలీ గానీ .. వానర వీరుల కుటుంబాలు గానీ .. రావణుడి ఫ్యామిలీ నేపథ్యం గాని ఎక్కడా కనిపించవు. సందర్భానికి తగినట్టుగా ఆ పాత్రలు తెరపైకి వచ్చి వెళుతుంటాయి తప్ప, ఫ్యామిలీ సెటప్పును .. వాటి తాలూకు ఎమోషన్స్ ను చూపించలేదు. రావణుడి వైపు నుంచి రథాలు లేకుండానే సాగిన యుద్ధం ఇది. మారీచుడు .. శబరీ .. వాలి పాత్రలను చాలా సింపుల్ గా టచ్ చేయడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది.
అయితే ఓం రౌత్ ను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఆయన ఎక్కడా కూడా కథను సాగదీసే ప్రయత్నం చేయలేదు. తెరపై కథ చకచకా జరిగిపోతూ ఉంటుంది. ఒక సన్నివేశం చివరిలో మరో సన్నివేశం కలిసిపోతూ ముందుకు వెళుతుంది. జటాయువు రావణుడిని వెంబడించడం .. రాముడు సముద్రుడిపై బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టడం .. హనుమ సముద్ర లంఘనం .. లంకా దహనం .. వారధి నిర్మాణం .. రావణుడి కోటను వానరవీరులు ముట్టడించడం వంటి సీన్స్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి.
శ్రీరాముడిగా ప్రభాస్ ఎంతవరకూ సెట్ అవుతాడు? .. సీతాదేవిగా కృతి సనన్ కనెక్ట్ అవుతుందా? అనే సందేహంతో థియేటర్స్ కి వచ్చినవారు, ఆ పాత్రలలో వారిని అంగీకరిస్తారు. ఆ తరువాత కథతో పాటు ముందుకు వెళతారు. అందుకు కారణం అద్భుతమైన విజువల్స్. 3D ఫార్మేట్ లో మరింత ఆశ్చర్యపరిచే విజువల్స్ అనే చెప్పాలి. రాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ మెప్పించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటన ఓకే. హనుమంతుడి పాత్రను పోషించిన దేవ్ దత్త ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యాడు.
రావణుడిగా సైఫ్ అలీ విభూతి రేఖలతో కనిపించడు. తన సెటప్ తో మోడ్రన్ మాంత్రికుడిలా అనిపిస్తాడు. ఇక విభీషణుడి కంటూ వేషధారణలో ప్రత్యేకత లేకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. అయినా ఇది రామాయణం ప్రేరణతో చేసిన సినిమా మాత్రమేననీ, అసలైన రామాయణానికి ఇది కొలమానం కాదనీ .. సినిమాపరమైన మార్పులు జరిగాయనే విషయాన్ని గ్రహించాలని ముందుమాటగా వేశారు. కనుక కథాపరమైన లోపాలను సర్దుకుంటూ .. విజువల్స్ పరంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించాలంతే.
అజయ్ - అతుల్ ట్యూన్స్ ఆకట్టుకుంటాయి. సందర్భానికి తగినట్టుగా వచ్చే 'జై శ్రీరామ్' .. 'సీతారాముల' .. 'శివోహం' పాటలు మనసుకు పట్టుకుంటాయి. సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పాలి. కార్తీక్ పళని కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. పాటల చిత్రీకరణతో ఆయన ప్రేక్షకులను మరో లోకానికి తీసుకుని వెళ్లాడు. అపూర్వ మోతివాలే సహాయ్ - ఆశిష్ ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. ప్రేక్షకులను ఏ సన్నివేశంలో నుంచి జారిపోకుండా చూసుకున్నారు.
ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. చిత్రీకరణ .. కొన్ని సీన్స్ కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ప్రధాన పాత్రధారుల నటన.
మైనస్ పాయింట్స్: రాముడిపైకి క్షుద్రశక్తులు దూసుకొచ్చే ఎపిసోడ్. కొన్ని పాత్రల విషయంలో గ్రాఫిక్స్ కుదరకపోవడం .. రావణుడిని మోడ్రన్ మాంత్రికుడిగా చూపించడం .. కొన్ని ముఖ్యమైన సీన్స్ ను సింపుల్ గా తేల్చేయడం .. ముఖ్యమైన అంశాలను మార్చడం. రాముడు .. సీత .. లక్ష్మణుడు అని హాయిగా పిలుచుకునే తెలుగు ప్రేక్షకులకు, ఆ పాత్రలను రాఘవ .. జానకి .. శేషుగా సంబోధించడం.
*ఇలా ఈ సినిమాలో దర్శకుడి వైపు నుంచి చేసిన కొన్ని మార్పులు .. ప్రేక్షకుల వైపు నుంచి చూస్తే లోపాలుగా కనిపించే సీన్స్ ను పక్కన పెట్టేస్తే, 3D ఫార్మేట్ లో చిన్న పిల్లలను ఎక్కువగా ఆకట్టుకునే సినిమాగా ఇది నిలుస్తుందని చెప్పచ్చు.
'ఆదిపురుష్' - మూవీ రివ్యూ
Adipurush Review
- నీలిరంగు మేనిఛాయలేని రాముడిగా కనిపించిన ప్రభాస్
- కీలకమైన అంశాలను మార్చిన దర్శకుడు
- అసంతృప్తిని కలిగించే వానరుల ట్రాక్ .. రావణుడి ట్రాక్
- అక్కడక్కడా మాత్రమే మెప్పించిన గ్రాఫిక్స్
- రావణుడిని మోడ్రన్ మాంత్రికుడిగా చూపించిన దర్శకుడు
- శ్రీరాముడిగా ప్రభాస్ - హనుమగా దేవ్ దత్త నటన హైలైట్
- 3D ఫార్మేట్ లో పిల్లలను ఎక్కువగా మెప్పించే సినిమా
Movie Details
Movie Name: Adipurush
Release Date: 2023-06-16
Cast: Prabhas, Krithi Sanon, Sunny Singh, Dev Datta, Saif Ali khan
Director: Om Raut
Music: Ajay - Atul
Banner: T-Series
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer