ప్రస్తుతం తమన్నా ఒక వైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ఆమె గట్టిగానే ట్రై చేస్తోంది. అలా ఆమె హిందీలో చేసిన నాయిక ప్రధానమైన సినిమానే ' బబ్లీ బౌన్సర్'. వినీత్ జైన్ - అమృత పాండే సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ వారు తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమాను నేరుగా స్ట్రీమింగ్ చేశారు.
కథలోకి వెళితే .. ఢిల్లీకి సమీపంలో రెండు గ్రామాలు ఉంటాయి. ఆ రెండు గ్రామాలలోను పహిల్వాన్ లు ఎక్కువ. స్థానికంగా ఉండే కుర్రాళ్లంతా వాళ్ల దగ్గరే శిక్షణ తీసుకుని, ఢిల్లీలోని పలు సంస్థలలో బౌన్సర్లుగా పనిచేస్తుంటారు. ఒక గ్రామానికి చెందిన పహిల్వాన్ కూతురే బబ్లీ (తమన్నా). చదువు పట్ల పెద్దగా ఆసక్తి లేని బబ్లీ .. పదో తరగతి తప్పుతుంది. అప్పటి నుంచి ఆమె ఒక మగరాయుడిగా మాదిరిగానే ఆ ఊళ్లో తిరుగుతూ ఉంటుంది. అదే గ్రామానికి చెందిన బౌన్సర్ కుక్కూ (సాహిద్ వైద్) ఆమెను ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనేదే ఆయన ఆశ .. ఆశయం.
అలాంటి పరిస్థితుల్లోనే ఆ ఊరి టీచర్ కొడుకైన విరాజ్ (అభిషేక్ బజాజ్) వస్తాడు. లండన్ లో చదువు పూర్తిచేసిన విరాజ్, ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉంటాడు. తొలి చూపులోనే విరాజ్ పట్ల బబ్లీ మనసు పారేసుకుంటుంది. లేడీస్ తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆయన ఆలోచనా విధానం ఆమెకి బాగా నచ్చుతుంది. ఆయనకి దగ్గర కావడం కోసం తాను కూడా ఏదైనా జాబ్ చేయాలనుకుంటుంది. అదే సమయంలో ఆమెకి కుక్కూతో పెళ్లి మాటలు కూడా జరిగిపోతాయి. ఢిల్లీలో ఉంటే విరాజ్ కి మరింత చేరువ కావొచ్చనే ఉద్దేశంతో, కుక్కూతో పెళ్లికి ఒప్పుకున్నట్టుగా నటిస్తూ, ఢిల్లీలో అతను పనిచేసే క్లబ్ లో బౌన్సర్ గా చేరుతుంది.
అక్కడ వాతావరణం కాస్త కొత్తగా .. ఇబ్బందిగా అనిపించినా, తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకుని వెళ్లడం కోసం భరిస్తుంది. విరాజ్ పుట్టినరోజు సందర్భంలో తన ప్రేమ విషయం చెప్పేసి .. పెళ్లి చేసుకుందామని అంటుంది. చదువు సంధ్యలు లేవు .. సిటీ కల్చర్ తెలియదు .. అలాంటి ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన తనకి ఎంతమాత్రం లేదు అనే విషయాన్ని విరాజ్ తేల్చి చెప్పేస్తాడు. దాంతో ఆమె ఆత్మాభిమానం దెబ్బతింటుంది. అతని ప్రేమ కోసం అనేక కష్టాలు పడుతూ వచ్చిన బబ్లీ అప్పుడు ఏం చేస్తుంది? ఆ తరువాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.
మధుర్ భండార్కర్ నుంచి ఇంతకు ముందు చాలా మంచి సినిమాలే వచ్చాయి. అలాంటి ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎలాంటి ప్రత్యేకతలు .. మరెలాంటి విశేషాలు కనిపించవు. కథాకథనాలు చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటాయి. ఎక్కడ .. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఎక్కడా కలగదు. హిందీ సీరియల్స్ తరహాలోనే ఈ కథ నడుస్తుంది తప్ప .. ఒక సినిమాగా మాత్రం అనిపించదు. ఒక పల్లె పిల్ల .. పట్నం కుర్రాడు .. అతగాడిని ఆమె లవ్ చేయడం .. అతను నో చెప్పడం తరహాలో గతంలో చాలానే కథలు వచ్చాయి. ఎటొచ్చి బౌన్సర్ నేపథ్యమే కాస్త కొత్తగా అనిపిస్తుందంతే.
టైటిల్ కి తగినట్టుగానే ఈ కథ అంతా కూడా తమన్నా చుట్టూనే తిరుగుతుంది. బౌన్సర్ కి కావలసిన ఫిట్ నెస్ తో తమన్నా ఆ పాత్రకి కరెక్టుగా సెట్ అయింది. పల్లెటూరి పిల్ల మాదిరిగా మాస్ లుక్ తో మెప్పించింది. గ్లామర్ పరంగా .. నటన పరంగా తమన్నాకి వంకబెట్టవలసిన అవసరం లేదు. తమన్నా పాత్ర సంగతి పక్కన పెడితే, క్రేజ్ పరంగా ఆమెకి తగిన జోడీనే హీరోగా పెట్టాలి. కానీ అభిషేక్ బజాజ్ ఎవరనేది పెద్దగా తెలియదు. అందువలన లవ్వంటూ అతని వెంట తమన్నా పడటమనేది చూసేవారికి కనెక్ట్ కాదు. సంగీతం .. ఫొటోగ్రఫీ పరంగా ఫరవాలేదు.
తమన్నా పాత్రనే ప్రధానంగా చేసుకుని ఆమెకి సంబంధించిన లైన్ పైనే చివరివరకూ వెళ్లారు. అందువలన ఇతర పాత్రలకి అంత ప్రాధాన్యత ఏమీ కనిపించదు. కథ కూడా నిదానంగా నడుస్తూ సహనానికి పరీక్షపెడుతుంది. ఎక్కడ ఎలాంటి ట్విస్టులు ఉండవు. సాధారణ ప్రేక్షకుడు కూడా కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చెప్పేయగలడు. పాటల పరంగా చూసుకున్నా, ఓటీటీ కోసమే ఈ సినిమాను చేశారేమోనని అనిపించకమానదు. ఓటీటీలో వదలడమే కరెక్టు కూడా. ఎందుకంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఓపికతో ఈ కథను ఫాలో కాలేరు.
ఓటీటీ రివ్యూ: 'బబ్లీ బౌన్సర్'
Babli Bouncer Review
- తమన్నా ప్రధానమైన పాత్రగా 'బబ్లీ బౌన్సర్'
- దర్శకుడిగా మధుర్ భండార్కర్ రూపొందించిన సినిమా
- ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
- నిదానంగా నడిచే కథాకథనాలు
- సీరియల్ మాదిరిగా అనిపించే సినిమా
Movie Details
Movie Name: Babli Bouncer
Release Date: 2022-09-23
Cast: Tamannah, Abhishek Bajaj, Sahil Vaid
Director: Madhur Bhandarkar
Music: Tanishk Bagchi
Banner: Star Studios
Review By: Peddinti