అంకిత్ కొయ్య - నీలఖి జంటగా నటించిన ప్రేమకథా చిత్రమే 'బ్యూటీ'. జెఎస్ ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా, జనవరి 2వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ డ్రామాగా సాగే ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.
కథ: నారాయణ (నరేశ్) జానకీ (వాసుకీ) భార్యాభర్తలు. వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ల కూతురే అలేఖ్య (నీలఖి). వైజాగ్ లో నారాయణ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ, అలేఖ్యను ఇంటర్ చదివిస్తూ ఉంటాడు. అలేఖ్య అంటే అతనికి ప్రాణం .. అందువలన ఆమె అడిగినవన్నీ కొనిస్తూ ఉంటాడు. ఆర్ధికపరమైన ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ, తన కష్టం కూతురికి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఉంటాడు.
నారాయణ భార్య జానకీ కూడా ఉన్నదాంట్లో సర్దుకుపోతూ ఇల్లు గడుపుతూ ఉంటుంది. కొత్త మోపెడ్ కొనాలని అలేఖ్య తండ్రిని పోరుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలోనే ఆమెకి అర్జున్ (అంకిత్ కొయ్య)తో పరిచయమవుతుంది. అలేఖ్యకు మోపెడ్ నేర్పే సాకుతో ఆమెకి అర్జున్ మరింత చేరువవుతాడు. అలా వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఒక రోజున ఆమె అర్జున్ తో వీడియో కాల్ మాట్లాడుతూ తల్లికి దొరికిపోతుంది. తల్లి మందలించడంతో, తండ్రికి కూడా తెలిసిపోతుందని భయపడుతుంది. అర్జున్ తో కలిసి హైదరాబాద్ వెళ్లిపోతుంది.
ఇదిలా ఉండగా వైజాగ్ లోనే రోహిత్ అనే ఒక రౌడీ ఉంటాడు. అతను ప్రేమ పేరుతో అమ్మాయిలను వలలో వేసుకుని, వారికి సంబంధించిన వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. వాళ్ల నుంచి డబ్బు .. బంగారం లాగుతూ ఉంటాడు. అలాంటి రోహిత్ కన్ను, అలేఖ్యపై పడుతుంది. దాంతో అతను ఆమెను ఫాలో అవుతూ, ఆ ప్రేమజంటతో హైదరాబాద్ చేరుకుంటాడు. తన కూతురును వెతుక్కుంటూ నారాయణ కూడా హైదరాబాద్ వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? నారాయణ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: మిడిల్ క్లాస్ వారు తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలను గురించి చాలా భయపడుతుంటారు. తమ పిల్లలు ఎదిగిన తరువాత వాళ్ల కారణంగా తమ పరువు ప్రతిష్ఠలు ఎక్కడ దెబ్బతింటాయోనని ఆందోళన చెందుతుంటారు.పెంపకం బాగుంటే పరువు ప్రతిష్ఠలను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో, వాళ్లకి ఏ లోటూ రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఆనందంలోను .. బాధలోను తాము ఉన్నామనే ఒక భరోసాను కల్పిస్తుంటారు.
అయితే తలిదండ్రులు ఎంతో కష్టపడి నిర్మించిన కంచెను దాటుకుని పిల్లలు బయటికి వచ్చేలా చేసే దుర్మార్గులు సమాజంలో అదే పనిగా తిరుగుతుంటారు. అలాంటి వారి బారి నుంచి ఒక తండ్రి తన కూతురును ఎలా కాపాడుకున్నాడనేదే ఈ సినిమా కథ. సాధారణంగా పిల్లలు తప్పుచేసి భయపడుతుంటారు. అయితే కొంతమంది పిల్లలు భయంతో తప్పులు చేస్తారనే పాయింట్ ను టచ్ చేసి, ఈ కథకు కొత్తదనాన్ని తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
'నువ్వు నడిచే మార్గం సరైనది కానప్పుడు, అది తప్పకుండా నిన్ను తప్పుడు గమ్యానికే చేరుస్తుంది' అనే ఒక సందేశాన్ని ఇచ్చే సినిమాగా 'బ్యూటీ'ని గురించి చెప్పుకోవచ్చు. ఇల్లు అనేది ఒక దేవాలయం .. దానిని పంజరంగా భావించి బయటపడాలని చూస్తే ఏమౌతుందనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. చిన్న సినిమానే అయినా .. అబ్బురపడేంత కొత్తదనం లేకపోయినా .. పెర్ఫెక్ట్ కంటెంట్ గా అనిపిస్తుంది.
పనితీరు: ఈ కథను ఇటు వైజాగ్ .. అటు హైదరాబాద్ నేపథ్యంలో దర్శకుడు డిజైన్ చేసుకున్నాడు. పరిమితమైన పాత్రలతోనే ఈ కథను నడిపించాడు. ఆ పాత్రలకు కూడా అవసరమైనంత వరకే అవకాశం ఇచ్చాడు. చివరి 30 నిమిషాలలో వచ్చే ట్విస్ట్ కథను మరింత బలోపేతం చేస్తుంది. ఎక్కడా అతికించినట్టు కాకుండా, అక్కడక్కడా ఎమోషన్స్ ను తట్టి లేపుతూ కన్నీళ్లు పెట్టిస్తుంది.
సుబ్రహ్మణ్యం అందించిన కథ - స్క్రీన్ ప్లే, వర్ధన్ టేకింగ్ బాగున్నాయి. సాయికుమార్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. 'కన్నమ్మా .. కన్నమ్మా', అనే పాట మనసుకు హత్తుకుంటుంది. మిగతా బాణీలు కూడా వినసొంపుగా అనిపిస్తాయి. ఉద్ధవ్ ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. సంభాషణలు కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి.
ముగింపు: బంధాలను అర్థం చేసుకోవడంలో .. అనుబంధాలకు విలువనీయడంలోనే అసలైన 'బ్యూటీ' ఉందని చాటిచెప్పిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది.
'బ్యూటీ' (జీ 5) మూవీ రివ్యూ!
Beauty Review
- సెప్టెంబర్ లో విడుదలైన సినిమా
- ఈ నెల 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- మిడిల్ క్లాస్ జీవితాలను ప్రతిబింబించే కథ
- సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు
- ఫ్యామిలీతో కలిసి చూడవలసిన కంటెంట్
Movie Details
Movie Name: Beauty
Release Date: 2026-01-02
Cast: Ankith Koyya,Nilakhi Patra,Naresh ,Vasuki Anand,Prasad Behara,Nithin Prasanna
Director: J S S Vardhan
Music: Vijai Bulganin
Banner: Vanara Celluloid
Review By: Peddinti
Trailer