'ప్రేమ' అనే రెండు అక్షరాలకు సరైన నిదర్శనాలు చూపించలేము .. నిర్వచనాలు చెప్పలేము. విడిపోతే బ్రతకలేనిది ప్రేమనో .. బ్రతుకున్నత వరకూ విడిపోలేనిది ప్రేమనో తేల్చి చెప్పడం చాలా కష్టం. పున్నమి వెన్నెల .. సముద్రం మాదిరిగా ప్రేమ కూడా ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది .. కొత్త అనుభూతులనే పంచుతుంది. అలాంటి ఒక ప్రేమకథనే 'సిరై'. క్రితం ఏడాది డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చిన ఈ తమిళ సినిమా, ఈ నెల 26వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీను (విక్రమ్ ప్రభు) ఓ పోలీస్ కానిస్టేబుల్. అబ్దుల్ (అక్షయ్ కుమార్) అనే ఒక ఖైదీని 'శివగంగై' కోర్టుకు తరలించవలసి వస్తుంది. శ్రీనుతో పాటు, పాండు - మురళి అనే కానిస్టేబుల్స్ కూడా ఖైదీతో పాటు ఒక బస్సులో బయల్దేరతారు. అబ్దుల్ ఒక మర్డర్ చేయడం వలన జైలుకు వస్తాడు. ఐదేళ్లుగా అతను కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తల్లి కూడా చనిపోవడంతో అనాథగా మిగిలిపోయిన అతణ్ణి జామీన్ పై బయటకి తీసుకుని వచ్చేవారు లేకుండా పోతారు.
తనని కోర్టుకు తీసుకుని వెళ్లే ముందు తనకి చేతికి గల బేడీలు తీసేయమని శ్రీనుని అబ్దుల్ కోరతాడు. హంతకులకు బేడీలు తీయకూడదని శ్రీను తేల్చి చెబుతాడు. అప్పటి నుంచి అబ్దుల్ ఆ పోలీసుల నుంచి తప్పించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితులలో ఒక 'ధాబా' దగ్గర బస్సును ఆపుతారు. అబ్దుల్ తో పాటు బస్సులో మురళి ఉండగా, హోటల్ బయట ఒక ప్రయాణీకుడితో పాండు గొడవ పడతాడు. బస్సులో నుంచి అది చూసిన మురళి అక్కడికి పెరిగెత్తుకు వెళతాడు.
అదే సమయంలో శ్రీను కూడా ఆ గొడవ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడి గొడవ సద్దుమణిగేలా చేస్తాడు. ఈ లోగా అబ్దుల్ ఉన్న బస్సు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన 'గన్' కూడా బస్సులోనే ఉండిపోయిందని శ్రీనుతో మురళి చెబుతాడు. దాంతో శ్రీను నివ్వెరపోతాడు. అబ్దుల్ ను వాళ్లు తిరిగి పట్టుకోగలుగుతారా? అతను హత్య చేసింది ఎవరిని? ఎందుకోసం హత్య చేశాడు? కోర్టు దగ్గర బేడీలు తీసేయమని అతను ఎందుకు రిక్వెస్ట్ చేశాడు? అనేది కథ.
నిజమైన ప్రేమ .. నిస్వార్ధమైన ప్రేమ .. నిజాయితీ కలిగిన ప్రేమ .. ఈ రోజులలో కనుమరుగవుతోంది. ఆకర్షణని ప్రేమ అనుకుని .. ఆ భ్రమలో బ్రతుకుతున్న జంటలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవసరాన్ని బట్టి పుట్టే ప్రేమలు, అవకాశాన్ని బట్టి మారిపోవడమే ఎక్కువగా అనుభవంలోకి వస్తుంటాయి. ట్రెండ్ కి తగినట్టుగానే ప్రేమ పేరుతో చాలా సినిమాలు తెరపైకి వస్తున్నాయి. అవసరమైన ఫీల్ లేకపోవడంతో రెండో రోజున అదృశ్యమైపోతున్నాయి.
అలాంటి ఈ ట్రెండులో వచ్చిన సినిమానే 'సిరై'. ఇది ఒక పల్లెటూరి ప్రేమకథ. తల్లికోసం జైలుపాలై, ప్రేమించిన అమ్మాయి కోసం విడుదల కావాలనుకునే ఒక హంతకుడి కథ. అతని విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూసే ఒక ప్రియురాలి కథ. వాళ్లకి అండగా నిలబడటం కోసం తన ఉద్యోగాన్ని .. అధికారాన్ని పక్కన పెట్టిన ఒక సాధారణ కానిస్టేబుల్ కథ. మనసున్న ప్రతి ఒక్కరినీ ఏడిపించే కన్నీటి కథ ఇది.
దర్శకుడు ఈ కథాకథనాలను డిజైన్ చేసుకున్న తీరు గొప్పగా అనిపిస్తుంది. ముగ్గురులు పోలీసులు ఒక హంతకుడిని వెంటబెట్టుకుని కోర్టుకు బయల్దేరుతారు. దార్లో ఏం జరుగుతుంది? ఆ యువకుడు ఎందుకు హత్య చేశాడు? ఎవరిని హత్య చేశాడు? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. ఆ సమయంలో ఆ నేరస్థుడి పట్ల పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో .. ప్రేక్షకులు కూడా అదే భావనతో ఉంటారు.
కథ కొంత దూరం వెళ్లిన తరువాత, ఆ యువకుడు ఆ కేసు నుంచి బయటపడాలి .. ప్రేమించిన అమ్మాయిని చేరుకోవాలి .. అందుకుగల అడ్డంకులు తొలగిపోవాలని దేవుళ్లకి దణ్ణాలు పెట్టుకోని ప్రేక్షకులు ఉండరు. అంత సహజంగా ఈ కథను .. పాత్రలను ప్రేక్షకుల హృదయాలకు సమీపంగా తీసుకుని వెళ్లిన దర్శకుడిని అభినందించకుండా ఉండలేం. 'మన కోసం ఎదురుచూసే మనిషి కోసం మనం బ్రతకాలి. మన కోసం బ్రతికే మనిషి కోసం మనం ఎంతకాలమైనా ఎదురుచూడాలి' అనే ఒకే ఒక లైన్ పై నడిచిన కథ ఇది.
నిజమైన నేరస్థులు శిక్షించబడాలి. కానీ అనుకోకుండా జరిగిన సంఘటనల వలన నేరస్థులుగా మిలిపోయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ .. జైళ్లలోనే మగ్గుతున్నారు. అలాంటివారికి తమ పరిస్థితిని చెప్పుకునే అవకాశం ఇవ్వాలి .. వినడానికి అధికారులు సమయం కేటాయించాలి అనే సందేశాన్ని ఇస్తూ సాగే ఈ కథ .. అందరినీ ఆలోచింపజేస్తుంది.
విలేజ్ నేపథ్యం .. ప్రేమజంట .. కులమతాల ప్రస్తావన .. కోర్టులు .. పోలీస్ వ్యవస్థ పనితీరును ప్రతిబింబిస్తూ నడిచే ఈ కథ, ఆడియన్స్ ను అలా కూర్చోబెడుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఆడియన్స్ ను టెన్షన్ పెట్టేస్తాయి. ఈ ప్రేమికులను కాపాడటానికి .. కలపడానికి మనమేం చేయగలం? అని ప్రతి ప్రేక్షకుడు ఆలోచించేలా చేస్తాయి.
పోలీస్ కానిస్టేబుల్ గా విక్రమ్ ప్రభు .. ఖైదీగా అక్షయ్ కుమార్ .. అతని ప్రియురాలిగా అనిష్మా నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. మాదేశ్ మాణిక్యం ఫోటోగ్రఫీ .. జస్టిన్ ప్రభాకరన్ నేపథ్య సంగీతం .. ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చాలా బాగుంది. ఎక్కడా అనవసరమైన సీన్ అనేది కనిపించదు.
కథ .. కథనం .. పాత్రలను డిజైన్ చేసిన విధానం .. సన్నివేశాలను ఆవిష్కరించిన విధానం .. నేపథ్య సంగీతం .. కెమెరా పనితనం .. ఇలా అన్నీ కుదిరిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో ఎమోషనల్ గా ఈ స్థాయిలో కనెక్ట్ అయ్యే సినిమా రాలేదనే చెప్పాలి.
'నిజమైన ప్రేమ కులమతాలు సృష్టించే అవరోధాలను అధిగమిస్తుంది .. కఠినమైన కాలాన్ని కూడా అది కరిగిస్తుంది' అని నిరూపించే సినిమా ఇది.
కంటతడి పెట్టించే ప్రేమకథ 'సిరై' (జీ 5) మూవీ రివ్యూ!
Sirai Review
-
Movie Details
Movie Name: Sirai
Release Date: 2026-01-23
Cast: Vikram Prabhu,LK Akshay Kumar,Anishma Anilkumar,Ananda Thambirajah,Harishankar Narayanan,Remya Suresh
Director: Suresh Rajakumari
Music: Justin Prabhakaran
Banner: Seven Screen Studio
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer