దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా కన్నడలో రూపొందిన సినిమా 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి'. అభిషేక్ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది నవంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 12వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది, కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 

కథ: కనక (దీక్షిత్ శెట్టి) తన స్నేహతులతో కలిసి చిన్నప్పుడు ఒక దొంగతనం చేస్తాడు. అప్పుడే అతనిపై 'దొంగ' అనే ముద్రపడుతుంది. ఎలాగో 'దొంగ' అనే కదా అంటున్నారని చెప్పి, అలా దొంగతనాలు చేయడం కంటిన్యూ చేస్తూ వెళతాడు. చిన్నాచితకా దొంగతనాలు ఎన్నాళ్లని చేస్తాం .. ఒక పెద్ద దోపిడీ చేసి, లైఫ్ లో సెటిలై పోవడమే బెటర్ అనే నిర్ణయానికి వస్తాడు. అందుకు మిగతా స్నేహితులు కూడా 'సై' అంటారు. 

అది ఎలక్షన్స్ సమయం కావడం వలన .. పట్నాల్లోని బ్యాంకులలో రిస్క్ ఎక్కువగా ఉండటం వలన, విలేజ్ లలో ఉండే బ్యాంకులోని డబ్బును కాజేయాలని ప్లాన్ చేస్తారు. 'భాగ్యలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు'ను ఎంచుకుంటారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఐదుగురు స్నేహితులు బ్యాంకులోకి జొరబడతారు. బ్యాంకు సిబ్బందినీ .. కష్టమర్లను భయపెడతారు. కొన్ని లక్షల క్యాష్ మాత్రమే ఉండటంతో నిరాశ చెందుతారు.

అయితే ఆ తరువాతనే వారు అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక సీక్రెట్ రూమ్ ను చూస్తారు. వందల కోట్ల రూపాయలు అక్కడ ఉండటం చూసి షాక్ అవుతారు. చిన్న విలేజ్ లోని ఒక బ్యాంకులో వందల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది వాళ్లకి అర్థం కాదు. ఆ డబ్బు ఎక్కడిది? అది తెలుసుకున్న కనక టీమ్ ఏం చేస్తుంది? ఆ దోపిడీతో లైఫ్ లో సెటిలైపోవాలనే వాళ్ల కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఒకప్పుడు తక్కువ బడ్జెట్ లో సినిమా అనగానే, తోట బంగ్లాలో దెయ్యం కథలను డిజైన్ చేసుకునేవారు. ఆ బంగళా చుట్టూనే కథ తిరుగుతూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కాస్త కొత్త మార్పులు వచ్చాయి. ఒక జైలు చుట్టూ .. ఆఫీస్ చుట్టూ .. షాపింగ్ మాల్ చుట్టూ కథలను తిప్పుతున్నారు. నాలుగు గోడల మధ్య .. పరిమితమైన పాత్రలతో కథను నడిపిస్తున్నారు.  అలా ఒక బ్యాంకు చుట్టూ తిరిగే కథ ఇది.

ఒక వైపున విలేజ్ లోని బ్యాంకులో దొంగల బ్యాచ్ .. ఒక వైపున పోలీసులు .. మరో వైపున రాజకీయ నాయకులు .. ఈ మూడు వైపుల నుంచి ఈ కథ రన్ అవుతూ ఉంటుంది. బ్యాంకులోని డబ్బుతో ఈ దొంగలు బయటపడతారా? అంత మొత్తం డబ్బును అక్కడ దాచిన అసలు దొంగలు ఎవరు? అనే విషయంపైనే ఆసక్తిని క్రియేట్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది.

కథగా చూసుకుంటే ఇది చాలా సింపుల్ లైన్ అనే చెప్పాలి. ఒక ట్విస్ట్ ఉంది .. అయితే ఆక్కడివరకూ వెళ్లేసరికి సమయం మించిపోయిందని చెప్పాలి. అప్పటివరకూ సిల్లీ కామెడీతో కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఆడియన్స్ ను నవ్వించడానికి దర్శకుడు చాలా పాట్లు పడ్డాడు. కానీ మనకైతే నవ్వురాదు. పోనీ తెరపై హీరో బ్యాచ్ కి ఏమైనా అవుతుందనే టెన్షన్ పడతామా అంటే అదీ లేదు. ఏదో అలా సాగిపోతూ ఉంటుంది అంతే.       

పనితీరు: దర్శకుడు ఈ కథను సీరియస్  గా చెప్పవలసిన చోట సీరియస్ గా చెప్పవలసింది. ఒక వైపున పోలీసులు .. రాజకీయనాయకులు .. మరో వైపున మీడియా  హడావిడి చేస్తుంటే, మరో వైపున బ్యాంకులో దొంగలు కామెడీ చేస్తుంటారు. ఏ ట్రాక్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. 

ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. నటీనటుల నటన గురించి మాట్లాడుకునే స్థాయిలో వాళ్ల పాత్రలు కనిపించవు. బలమైన కంటెంట్ లేకుండా నాలుగు గోడల మధ్య నడిచిన మరో కథగా మాత్రమే ఇది కనిపిస్తుంది. 

ముగింపు: ఇది విలేజ్ నేపథ్యంలో ఓ బ్యాంక్ చుట్టూ తిరిగే కథ. ఒక ట్విస్ట్ ను పట్టుకుని .. కామెడీని నమ్ముకుని ముందుకు వెళ్లారు. కామెడీ పేలకపోవడంతో .. పేలవమైన సన్నివేశాలతో అసహనాన్ని కలిగించే సినిమాగానే ఇది మిగిలిపోయింది.