రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందిన రెండో సినిమా 'మోగ్లీ'. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, విశ్వప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 13వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 1వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. బండి సరోజ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అడవిని ఆనుకుని ఉన్న చిన్న పల్లెటూరు 'పార్వతీపురం'. అక్కడే మురళీకృష్ణ (రోషన్ కనకాల) నివసిస్తూ ఉంటాడు. అనాథ అయిన అతను ఆ ఊరునీ .. అక్కడి అడవిని నమ్ముకుని జీవిస్తూ ఉంటాడు. అందువలన అతనిని అందరూ 'మోగ్లీ' అని పిలుస్తుంటారు. పోలీస్ ఆఫీసర్ కావాలనేది అతని కల. ఆ ప్రాంతంలో అడపాదడపా సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిలో జూనియర్ ఆర్టిస్ట్ గా మోగ్లీ నటిస్తుంటాడు.

ఒకసారి ఆ ప్రాంతంలో జరుగుతున్న సినిమా షూటింగులో జూనియర్ ఆర్టిస్టుగా జాస్మిన్ (సాక్షి మడోల్కర్) నటిస్తూ ఉంటుంది. అయితే అందరిలా ఆమె వినలేదు .. మాట్లాడలేదు. ఆమెపై మోగ్లీ మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతనిని ఆరాధించడం మొదలుపెడుతుంది. అయితే జాస్మిన్ పై ఆ సినిమా హీరో 'విరాజ్' కన్నేస్తాడు. ఆమెను వశపరచుకోవాలంటే మోగ్లీ మనసు విరిచేయాలని నిర్ణయించుకుంటాడు. 

 జాస్మిన్ ను దక్కించుకోవడానికి విరాజ్ తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఉండగా, కొత్తగా మరో పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అతనే పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ (బండి సరోజ్ కుమార్). అతను కూడా జాస్మిన్ ను చూడగానే, ఆమెను వశపరచుకోవాలని అనుకుంటాడు. అటు డబ్బు .. ఇటు అధికారం ఉన్న ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి జాస్మిన్ ను మోగ్లీ ఎలా రక్షించుకుంటాడు? అందుకోసం ఏం చేస్తాడు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: లవ్ .. ఎమోషన్ .. యాక్షన్ నేపథ్యంలో దర్శకుడు రాసుకున్న కథ ఇది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోని ఒక యువకుడు, తనని ప్రేమిస్తున్న అమ్మాయినే తన ప్రపంచంగా భావిస్తాడు. అలాంటి ప్రేమను తన నుంచి దూరం చేయడానికి, డబ్బు - అధికారం ఉన్నవారు ప్రయత్నిస్తే ఆ యువకుడు ఎలా రియాక్ట్ అయ్యాడనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

'మోగ్లీ' అనేది అందరికీ బాగా తెలిసిన పేరు. అందువలన ఈ టైటిల్ చాలా ఫాస్టుగా జనంలోకి వెళ్లిపోయింది. టైటిల్ కి తగినట్టుగానే ఈ కథ ఫారెస్టు నేపథ్యంలో నడుస్తుంది. అయితే అక్కడ కూడా సినిమాలు .. షూటింగులు .. జూనియర్ ఆర్టిస్టులు అంటూ మరో ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఫస్టాఫ్ అంతా కూడా ఇలా కాస్త డల్ గానే ఈ కథ కొనసాగుతుంది. ఇక సెకండాఫ్ నుంచి కథ కాస్త పుంజుకుంటుందిగానీ, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది.

ఈ కథ అలా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడా కొత్తదనమనేది కనిపించదు. అలాగే ప్రేక్షకులలో కుతూహలాన్ని పెంచే మలుపులు .. ట్విస్టులు మనకి కనిపించవు. అక్కడక్కడా ఇచ్చిన  ఎమోషనల్ టచ్ బాగుందనిపిస్తుంది. ఈ కథకు లొకేషన్స్ అదనపు బలాన్ని తీసుకొచ్చాయనే చెప్పాలి.  క్లైమాక్స్ కాస్త డిఫరెంట్ గా అనిపించినప్పటికీ, అది కూడా కొంతమందికే కనెక్ట్ అవుతుందేమోనని అనిపిస్తుంది.

పనితీరు: అడవి .. దానిని ఆనుకుని కనిపించే విలేజ్ .. అక్కడ జరిగే లవ్ స్టోరీ .. ఇలా చెప్పుకోవడానికి చాలా అందంగా అనిపిస్తుంది. కానీ ఆ స్థాయి ఆవిష్కరణ జరగలేదనే భావన కలుగుతుంది. రోషన్ కనకాల .. బండి సరోజ్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది. రామమూర్తి ఫొటోగ్రఫీ బాగుంది. కాలభైరవ నేపథ్య సంగీతం ఫరవాలేదు. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. 

ముగింపు: ధనవంతుడు .. బలవంతుడు తాము తలచుకున్నది చేయగలమని మిడిసిపడుతూ ఉంటారు. అలాంటివారిపై ఒక ప్రేమికుడు తిరగబడితే ఎలా ఉంటుందనే లైన్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే అందుకు సంబంధించిన ఆవిష్కరణ ఆసక్తిని రేకెత్తించేలా లేకపోవడమే లోపం. రొటీన్ గా నడిచే కథాకథనాలు కూడా నిరాశ పరుస్తాయి.