బలవంతుడు భయపెట్టి .. ధనవంతుడు బెదిరించి తాము అనుకున్నది సాధించగలుగుతారు. కానీ తమను ప్రేమించే మనసును మాత్రం వాళ్లు ఎప్పటికీ సొంతం చేసుకోలేరు అనే విషయాన్ని మరోసారి నిరూపించడానికి చేసిన ప్రయత్నమే 'రిప్పన్ స్వామి'. మనం ఏదైతే ఇస్తామో .. అదే మనకి తిరిగొస్తుందని చాటిచెప్పిన కన్నడ కథ ఇది. 

అది కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి ఆనుకుని ఒక ఎస్టేట్ ఉంటుంది. ఆ ఎస్టేట్ వ్యవహారాలను 'రిప్పన్ స్వామి' (విజయ్ రాఘవేంద్ర) చూసుకుంటూ ఉంటాడు. తన అన్నా వదినలు .. భార్య మంగళ (అశ్వని చంద్రశేఖర్)తో కలిసి అతను ఆ ఎస్టేట్ లో నివసిస్తూ ఉంటాడు. ఆ ఎస్టేట్ లోనే సుందర్ .. థామస్ .. మండా .. మురళి .. జన్నా పనిచేస్తూ ఉంటారు. ఇక రిప్పన్ స్వామికి కుడి భుజంగా సంతోష్ ఉంటాడు. అతని తల్లి శారద (యమున శ్రీనిధి) గతంలో అదే ఎస్టేట్ లో పని చేసి ఉంటుంది.

రిప్పన్ స్వామికి ఆవేశం ఎక్కువ. కొట్టిన తరువాత మాట్లాడటమే అతనికి అలవాటు. అతనితో మాట్లాడానికి కూడా అంతా భయపడుతూ ఉంటారు. తన అనుమతి లేకుండా ఎస్టేట్ లోకి ఎవరినీ అడుగుపెట్టనీయడు. డాక్టర్ చదివిన భార్యను సైతం అతను ఇంటికే పరిమితం చేస్తాడు. గతంలో కుప్పుస్వామి .. రిప్పన్ స్వామి ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. ఒకరిని దెబ్బతీయడానికి ఒకరు ఎదురుచూస్తుంటారు. 

ఈ నేపథ్యంలో ఆ ఊరుకి పోలీస్ ఆఫీసర్ గా అంజుమాల వస్తుంది. వచ్చిన రోజునే ఆమెకి ..రిప్పన్ స్వామికి మధ్య గొడవ జరుగుతుంది. రిప్పన్ స్వామికి కుడిభుజంగా ఉండే సంతోష్ కనిపించకుండా పోతాడు. రిప్పన్ స్వామి ఎస్టేట్ లో పనివాళ్లుగా ఉన్న సుందర్ టీమ్ ఆయనకి దూరమవుతుంది. అదే సమయంలో ఆనంద్ ను రిప్పన్ స్వామి తన ఎస్టేట్ కి పిలిపిస్తాడు.  ఆనంద్ ఎవరు? సంతోష్ ఏమైపోయాడు? రిప్పన్ స్వామికి పనివాళ్లు ఎందుకు దూరమయ్యారు? తన ఆవేశానికి రిప్పన్ స్వామి చెల్లించుకునే మూల్యం ఏమిటి? అనేది కథ.

ఈ కథ మహిషాసుర సంహారం నాటకంతో మొదలవుతుంది. ఆ తరువాత నుంచి ఎస్టేట్ చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు ఈ కథను డిజైన్ చేసుకున్న తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కథ ముందుకు వెళుతున్నా కొద్దీ ఆడియన్స్ లో సందేహాలు పెరుగుతూ వెళుతుంటాయి. రిప్పన్ స్వామి ఒక మృగంలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఆయన గతంలో ఏం జరిగింది? సంతోష్ కనిపించకుండాపోవడానికి కారణం ఏమిటి? అనే సందేహాలకు సమాధానాల కోసం ప్రేక్షకులు కుతూహలంతో వెయిట్ చేస్తూ ఉంటారు.
    
అయితే ఒక్కో విషయాన్ని రివీల్ చేస్తూ ఈ కథ ముందుకు వెళ్లే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం కనిపిస్తుంది. హీరో పాత్రతో పాటు తాగుబోతుల బ్యాచ్ ను ఆవిష్కరించిన విధానం మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. కథ నిదానంగా ప్రేక్షకులను తనలోకి లాగేసుకుంటుంది. సహజత్వంతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను కూడా భాగస్వాములను చేస్తాయి. సినిమాలో ఎక్కడా కూడా అనవసరమైన సీన్ అనేది కనిపించదు. 

కథకి తగిన లొకేషన్స్ ను సెట్ చేయడంలో దర్శకుడు చూపిన ప్రతిభ మనకి తెరపై కనిపిస్తూనే ఉంటుంది. కథకు ఈ లొకేషన్స్ మరింత బలాన్ని ఇచ్చాయని చెప్పచ్చు. ఫ్లాష్ బ్యాక్ కోసం చాలా తక్కువ సమయమే తీసుకున్నప్పటికీ, ఆ ఎపిసోడ్ కారణంగా మరింతగా కథా బలాన్ని పెంచిన తీరు మెప్పిస్తుంది. ఫస్టాఫ్ కంటే కూడా మరింత ఆసక్తికరంగా మారిపోయి సెకండాఫ్ పరిగెడుతుంది. 

 విజయ్ రాఘవేంద్ర నటన ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తుంది. ఆయన ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి. నడిచే దారిలో ముళ్లున్నా .. రాళ్లున్నా ఏరేస్తూ వెళ్లిపోవాలి. అలాగే తన దారికి ఎవరైనా అడ్డొస్తే తప్పించేస్తూ వెళ్లిపోవాలి అనే ఆలోచన కలిగిన మొరటు పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. ఇక తాగుబోతుల బ్యాచ్ నటన ఆకట్టుకుంటుంది. కథలో కీలకంగా కనిపిస్తూనే కామెడీ టచ్ ఇవ్వడం ఈ పాత్రల గొప్పతనంగా అనిపిస్తుంది.

రంగనాథ్ ఫొటోగ్రఫీ అందమైన దృశ్యాలను ఆవిష్కరించింది. ఎస్టేట్ లో ఛేజింగ్స్ .. ఫైట్స్ ను చిత్రీకరించిన తీరు మంచి మార్కులు కొట్టేస్తుంది. సామ్యూల్ నేపథ్య సంగీతం .. శశాంక్ నారాయణ ఎడిటింగ్, కథకు అదనపు బలంగా నిలవడం కనిపిస్తుంది.

ఎంతటి బలవంతుడినైనా బలహీనుడిగా మార్చే శక్తి కాలానికి మాత్రమే ఉంది. కాలం కనికరించని ఆ సమయంలో అతను ఒంటరిగా కూలిపోవలసిందే.. ఓడిపోవలసిందే అనే సందేశాన్ని ఇచ్చే కథ ఇది. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేని ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.