గ్రామీణ ప్రేమకథలకు తెలుగుతెరపై ఎప్పూడు ఆదరణ ఉంటుంది. సహజత్వంతో తెరకెక్కిన పల్లెకథలు ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఇప్పుడు ఈ కోవలోనే రూపొందిన చిత్రం 'దండోరా'. ట్రైలర్‌తో అందర్ని ఆలోచింపజేసిన ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏమిటి?  ఈ క్రిస్మస్‌కు విడుదలైన ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? ఈ గ్రామీణ ప్రేమకథలోని ఎమోషన్స్‌ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకున్నాయా? లేదా అనేది ఈ చిత్ర సమీక్షలో తెలుసుకుందాం. 

కథ: ఈ మధ్య కాలంలో కులవివక్షపై చాలా ప్రేమకథలు వచ్చాయి. ఆ కోవలోనే కుల వివక్ష నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. కుల వివక్ష విస్తరించుకున్న తెలంగాణలోని ఓ ఊరిలో ఓ పెద్ద కులానికి చెందిన మోతుబరి శివాజీ (శివాజీ) కూడా ఈ వివక్షకు గురవుతాడు. సొంత కొడుకు విష్ణు (నందు)తోనూ కొన్ని కారణాల వల్ల మాటలుండవు. ఆయన చనిపోయినా తన కులానికి చెందిన శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు చేయడానికి వీల్లేదని పెద్దలు షరతులు పెడతారు. అగ్ర కులానికి చెందిన మోతుబరి శివాజీని కుల పెద్దలు కుల బహిష్కరణ చేయడానికి కారణం ఏమిటి? ఆయనకు  శ్రీలత (బిందు మాధవి)కి మధ్య ఉన్న రిలేషన్‌ ఏమిటి? ఊరిలో తక్కువ కులానికి చెందిన వ్యక్తి రవి(రవికృష్ణ)ని హత్య చేసిందెవరు? ఈ హత్య తరువాత చోటు చేసుకున్న పరిణామాలేమిటి? ఈ కథకు ఊరి సర్పంచ్ (నవదీప్‌)కు ఉన్న సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: సాధారణంగా ఇలాంటి రూటెడ్‌ కథలు, సొసైటీని ప్రశ్నించే కథలు, కుల వివక్షలు, అసమానతలు ఇలాంటి సమస్యల్ని చూపిస్తూ తమిళ, మలయాళంలో చాలా సినిమాలొచ్చాయి. తమిళ దర్శకులు ఇలాంటి కథలను చాలా లోతుగా విశ్లేషిస్తూ తెరకెక్కిస్తుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ మన దర్శకులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పలాస 1978, లవ్‌స్టోరీ, కోర్టు చిత్రాల్లో కుల వివక్షతో పాటు సమాజంలో ఉన్న అసమానతలను ప్రశ్నిస్తూ సినిమాలు రూపొందించారు.అయితే దర్శకుడు మురళీ కాంత్‌ కూడా తన మొదటి చిత్రంతో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే ఇంతకు ముందు సినిమాల బాటలో కాకుండా దండోరా దర్శకుడు కొత్త కోణంలో ఈ సమస్యను ప్రజెంట్‌ చేశాడు. 

ఆయన ఇన్నోవేటివ్‌ స్టోరీ టెల్లింగ్‌ ఈచిత్రానికి ప్రధాన బలం. సాధారణంగా కుల వివక్షకు, అసమానతలకు గురైన బాధితుల కోణం నుంచే ఇప్పటి వరకు సినిమాలొచ్చాయి. కానీ ఈ చిత్రంలో అలాంటి చర్యలకు పాల్పడిన కుటుంబాలు కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి? ఆ కుటుంబం సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది?  ఆ కుటుంబ సభ్యుల వేదన ఎలా ఉంటుంది? అనే విషయాల్ని దర్శకుడు ఎంతో ఆలోచనాత్మకంగా, అందరి హృదయాలను హత్తుకునేలా ఈ సినిమాలో చెప్పాడు. అంతేకాదు అగ్రకులాల్లో ఉండే ఆధిపత్యాన్ని ఆ కుటుంబాల్లోని వ్యక్తుల మనోవేదన, కులపెద్దలను ఎదిరించలేదని నిస్సహాయతను చూపించిన విధానం కూడా ఆకట్టుకుంది. 

ఈ సినిమా తొలి సన్నివేశం నుంచే దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయంపై క్లారిటీగా ఉన్నాడు అనే భావన కలిగింది. ప్రతి సన్నివేశాన్ని లోతుగా, ఎమోషన్‌తో చూపించడంతో ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. అయితే సెకండాఫ్‌లో కాసింత సాగదీతగా అనిపిస్తుంది. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నట్లుగా కొన్ని సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. అలాంటి సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా తెరకెక్కిస్తే బాగుండేది. ఇలాంటి రూటెడ్‌ కథకు వాణిజ్య అంశాలు జోడించాలంటే స్క్రీన్‌ప్లేలో ఓ మ్యాజిక్‌ ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు కాస్త తడబడినట్లుగా అనిపించింది. శివాజీ పాత్రలో భావోద్వేగాలు బలంగా పండలేదు. అయితే ఒక సన్నివేశంలోని లోపం మరో సన్నివేశంలోని బలం కాపాడింది. ముఖ్యంగా ఈ సినిమాకు పతాక సన్నివేశాలు ప్రాణంగా నిలిచాయి. 

నటీనటుల పనితీరు: ఈ సినిమాకు దర్శకుడు పాత్రలకు తగ్గ ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రతి ఒక్కరూ ఆయా పాత్రను సమర్థవంతంగా పోషించడంతో పాటు, ఈ పాత్రకు ప్రత్యామ్నాయం లేదు అనే విధంగా నటించారు. శివాజీ పాత్ర మంగపతికి పూర్తి భిన్నంగా ఉన్నా అక్కడక్కడా ఆ పాత్ర ఛాయాలు కనిపించాయి. శ్రీలత పాత్రలో బింధు మాధవి, సర్పంచ్‌గా నవదీప్‌ మెప్పించారు. మిగతా పాత్రలు అంతగా ప్రభావం చూపలేదు. మార్క్‌ కె రాబిన్‌ నేపథ్య సంగీతం సన్నివేశంలోని బలాన్ని పెంచింది. ఫోటోగ్రఫీ కథలోని మూడ్‌ని తెలియజేసింది. దర్శకుడు మురళీ కాంత్‌ తను చెప్పాలనుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పాడు.

ఫైనల్‌గా: ఈ సమాజానికి చెప్పాలనుకున్న ఓ మంచి విషయాన్ని నిజాయితీగా చేసిన ప్రయత్నమే 'దండోరా'. గ్రామీణ ప్రేమకథలు, రూటెడ్‌  స్టోరీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులు 'దండోరా'ను ఎటువంటి సంకోచం లేకుండా చూడొచ్చు.