రవితేజకి మాస్ ఇమేజ్ ఎక్కువ. తాను ఎంచుకునే కథలలో మాస్ అంశాలతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ .. కామెడీతో కూడిన రొమాన్స్ ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అలా ఈ సారి ఆయన చేసిన సినిమానే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. వినోదంతో ముడిపడిన కుటుంబ కథాచిత్రాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉన్న కిశోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.  

కథ: రామ్ సత్యనారాయణ (రవితేజ) తన బిజినెస్ కి సంబంధించిన ఒక విషయంపై, తన పీఏ లీలా (వెన్నెల కిశోర్)తో కలిసి స్పెయిన్ వెళతాడు. అక్కడ మానస శెట్టి (ఆషిక రంగనాథ్) ను పట్టుకుంటే తన బిజినెస్ కి హెల్ప్ అవుతుందని భావిస్తాడు. అయితే ఆమెకీ .. తనకి మధ్య విందా (సత్య) ఉన్నాడనే విషయం రామ్ సత్యనారాయణకు అర్థమవుతుంది. దాంతో తెలివిగా ప్లాన్ చేసి, సత్య పేరుతో మానసకి పరిచయమవుతాడు. విందా నిజస్వరూపం ఆమెకి తెలిసేలా చేసి, తన పట్ల ఆమెకి నమ్మకం కలిగేలా చేస్తాడు.

మానస అందంగా ఉండటంతో సత్య ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు. తనకి బాలామణి (డింపుల్ హయతి)తో పెళ్లైందనే విషయం చెప్పకుండా, మానసకి దగ్గరవుతాడు. తాను బిజినెస్ పనిపై వచ్చాననే విషయం కూడా చెప్పకుండా హైదరాబాద్ కి తిరిగి వచ్చేస్తాడు. రామ్ అంటే భార్య బాలామణికి విపరీతమైన ప్రేమ .. అంతకుమించిన నమ్మకం. భర్త అంటే ఎలా ఉండాలి?  అనే ప్రశ్నకి తన భర్తను సమాధానంగా చూపిస్తూ ఉంటుంది. పరస్త్రీల పట్ల ఆకర్షితులయ్యేవారిని ఆమె అసహ్యించుకుంటూ ఉంటుంది. 

తన పట్ల బాలామణికి గల విపరీతమైన నమ్మకాన్ని చూసినప్పుడల్లా రామ్ అపరాధనా భావానికి లోనవుతూ ఉంటాడు. ఆమెకి నిజం చెబితే ఏమైపోతుందోనని భయపడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితులలో తన బిజినెస్ కి సంబంధించిన పనిపై హైదరాబాద్ లో ఒక 10 రోజుల పాటు ఉండటానికి మానస వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? సత్య పేరుతో రామ్ ఆడిన నాటకం బయటపడుతుందా? మానస - బాలామణి వలన రామ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కథ. 

విశ్లేషణ: లవ్ .. కామెడీ .. రొమాన్స్ తో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ ను మిక్స్ చేస్తూ కథలను తయారు చేసుకోవడంలో కిశోర్ తిరుమలకి మంచి అనుభవం ఉంది. ఆ ట్రాక్ లో నుంచి ఏ మాత్రం పక్కకి వెళ్లకుండా ఆయన రెడీ చేసుకున్న కథనే ఇది. బలహీనమైన క్షణంలో తప్పు చేసిన ఒక భర్త,  అటు భార్య దగ్గర బయటపడిపోకుండా .. ఇటు తనని ఇష్టపడే అమ్మాయికి దొరికిపోకుండా తనని తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలతో ఈ కథ కనిపిస్తుంది. 

కిశోర్ తిరుమల గత సినిమాలను పరిశీలిస్తే, అవి ఆడియన్స్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యాయనే విషయాన్ని పక్కన పెడితే .. కొత్త పాయింట్ ఏదో చెప్పడానికి ట్రై చేయడం కనిపిస్తుంది. అలాంటి కిశోర్ తిరుమల ఈ సారి మాత్రం ఒక రొటీన్ లైన్ పట్టుకుని వచ్చేశాడు. భార్యకీ .. ప్రియురాలికి మధ్యలో నలిగిపోయే హీరో పాత్రతో రొటీన్ డ్రామా నడిపించాడు.

సాధారణంగా ఫస్టాఫ్ బ్యాంగ్ తరువాత, సెకండాఫ్ ఎలా ఉంటుందా అనే ఒక కుతూహలం ఆడియన్స్ లో ఉంటుంది. అందుకు తగినట్టుగానే రాకేశ్ శెట్టి (తారక్ పొన్నప్ప) ఎంట్రీ ఉంటుంది. అయితే ఆ పాత్ర చూపించే ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఫస్టాఫ్ లో కథ ఏ అంశాల చుట్టూ తిరిగిందో .. సెకండాఫ్ లోను అదే కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. రవితేజ హంగామాతో పాటు సునీల్ .. వెన్నెల కిశోర్ .. సత్య కామెడీ సందడి కాస్త కనిపిస్తుంది. కాకపోతే ప్రధానమైన కథనే రొటీన్ గా ఉండటం వలన అంతగా కిక్ ఇవ్వలేకపోయింది.

పనితీరు: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ను బట్టే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక ఫీలింగును తీసుకు రావడంలో కిశోర్ తిరుమల సక్సెస్ అయ్యాడు. అయితే రొటీన్ గా రాసుకోకుండా తన మార్క్ ఎంటర్టైన్ మెంటును సెట్ చేసుకోవలసింది. అలా చేయకపోవడం వలన, ఇల్లాలు - ప్రియురాలు తరహా కాన్సెప్టులన్నీ మన కళ్లముందు పరిగెడుతూ ఉంటాయి. 

రవితేజ తన మార్క్ జోష్ చూపించాడు. ఆషిక రంగనాథ్ - డింపుల్ హయతి అందంగా మెరిశారు.  సునీల్ .. వెన్నెల కిశోర్ .. సత్య కామెడీలో తమదైన మార్క్ చూపించారు. నిర్మాణ విలువల విషయంలో రాజీపడకపోవడం కనిపిస్తుంది. పాటల చిత్రీకరణలో ప్రసాద్ మూరెళ్ల ఫొటోగ్రఫీలోని గొప్పతనం మరింత కనిపిస్తుంది. భీమ్స్ బాణీలు హుషారుగా కొనసాగాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. 

ముగింపు: ఇల్లాలికి .. ప్రియురాలికి మధ్య నలిగిపోయే ఒక భర్త కథ ఇది. కామెడీతో కాలక్షేపం చేయించడానికి ప్రయత్నం చేసినప్పటికీ, ఇది ఒక రొటీన్ కథగానే ఆడియన్స్ ను అసంతృప్తికి గురిచేస్తుంది.