'రామబాణం' - మూవీ రివ్యూ

Ramabanam

Movie Name: Ramabanam

Release Date: 2023-05-05
Cast: Gopichand, Dimple Hayathi, Jagapathi Babu, Khushboo, Tarun Arora, Nasar, Ali, Vennela Kishore
Director:Sriwass
Producer: Vishwa Prasad
Music: Mickey J Meyar
Banner: People Media Factory
Rating: 2.50 out of 5
  • మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'రామబాణం'
  • శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ చేసిన మూడో సినిమా
  • రొటీన్ గా అనిపించే కథాకథనాలు 
  • కనెక్ట్ కాలేకపోయిన ఫ్యామిలీ ఎమోషన్స్
  • కమెడియన్స్ ఎక్కువై కామెడీ తక్కువైన సినిమా

మొదటి నుంచి గోపీచంద్ యాక్షన్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆ యాక్షన్ ఎమోషన్స్ ను టచ్ చేసేలా చూసుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తూ వెళ్లాడు. అలా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆయనను మరింత చేరువ చేసిన సినిమాల జాబితాలో 'లక్ష్యం' .. 'లౌక్యం' వంటి సినిమాలు కనిపిస్తాయి. ఆ సినిమాలతో తనకి హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ చేసిన మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రామబాణం'. ఈ రోజున థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? .. లేదా? అనేది చూద్దాం.   

హైదరాబాద్ లో రాజారామ్ (జగపతిబాబు) సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలతో హోటల్ బిజినెస్ చేస్తుంటాడు. ఆయన హోటల్లో ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో ఉండటంతో మంచి డిమాండ్ ఉంటుంది. కెమికల్స్ ఎక్కువగా కలిసిన ఫుడ్స్ తో బిజినెస్ చేసే పాపారావు (నాజర్) అతని అల్లుడు జేకే (తరుణ్ అరోరా) రాజారామ్ కి తలనొప్పిగా తయారవుతారు. తన అన్నయ్యను బెదిరిస్తున్న పాపారావు అంతుచూడటానికి ప్రయత్నించిన విక్కీ( గోపీచంద్), రాజా రామ్ ఆగ్రహానికి గురవుతాడు. 

అలా 14 ఏళ్ల వయసులో కోపంతో ఇల్లు వదిలి కోల్ కత వెళ్లిన విక్కీని అక్కడ మాఫియాకి సంబంధించిన 'గుప్తా' చేరదీస్తాడు. గుప్తాకి కుడిభుజంలా ఉంటూ, మరో డాన్ అయిన ముఖర్జీ నుంచి తన బాస్ ను కాపాడుతూ విక్కీ భాయ్ గా ఎదుగుతాడు. ఆ సమయంలోనే ఆయన 'భైరవి' ( డింపుల్ హయతి) ప్రేమలో పడతాడు. విక్కీ కుటుంబ సభ్యులతో  మాట్లాడిన తరువాతనే అతనికి తన కూతురునిచ్చి వివాహం చేస్తానని భైరవి తండ్రి శుక్లా (సచిన్ ఖేడేకర్) చెబుతాడు. 

దాంతో 14 ఏళ్ల తరువాత  విక్కీ హైదరాబాద్ వెళతాడు. తన కుటుంబ సభ్యులను కలుసుకుంటాడు. తాను మాఫియాలో పనిచేస్తున్న విషయం రాజారామ్ కి తెలియకుండా దాచాలని విక్కీ అనుకుంటాడు. పాపారావు అల్లుడైన జేకే ద్వారా తనకి ఎదురవుతున్న సవాళ్లను గురించి తమ్ముడికి తెలియకుండా  చూడాలని రాజారామ్ భావిస్తాడు. కానీ రాజారామ్ ను జేకే రెచ్చగొడుతూ ఉంటాడు. కోల్ కత మాఫియా విక్కీని వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు అన్నదమ్ములు ఏం చేస్తారనేదే కథ.

ముందుగా మాట్లాడుకోవలసింది ఈ సినిమా నిర్మాణ విలువలను గురించి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు, ఖర్చుకు వెనుకాడలేదనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఖరీదైన కార్లు .. భవనాలు .. పాత్రల లైఫ్ స్టైల్ కి సంబంధించిన విషయాలు కథకి తగినట్టుగా ఉండేలా చూసుకున్నారు. అయితే ఈ స్థాయిలో ఖర్చు చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పుడు కాస్త కొత్త కథ తయారుచేసుకుని ఉంటే బాగుండేది. రొటీన్ కథను తీసుకొచ్చి రోట్లో పెట్టారు.

అన్నయ్య ఆశయం వేరు .. తమ్ముడు నడిచే మార్గం వేరు. మంచిని నమ్ముకున్న అన్నయ్యకి అన్యాయం చేయాలని కొంతమంది అవినీతిపరులు ప్లాన్ చేస్తారు. అలాంటివారి బారి నుంచి తన కుటుంబాన్ని ఆ తమ్ముడు కాపాడుకుంటాడు. ఇలాంటి పాయింట్ తో ఇంతకుముందు చాలానే కథలు వచ్చాయి. కాకపోతే అవి ఇంత రిచ్ గా ఉండకపోవచ్చు .. టేకింగ్ డిఫరెంట్ గా ఉండొచ్చు. 

కథ ఎంత రొటీన్ గా సాగుతుందో .. కథనం కూడా అంతే రొటీన్ గా నడుస్తుంటుంది. ఎక్కడా అనూహ్యమైన మలుపులు .. ఎలాంటి ట్విస్టులు లేవు. జగపతిబాబు - గోపీచంద్ పాత్రలను డిజైన్ చేసిన తీరు ఓకే. గోపీచంద్ పాత్ర వైపు నుంచి యాక్షన్ ఆకట్టుకున్నంతగా ఎమోషన్స్ పట్టుకోవు. డింపుల్ హయతి ఓవర్ మేకప్ ఇబ్బంది పెడుతుంది. నటన పరంగా ఆమె పాత్రకి స్కోప్ లేదు. పాటల సమయానికి ప్రత్యక్షమైపోతూ ఉంటుందంతే. 

 పవర్ఫుల్ విలన్ గా తరుణ్ అరోరా పాత్రను శ్రీవాస్ సరిగ్గా డిజైన్ చేయలేకపోయాడు. తన బలం సరిపోవడం లేదంటూ అతను కోల్ కత డాన్ ను రంగంలోకి దింపడం వలన, ఆ పాత్రకి ఉన్న వెయిట్ పడిపోయింది. జగపతిబాబు  భార్య పాత్రలో ఖుష్బూ ఓకే అనిపిస్తుంది. వెన్నెల కిశోర్ .. అలీ .. సప్తగిరి .. సత్య .. గెటప్ శీనులతో నవ్వించే ప్రయత్నం చేశారుగానీ వర్కౌట్ కాలేదు. వీళ్లందరి ట్రాక్ ను సరిగ్గా రాసుకోలేదనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. 

ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన పాటల్లో జానపద బాణీలో సాగే పాట మాత్రమే కాస్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. వెట్రి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. పాటలను .. ఫైట్స్ ను ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫరవాలేదు. కనల్ కన్నన్ - రామ్ లక్ష్మణ్ ఫైట్స్ మంచి మార్కులు కొట్టేస్తాయి. మధుసూదన్ సంభాషణలు అక్కడక్కడా మనసుకు తాకుతాయి. ఈ సినిమా 'లక్ష్యం' .. 'లౌక్యం' తరహాలో ఉంటుందని గోపీచంద్ - శ్రీవాస్ చెప్పారు కానీ, ఆ సినిమాలోని మేజిక్ ఈ సినిమాలో ఎంతమాత్రం కనిపించలేదని చెప్పచ్చు. 

ప్లస్ పాయింట్స్:
నిర్మాణ విలువలు .. గోపీచంద్ - జగపతిబాబు పాత్రలను డిజైన్ చేసిన తీరు .. భారీ యాక్షన్ సీన్స్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్:
కథలో ఎంతమాత్రం కొత్తదనం లేకపోవడం .. కథనం ఎలాంటి మలుపులు లేకుండా సాగడం .. పెద్దగా ఆకట్టుకొని పాటలు .. బలహీనమైన కామెడీ ట్రాక్. కనెక్ట్ కాలేకపోయిన ఎమోషన్స్.  పవర్ఫుల్ గా రాసుకోని విలన్ పాత్ర. సందేశం బలమైనదే అయినా ఆ స్థాయిలో దానిని ఆవిష్కరించలేకపోయిన విధానం.   

Trailer

More Reviews