ఒక వైపున థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సిరీస్ లు .. మరో వైపున యథార్థ సంఘటనల స్పూర్తితో రూపొందుతున్న సిరీస్ లతో పాటు అప్పుడప్పుడూ స్పోర్ట్స్ నేపథ్యంతో కూడిన సిరీస్ లు కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చేస్తున్నాయి. అలా వచ్చిన సిరీస్ గా 'ఎల్బీ డబ్ల్యూ' కనిపిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో నడిచే ఈ సిరీస్ లో విక్రాంత్ ప్రధానమైన పాత్రను పోషించాడు. ఈ నెల 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో 8 ఎపిసోడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

కథ: రంగన్ (విక్రాంత్) మంచి క్రికెటర్. అయితే కొన్ని కారణాల వలన అతను ఆశించిన స్థాయికి చేరుకోలేకపోతాడు. 'ముత్తునగర్ క్రికెట్ అకాడమీ'లో కోచ్ గా పనిచేస్తూ ఉంటాడు. సరైన జాబ్ .. సొంత ఇల్లు లేని కారణంగా అతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. 37 ఏళ్లు వచ్చేయడంతో, ఇక తనకి పెళ్లి కావడం కష్టమని భావిస్తాడు. తాను పనిచేస్తున్న క్రికెట్ అకాడమికి మంచి పేరు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. 

ఈ నేపథ్యంలో వేరు వేరు ప్రాంతాలకి చెందిన మణికంఠ .. తంగం .. రిషి .. లారా .. పాండు .. థియా ఆ అకాడమీలో చేరతారు. రిషి తన తండ్రి పట్ల కోపంగా ఉంటాడు. అయితే అందుకు కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు. వాళ్లందరికీ కూడా రంగన్ శిక్షణను ఇవ్వడం మొదలుపెడతాడు. అయితే అక్కడ స్టూడెంట్స్ మధ్య సీనియర్స్ .. జూనియర్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. దాంతో ఆ రెండు వర్గాల మధ్య సమయం దొరికినప్పుడల్లా వార్ నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మణికంఠ - తంగం లవ్ లో పడతారు.

రంగన్ ఓ క్రికెటర్ గా తాను ఆశించిన స్థాయికి ఎందుకు వెళ్లలేకపోతాడు? అతని గతంలో జరిగిందేమిటి? అకాడమీకి మంచి పేరు తీసుకురావాలనే ఆయన కోరిక నెరవేరుతుందా? రిషికి తన తండ్రి అంటే కోపం దేనికి? అందుకు కారణమైన సంఘటన ఏమిటి?  మణికంఠ - తంగం ప్రేమకథ ఏ తీరానికి చేరుకుంటుంది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: కాలేజ్ .. కాలేజ్ హాస్టల్ నేపథ్యంలో నడిచే కథలు గతంలో చాలానే వచ్చాయి. అలాగే ఇది క్రికెట్ అకాడమీ నేపథ్యం చుట్టూ అల్లుకున్న కథ. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న కొంతమంది యువతీ యువకులు ఈ అకాడామిలో చేరతారు. ఫ్యామీలితో వాళ్ల బాండింగ్ .. హాస్టల్ లోని వాళ్ల లైఫ్ స్టైల్ .. లవ్ .. ఎమోషన్ .. ఫ్రెండ్షిప్ కి సంబంధించి ఈ కథను డిజైన్ చేసుకున్నారు. క్యాంపస్ లో ర్యాగింగ్ .. క్యాంటీన్ లో కబుర్లతో ఈ సహజత్వాన్ని తీసుకురావడానికి ట్రై చేశారు. 

ఈ కథ చాలావరకూ క్రికెట్ అకాడమీ చుట్టూనే తిరుగుతుంది. ఇలా ఒకే చోటున తిరిగే కథలను బోర్ కొట్టకుండా ముందుకు తీసుకుని వెళ్లడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. అన్ని వైపుల నుంచి ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ మెంట్ ను పడేస్తేనే తప్ప, ఆడియన్స్ ను కూర్చోబెట్టడం కష్టం. కానీ ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చిన 8 ఎపిసోడ్స్ లో కథ పెద్దగా నడవలేదు. రొటీన్ సన్నివేశాలతో అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది.

వరుసగా పాత్రలైతే చకచకా వచ్చి చేరతాయి. కానీ ఆ పాత్రల వైపు నుంచి ట్రాకులు .. అందుకు సంబంధించిన ఎమోషన్స్ ను కనెక్ట్ చేసే ప్రయత్నాలైతే ఈ 8 ఎపిసోడ్స్ లో జరగలేదు. సాదా సీదా సన్నివేశాలతోనే ఈ కథ ముందుకు వెళుతుంది. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేసిన సన్నివేశాలైతే ఇంతవరకూ తగల్లేదు. రానున్న ఎపిసోడ్స్ ను కూడా ఈ స్థాయిలో సాగదీస్తే కష్టమే మరి. 

పనితీరు
: ఈ సిరీస్ కి సంబంధించి అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతానికి 8 ఎపిసోడ్స్ మాత్రమే. ఇంతవరకూ అయితే ఈ కథను చాలా నిదానంగా .. నింపాదిగా నడిపిస్తూ వెళ్లారు. ఎపిసోడ్ .. ఎపిసోడ్ కి కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లే ప్రయత్నం ఏ మాత్రం జరగలేదనే అనిపిస్తుంది. రానున్న మలుపులకు సంబంధించిన సంకేతాలు కనిపించకపోవడం మరింత నిరాశపరిచే విషయం. 

ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వర్క్ నీట్ గానే అనిపిస్తాయి. కాకపోతే వాటి పనితీరును పూర్తిస్థాయిలో ఆవిష్కరించే స్థాయి సన్నివేశాలు ఇంకా రాలేదు. క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ పాత్రలలో, కుర్రాళ్లంతా కూడా చాలా సహజంగా చేశారు. 

ముగింపు: క్రికెట్ నేపథ్యంలో నడిచే ఈ కథ ఇది. మొత్తం 40 ఎపిసోడ్స్ ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అందుబాటులోకి వచ్చినవి 8 మాత్రమే. ఇంతవరకూ వదిలిన ఎపిసోడ్స్ ప్రేక్షకులను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయనే చెప్పాలి. ఇలా కథను నానుస్తూ చెప్పే విధానానికి మున్ముందు స్వస్తి పలుకుతారేమో చూడాలి.